ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

గాజా కాల్పుల విరమణకు ప్రయత్నాలు ఫలిస్తాయా..? 

గాజా కాల్పుల విరమణకు ప్రయత్నాలు ఫలిస్తాయా..? 

గాజా మారణహోమం మొదలై ఆరునెలలు పూర్తవుతోంది . అయితే ఈ యుద్ధంలో ఎంతవరకూ లక్ష్యాన్ని సాధించిందో ఇజ్రాయెల్‌కు సైతం అంతుచిక్కని పరిస్థితి. హమాస్ ఉగ్రవాదుల్ని వేటాడుతున్నప్పటికీ.. ఇంకా వారి సంఖ్య వేలల్లోనే ఉంది. ఎవరు ఎక్కడ ఉన్నారో పూర్తిగా అర్థంకాని పరిస్థితి. వెతికివెతికి మరీ వేటాడి చంపుతోంది. కానీ ఈ యుద్ధంలో అమాయక గాజాపౌరులు..33 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.ఎక్కడ ఉండాలో, ఎలా బతకాలో అర్థం కాక.. ఉన్న సిటీలోనే, ఆహార పొట్లాలు, మంచినీటిపై ఆధారపడుతూ దుర్భరజీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇక హమాస్ చెరలో బందీలందరిని విడుదల చేయించగలిగిందా.. అంటే అదీ లేదు.

అయితే గాజాపై పోరులో తాము విజయం సాధించడానికి అడుగు దూరంలో ఉన్నామని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు పేర్కొన్నారు. బందీలందర్నీ విడిచిపెట్టే వరకూ సంధి ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. యుద్ధం మొదలై ఆరు నెలలు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన కేబినెట్ సమావేశంలో ప్రధాని నెతన్యాహు ఈ విధంగా స్పందించినట్లు సమాచారం. ఒప్పందానికి సంబంధించిన చర్చలు అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో కైరోలో తిరిగి మొదలవుతాయని భావిస్తోన్న తరుణంలో బెంజమిన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఒప్పందానికి సిద్ధమే, లొంగిపోవడానికి కాదు. అంతర్జాతీయంగా వస్తోన్న ఈ ఒత్తిడి ఇజ్రాయెల్‌పై చేసే బదులు.. దీనిని హమాస్‌ వైపు మళ్లించాలి. తద్వారా బందీలు త్వరగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది’ అని ఇజ్రాయెల్‌ ప్రధాని స్పష్టం చేశారు. తమపై ఎవరు దాడి చేసినా, చేయాలని ప్రయత్నించినా.. వారిపై ప్రతిదాడులు తప్పవన్నారు.

ప్రస్తుతం ఇదే కొనసాగుతోందని.. అన్ని వేళలా ఇదే సూత్రాన్ని ఆచరణలో పెడతామని అన్నారు. మరోవైపు.. ఆదివారం గాజా నుండి వైదొలిగిన ఇజ్రాయెల్ దళాలు ఎన్‌క్లేవ్‌లోని దక్షిణ నగరమైన రఫా సహా భవిష్యత్ కార్యకలాపాలకు సిద్ధమయ్యాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ చెప్పారు, మరోవైపు.. ఈజిప్ట్ రాజధాని కైరోలో కతార్ ప్రధాన మంత్రి , CIA చీఫ్‌తో కాల్పుల విరమణ చర్చలను పునఃప్రారంభమయ్యాయి. అయితే ఈ చర్చల్లో ఉన్నత స్థాయి ఇజ్రాయెల్ అధికారులు ఉన్నారా అన్నదానిపై క్లారిటీలేదు. మరోవైపు...దాడులను వెంటనే ఆపాలని అనేక దేశాలు ఇజ్రాయెల్‌ను డిమాండ్‌ చేస్తున్నాయి. గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రత మండలి, మానవహక్కుల మండలిలు తీర్మానం రూపంలో గొంతెత్తాయి.

నవంబరులో ఓసారి కాల్పుల విరమణ సాధ్యమైనప్పటికీ.. మరోసారి ఈ అంశం చర్చల దశలోనే నిలిచిపోయింది. దక్షిణాఫ్రికా, కొలంబియాలు యుద్ధ పరిణామాలను అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాయి. హమాస్‌ను అంతం చేసేవరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని నెతన్యాహు స్పష్టం చేస్తున్నారు. ద్విదేశ పరిష్కారాన్ని వ్యతిరేకిస్తోన్న ఆయన తీరుపై మిత్రదేశం అమెరికా సైతం పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదిలాఉంటే, హమాస్‌ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్‌.. ఆరు నెలలుగా వాటిని కొనసాగిస్తోంది. గాజాలో అనేక ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసింది. ఈ క్రమంలో వేల సంఖ్యలో ఉగ్రవాదులతో పాటు సాధారణ పాలస్తీనీయన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌-హమాస్‌ వరకు పరిమితమైన ఈ యుద్ధం.. ఇరాన్‌ జోక్యంతో మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :