ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఎన్నికలు ముగిశాక ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ: సీఎం రేవంత్ హామీ

ఎన్నికలు ముగిశాక ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ: సీఎం రేవంత్ హామీ

ఆగస్ట్ 15వ తేదీలోపు రైతులందరికీ ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ప్రస్తుతం అమలు చేయలేకపోతున్నామని, అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రతి రైతుకూ రుణమాఫీ అందుతుందని స్పష్టం చేశారు. నారాయణపేటలో నిర్వహిస్తున్న జన జాతర బహిరంగ సభలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. వచ్చే సారి పండించే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేసే బాధ్యత తనదని, అధికారంలోకి రాగానే 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లకు రూ. 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని రేవంత్ వెల్లడించారు. ఇచ్చిన మాట మేరకు మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశామని, కృష్ణ – వికారాబాద్ రైల్వే లైన్ 100 రోజుల్లో నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

అనంతరం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన రేవంత్.. బిడ్డ బెయిల్ కోసం ఆయన తమ నాయకుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి 5 ఎంపీ స్థానాల్లో మోదీనీ గెలిపించేందుకు సుపారీ తీసుకున్నాడని ఆరోపించారు. ‘‘నా బిడ్డ పెళ్లి జరుగుతున్నప్పుడు వదలకుండా నన్ను జైల్లో పెట్టించిన కేసీఆర్.. ఇప్పుడు ఆయన బిడ్డ జైలుకు పోగానే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టేశాడు’’ అంటూ కేసీఆర్‌పై  రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముదిరాజ్‌లకు రేవంత్ ప్రత్యేక హామీ:
అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజులకు కేసీఆర్ ఒక్క సీటు కూడా ఇవ్వలేదని విమర్శించిన రేవంత్.. తెలంగాణలో 14 ఎంపీ స్థానాల్లో గెలిపించడంతో పాటు మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం ముదిరాజ్‌‌ను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ముదిరాజులు బీసీ-డీ నుంచి బీసీ- ఏగా మారాలంటే కాంగ్రెస్ గెలవాలని స్పష్టం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :