ASBL NSL Infratech

మునుగోడు బైపోల్‌పై బీజేపీ భయపడుతోందా?

మునుగోడు బైపోల్‌పై బీజేపీ భయపడుతోందా?

మునుగోడు ఉపఎన్నిక నవంబర్ లేదా డిసెంబర్ లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ మునుగోడులో పాగా వేశాయి. జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. అయితే బీజేపీకి ఈ ఉపఎన్నిక చాలా ప్రతిష్టాత్మకం. ఎందుకంటే ఏరికోరి ఈ ఉపఎన్నికను తీసుకొచ్చింది బీజేపీ. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీ ఇక్కడ గెలిచి తీరాలి. లేకుంటే మాత్రం బీజేపీకి తెలంగాణలో ఇబ్బందులు తప్పవు. మరి బీజేపీ పరిస్థితి ఏంటి.. మునుగోడులో ఏం చేయబోతోంది..?

మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. వాస్తవానికి మునుగోడులో బీజేపీకి పెద్దగా పట్టు లేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 12వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి పెద్ద ప్లస్. కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని కుటుంబం కోమటిరెడ్డిది. ఇప్పుడు అలాంటి ఫ్యామిలీ బీజేపీలోకి రావడంతో కమలానికి పెద్ద ఊపు వచ్చింది. కోమటిరెడ్డితోపాటు కాంగ్రెస్ కేడర్ కూడా బీజేపీలోకి వచ్చింది. దీంతో తమదే గెలుపని గట్టిగా నమ్ముతోంది కమలం పార్టీ.

అయితే మునుగోడులో వాస్తవ పరిస్థితులు వేరేగా ఉన్నాయనే రిపోర్టులు బీజేపీలో అంతర్గతంగా ఆందోళన కలిగిస్తున్నట్టు సమాచారం. ఏరికోరి తెచ్చిన ఎన్నిక కావడం, కోమటిరెడ్డిపై కాస్త వ్యతిరేకత, టీఆర్ఎస్ - కాంగ్రెస్ వ్యూహాలు బీజేపీని దెబ్బ తీస్తాయేమోననే భయం వెంటాడుతోంది. వివేక్, జితేందర్ రెడ్డిలతో కూడిన స్టీరింగ్ కమిటీ ఎప్పటికప్పుడు మునుగోడు గ్రౌండ్ రిపోర్టును తెప్పించుకుంటోంది. గ్రామాలవారీగా పరిస్థితులను అంచనా వేస్తోంది. భారమంతా కోమటిరెడ్డి వ్యక్తిగత చరిష్మాపైనే ఆధారపడి ఉందనే రిపోర్ట్ అందుతోంది.

మునుగోడు బైపోల్ ను అమిత్ షా నేరుగా పర్యవేక్షిస్తున్నారు. టీఆర్ఎస్ - కాంగ్రెస్ వ్యూహాలను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తున్నారు. మునుగోడు బైపోల్ లో ఎలాగైనా గెలిచి తీరాలనేది అమిత్ షా పట్టుదల. అందుకే ప్రతి నెలా పలువురు ఢిల్లీ పెద్దలు మునుగోడులో వాలిపోతున్నారు. బీజేపీని గెలిపించేందుకు శతవిధాలా కృషి చేస్తున్నారు. మునుగోడు బైపోల్ తర్వాత దోపిడీదారుల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు.

దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలిచిన జోష్ లో ఉంది బీజేపీ. అదే జోష్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తామనే నమ్మకంతో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖతమైపోయి కోమటిరెడ్డితోపాటు బీజేపీ వైపు మళ్లుతుందని ఆశించింది. అయితే గ్రౌండ్ లెవల్లో ఆ పరిస్థితి లేదని అర్థమవుతోంది. పలు సర్వేలు రెండో స్థానం కాంగ్రెస్ కే దక్కే అవకాశం ఉందని తేల్చాయి. మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా బీజేపీకి మూడో స్థానమేనని బహిరంగంగా వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీలో గుబులు మొదలైంది. ఏరికోరి తెచ్చుకున్న ఉపఎన్నికలో బోల్తా పడితే అది జనరల్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పైగా బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట పడినట్లే. అందుకే బీజేపీ అలెర్ట్ అయింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ కేడర్ కు దిశానిర్దేశం చేస్తోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో!

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :