ASBL NSL Infratech

గులాబీ ధీమా అదేనా?

గులాబీ ధీమా అదేనా?

తెలంగాణలో మళ్లీ అధికారం గులాబీ పార్టీదేనా? దశాబ్దంలో శతాబ్ధి అభివృద్ధి నినాదంతో గులాబీసేన దూసుకుపోనుందా? ఎన్నికల సమయంలో మరిన్ని సంక్షేమవరాలను కేసీఆర్ ప్రకటిస్తారా? పార్టీపై నిరుద్యోగులు, ఉద్యమకారుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. దాన్ని అధిగమించే మంత్రదండం.. కేసీఆర్ దగ్గర ఉందా? హస్తం, కమలం పార్టీలు బలోపేతమయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండడంతో... కేసీఆర్ అండ్ కో కౌంటర్ టాక్టిక్స్ ప్రిపేర్ చేస్తోందా?

కర్నాటక ఎన్నికల ముందు వరకూ రాష్ట్రంలో కమలం బలోపేతమవుతున్న సూచనలు కనిపించాయి. దీనికి తోడు దుబ్బాక,హుజూర్ నగర్ నియోజక వర్గాల్లో విజయం సాధించడంతో.. బీఆర్ఎస్ ను గద్దె దించగలిగేది కమలం ఒక్కటే అన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించడంలో కృతకృత్యులయ్యారు. అయితే కర్నాటక ఎన్నికల్లో బీజేపీ పరాజయం తర్వాత.. రాష్ట్రంలో కమలం శ్రేణులు కాస్త నిస్తేజమయ్యాయని చెప్పొచ్చు. చేరికల కమిటీ తన ప్రయత్నాలు చేస్తున్నా.. మిగిలిన పార్టీల నేతలు పెద్దగా పట్టించుకున్న పరిస్థితి కనిపించడం లేదు

బీజేపీకి అన్ని స్థానాల్లో నిలబెట్టేందుకు అభ్యర్థుల్లేరంటూ ప్రత్యర్థి పార్టీల విమర్శల్లోనూ కొంత నిజం ఉందని చెప్పొచ్చు. కమలానికి లీడర్లే కాదు.. చాలా ప్రాంతాల్లో పూర్తిస్థాయి కేడర్ కూడా లేదని చెప్పకతప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆపార్టీ గులాబీ దళాన్ని ఎలా ఎదుర్కొంటుంది. ఇప్పుడిదే ప్రశ్న .. రాష్ట్రంలోని రాజకీయనాయకుల్లో వ్యక్తమవుతోంది. ఓన్లీ హిందూత్వతో పని అవుతుందా? ఓట్లు రాలతాయా? ఈప్రశ్నలకు వచ్చే ఎన్నికల ఫలితాలే బదులిస్తాయి.

కర్నాటక ఎన్నికల తర్వాత హస్తం పార్టీలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. పార్టీని వదిలి వెళ్లిన నేతలందరూ ఘర్ వాపసీ కావాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలుసందర్భాల్లో  పిలుపునిచ్చారు. అయితే ఇటీవలి కాలంలో ఆపార్టీ నేతలు సైతం ఏకతాటిపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు పుట్టి ముంచే ప్రమాదం ఉందని సగటు కాంగ్రెస్ అభిమాని ఆందోళన చెందుతున్నాడు.

విపక్షాలు రెండూ బలోపేతమయ్యేందుకు ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. అంటే రెండు పార్టీలు బలోపేతమైనప్పటికీ.. అవి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే పరిస్థితి ఉంటుంది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే.. ఇక అధికార పార్టీ గెలుపునకు బాటలు పడతాయని బీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తోంది. అందుకే రాజకీయ వ్యూహాల్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ..... పక్కా బ్లూప్రింట్ తో కేసీఆర్ ముందుకెళ్తున్నారన్న టాక్.. గులాబీదళంలో వినిపిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :