ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

పార్టీ కోసం ఫ్యామిలీ మొత్తం బరిలోకి..!!

పార్టీ కోసం ఫ్యామిలీ మొత్తం బరిలోకి..!!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. మరో నెల రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన పార్టీలు ఇప్పుడు ప్రచారంలో ఫుల్ బిజీ అయిపోయాయి. ఎప్పటికప్పుడు లెక్కలను బేరీజు వేసుకుంటూ వ్యూహాలు రచిస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీని ఓడించేందుకు ఎన్డీయే కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు చావోరేవో అన్నట్టు తయారయ్యాయి. అందుకే అవకాశాన్ని ఏ మాత్రం మిస్ చేసుకోకూడదని భావిస్తున్న చంద్రబాబు.. కుటుంబాన్ని మొత్తం రంగంలోకి దించబోతున్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకూ వాళ్లంతా రణక్షేత్రంలో ఉండనున్నారు.

చంద్రబాబు ఇప్పటికే ప్రజాగళం పేరిట రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో లోకేశ్ కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు కానీ ఈసారి మాత్రం ఆ బాధ్యత మొత్తం చంద్రబాబే తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రతి రోజూ రెండు మూడు నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఆయన యాత్ర సాగుతోంది. టీడీపీకి మాత్రమే కాకుండా జనసేన, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న చోట కూడా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. కూటమి గెలుపు బాధ్యతను ఆయన భుజానికెత్తుకున్నట్టు కనిపిస్తోంది. పార్టీల మధ్య సమన్వయం, అభ్యర్థులకు సహకారం.. లాంటి అంశాలను ఆయన ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తదనుగుణంగా సూచనలు ఇస్తున్నారు.

లోకేశ్ ఈసారి పూర్తిగా మంగళగరికి మాత్రమే పరిమితమయ్యారు. గత ఎన్నికల్లో ఓవైపు చంద్రబాబు, మరోవైపు లోకేశ్ విస్తృతంగా తిరిగారు. కానీ మంగళగిరిలో గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు లోకేశ్. అందుకే నిత్యం మంగళగిరి ప్రజల్లో మమేకమవుతున్నారు. అయితే ఇకపై లోకేశ్ కు అండగా బ్రాహ్మణి కూడా రంగంలోకి దిగబోతోంది. నెలరోజులపాటు బ్రాహ్మణి పూర్తిగా మంగళగిరిలో మకాం వేయబోతోంది. లోకేశ్ అడపాదడపా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, అవసరమైతే ఎన్డీయే అభ్యర్థులకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు బ్రాహ్మణి మంగళగిరి వ్యవహారాలు చూసుకోనున్నారు.

ఇక చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రస్తుతం నిజం గెలవాలి పేరిట యాత్రలు చేస్తున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలకు భరోసానిస్తూ ఆర్థిక సాయం చేస్తున్నారు. అయితే ఈ యాత్ర దాదాపు తుది దశకు చేరుకుంది. ఇది ముగియగానే కుప్పంలో భువనేశ్వరి మకాం వేయబోతున్నారు. కుప్పంలో ఈసారి చంద్రబాబును ఓడిస్తామని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. అయితే దాన్ని ధీటుగా ఎదుర్కొని భారీ మెజారిటీ సాధించేలా భువనేశ్వరికి ఆ బాధ్యతలు చంద్రబాబు అప్పగించినట్లు సమాచారం. బాబు ఆదేశం మేరకు ఆమె కుప్పంలో ప్రచారం చేయడంతో పాటు శ్రేణులతో మమేకమవుతూ దిశానిర్దేశం చేయనున్నారు.

ఇక బాలకృష్ణ హిందూపురంలో ఇప్పటికే సైలెంట్ గా ప్రచారం కానిచ్చేస్తున్నారు. అయితే త్వరలో ఆయన కూడా రాష్ట్రవ్యాప్తంగా పార్టీకోసం ప్రచారం చేయబోతున్నారు. అలాంటప్పుడు హిందూపురం వ్యవహారాలను ఆయన భార్య వసుంధరా దేవి చూసుకోనున్నారు. ఇప్పటికే బాలకృష్ణ హిందూపురంలో ఇల్లు తీసుకున్నారు. ప్రతి మూడు నెలలకోసారి ఫ్యామిలీ అక్కడికి వెళ్లి వస్తోంది. ఇప్పుడు వసుంధర పూర్తిగా హిందూపురంలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారం కొనసాగించనున్నారు. ఇలా ఫ్యామిలీ మొత్తం ఎన్నికల భారాన్ని మోయబోతోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :