ASBL NSL Infratech

కోడెల శివరాం తీరుపై చంద్రబాబు ఆగ్రహం.. వేటు తప్పదా..?

కోడెల శివరాం తీరుపై చంద్రబాబు ఆగ్రహం.. వేటు తప్పదా..?

సత్తెనపల్లి వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ గా, అభ్యర్థిగా కన్నా లక్ష్మినారాయణ పేరును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. కన్నాను ఇన్ ఛార్జ్ గా నియమించడాన్ని కోడెల శివరాం జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా పార్టీ అధినేత చంద్రబాబు పైనే ఆయన నేరుగా కామెంట్స్ చేశారు. ఇదిప్పుడు టీడీపీలో గరంగరంగా మారింది. శివరాం తీరుపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అవసరమైతే వేటు వేయడానికి కూడా వెనకాడబోనని ఆయన హెచ్చరించడం వెనుక ఇదే కారణంగా కనిపిస్తోంది.

సత్తెనపల్లి ఒకప్పుడు కోడెల కంచుకోట. కోడెల శివప్రసాద్ ఇక్కడి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా, స్పీకర్ గా పనిచేశారు. పక్కనే ఉన్న నరసరావుపేట నుంచి కోడెల ఫ్యామిలీ సత్తెనపల్లికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వరుసగా నెగ్గుతూ వచ్చారు. దీంతో టీడీపీ అంటే కోడెల.. కోడెల అంటే టీడీపీ అన్నట్టు మారిపోయింది వ్యవహారం. అయితే అనూహ్యంగా కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఆయన కుమారుడు కోడెల శివరాం ఇక్కడ పార్టీ బాధ్యతలు మోస్తున్నారు. పార్టీ చేపట్టిన కార్యక్రమాలన్నింటిని నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే కోడెల శివరాంతో పాటు మరికొంతమంది నేతలు కూడా ఇక్కడ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. పైగా శివరాంతో వీళ్లకు అస్సలు పొసగట్లేదు. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారు. ఇది పార్టీ హైకమాండ్ కు పెద్ద సమస్యగా మారింది.

వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే కన్నా లక్ష్మినారాయణ లాంటి సీనియర్ అయితేనే బెస్ట్ అని చంద్రబాబు భావించారు. పైగా కన్నా సామాజిక వర్గానికే చెందిన అంబటి రాంబాబు ఇక్కడ మంత్రిగా ఉన్నారు. ఆయన్ను ఎదుర్కోవాలంటే కన్నాయే కరెక్ట్ అని డిసైడయ్యారు చంద్రబాబు. అందుకే కన్నా లక్ష్మినారాయణను ఇన్ ఛార్జ్ గా నియమించారు. దీన్ని కోడెల శివరాం అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబం పార్టీని మోస్తోందని, ఇప్పుడు తమను కాదని వేరే వాళ్లకు టికెట్ ఇవ్వడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాక, తాను, తన తల్లి చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం మూడేళ్లుగా అడుగుతున్నా ఇవ్వలేదని ఆరోపించారు. పైగా సాక్షి పేపర్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కూడా పలు ఆరోపణలు చేశారు. దీంతో చంద్రబాబు పుల్ ఫైర్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

కోడెల శివరాం అలక వహించగానే చంద్రబాబు నక్కా ఆనంద్ నేతృత్వంలో ఒక టీంను ఆయన దగ్గరకు పంపించారు. చర్చలు జరిపించారు. త్వరలోనే వాళ్లు చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేయిస్తామని మాటిచ్చారు. ఆ తర్వాత కూడా కోడెల శివరాం పలు ఆరోపణలు చేయడంతో చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది. ఇదే తీరుగా వ్యవహరిస్తే వేటు వేసేందుకు కూడా వెనకాడకూడదని భావిస్తున్నట్టు సమాచారం. అయితే పార్టీ అంతర్గత సర్వేల్లో కోడెల శివరాంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్టు తెలుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో కోడెల శివరాంకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని, ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్నప్పుడు ఇలాంటిచోట్ల రాజీ పడకూడదని చంద్రబాబు భావించి కన్నా లక్ష్మినారాయణకు పగ్గాలిచ్చారు. మరి కోడెల శివరాం అలక మానుతారా.. లేదా.. అనేది వేచి చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :