ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

శరణాలయాలు, మౌలిక కల్పనకు ప్రాధాన్యం ఇచ్చిన నాటా

శరణాలయాలు, మౌలిక కల్పనకు ప్రాధాన్యం ఇచ్చిన నాటా

- తెలుగు టైమ్స్‌ ఇంటర్వ్యూలో రాఘవరెడ్డి గోసల

అమెరికా, కెనడా దేశాల్లో ఉంటున్న తెలుగువారి అభ్యున్నతికి కృషి చేస్తూ, వారి సంక్షేమానికి పాటుపడుతూనే ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) మాతృరాష్ట్రాలలో కూడా నాటా సేవా డేస్‌ పేరుతో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 2019 డిసెంబర్‌ నెలలో నాటా 'సేవా డేస్‌' పేరుతో మాతృరాష్ట్రాలలోని తెలుగు ప్రజలకు సేవలందించింది. కాకపోతే ఈ సారి నిర్వహించిన కార్యక్రమాలను నాటా నాయకులు విభిన్నంగా నిర్వహించారు. ఎక్కడా బహిరంగ కార్యక్రమాల జోలికిపోకుండా తాము చేసే సహాయాన్ని అవసరమైనవారికి మాత్రమే అందించి తమ సేవా కార్యక్రమాల్లో విభిన్నతను చాటుకున్నారు. ఈ సందర్భంగా నాటా అధ్యక్షుడు రాఘవరెడ్డి గోసలను తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పిన విషయాలను ఇక్కడ వివరంగా ఇస్తున్నాము.

ఈసారి నాటా సేవా డేస్‌ కార్యక్రమాల గురించి చెప్పండి?

ప్రతి రెండేళ్ళకోమారు నాటా మాతృరాష్ట్రాల్లోని ప్రజలకు సేవాడేస్‌ పేరుతో వివిధ కార్యక్రమాలను నిర్వహించి సేవలందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా నాటా ఆధ్వర్యంలో తెలుగురాష్ట్రాల్లోని ప్రజలకు సేవలందించాలని నిర్ణయించాము. కాకపోతే ఈసారి మేము విభిన్నంగా ఈ సేవాడేస్‌ కార్యక్రమాలను చేయాలని భావించాము. అందుకు అనుగుణంగా బహిరంగ కార్యక్రమాలకు, అనవసర ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేయకుండా ఆ నిధులను కూడా ఎన్‌జీవో సంస్థలకు అందించాలని అనుకున్నాము. అందుకు తగినట్లుగానే ఈ కార్యక్రమాలను ప్లాన్‌ చేసి నిర్వహించాము. అనాథ శరణాలయాలు, ఓల్డ్‌ ఏజ్‌ హోమ్స్‌, వికలాంగుల వసతి గృహాలకు చేయూతను అందించడానికి ప్రాధాన్యం ఇచ్చాము. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన వసతుల కల్పనకు, వీధిలైట్ల ఏర్పాటు, మంచినీటి సౌకర్యం వంటి ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కూడా సహాయాన్ని అందించాము. దాదాపు కోటి రూపాయలను ఈ సేవా కార్యక్రమాలకు వినియోగించాము.

మీతోపాటు ఎవరెవరు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు?

నాటా సేవాడేస్‌ కార్యక్రమాల్లో పలువురు ముఖ్య నాటా నాయకులు పాలుపంచుకున్నారు. నాటా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటి, సెక్రటరీ ఆళ్ళరామిరెడ్డి, ట్రెజరర్‌ నారాయణ రెడ్డి గండ్ర, వైస్‌ ప్రెసిడెంట్‌ (ఇంటర్నేషనల్‌) ఉదయ్‌ కిరణ్‌ బసిరెడ్డి, శ్రీనివాస్‌ కనుగంటి, బోర్డ్‌ డైరెక్టర్‌లు గిరీష్‌ రామిరెడ్డి, సుధారాణి కొండపు, రాధాకృష్ణ కలువాయి, జనార్ధన్‌ బోయెళ్ళ, హరివెల్కూర్‌, ప్రతాప్‌ భీంరెడ్డి, తెలంగాణ కో ఆర్డినేటర్‌ రమాదేవి నారగాని, మీడియా కో ఆర్డినేటర్‌ కోటి రెడ్డి, నాటా సేవాడేస్‌ కో ఆర్డినేటర్‌ ఆళ్ళ నవీన్‌ రెడ్డి, ఇండియా కో ఆర్డినేటర్‌ ప్రసాద్‌ మల్లు, ఎపి కో ఆర్డినేటర్‌ రఘునాథ్‌ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

ఈసారి హైలైట్‌ అంశాలేమిటి?

నాటా సేవాడేస్‌ కార్యక్రమాల్లో భాగంగా నాటా నాయకులు దాదాపు 4,000 కి.మీ, 18 జిల్లాల పర్యటన, దాదాపు 50కిపైగా సేవా సంస్థల సందర్శన, ఆర్థిక సహాయం అందజేయడం వంటివి ఈసారి హైలైట్‌గా నిలిచిన అంశాలని చెప్పవచ్చు. దాంతోపాటు మేము వెళ్ళిన ప్రతిచోటా మాకు మంచి ఆదరణే లభించింది.

ఎక్కడెక్కడ పర్యటించారు?

తిరుపతిలోని ఆశ్రయ వెల్‌ఫేర్‌ ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌, చిత్తూరు జిల్లాలోని సంత పేటలో ఉన్న అనాథ శరణాలయం అమ్మఒడి సేవాశ్రమం, నెల్లూరు జిల్లాలోని ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ అనఘ వృద్ధ విశ్రాంతి ఆశ్రమం, పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న హనుమాన్‌ జంక్షన్‌ వద్ద ఉన్న వికలాంగుల శరణాలయం ఆశాజ్యోతి కేంద్రం, ఏలూరులో ఉన్న అనాథ శరణాలయం ఆశ కేంద్రం, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉన్న బాపూజీ ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌కు, శ్రీకాకుళంలోని బెహర మనోవికాస కేంద్రం, ఒంగోలులోని బొమ్మరిల్లు అనాథ శరణాలయం, విశాఖపట్టణంలో ఉన్న అనాథ శరణాలయం కేర్‌ అండ్‌ లవ్‌, నల్లగొండ జిల్లాలోని పానగల్లులో ఉన్న చారుమతి అనాథ శరణాలయం, నెల్లూరు జిల్లా గొల్లపల్లిలో ఉన్న చైల్డ్‌ ఆశ్రమం, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని ఎల్లాయపల్లెలో ఉన్న అనాథ శరణాలయం, చిన్మయారణ్యం ఆశ్రమం, గుంటూరు జిల్లా పొన్నూరులోని అనాథ శరణాలయం డిసిపుల్స్‌ ఆఫ్‌ డివైన్‌ మాస్టర్‌ సొసైటీ, అనంతపురం జిల్లా హిందుపురంలో ఉన్న జిఆర్‌ఎస్‌విహెచ్‌ స్కూల్‌ ఫర్‌ బ్లైండ్‌, నెల్లూరు జిల్లా కొండయపాలెంలో ఉన్న అనాథ శరణాలయం జనహిత వాత్సల్య, అనంతపురంలోని అనాథ శరణాలయం జీవాని వలంటరీ ఆర్గనైజేషన్‌, హైదరాబాద్‌ జిల్లా కొంపల్లిలో ఉన్న అనాథ శరణాలయం ఖుషీ హోమ్‌, సాధన మానసిక వికలాంగుల కేంద్రం...ఇలా ఎన్నో శరణాలయాలను సందర్శించి వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాము.

మీ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న ప్రముఖుల వివరాలను చెబుతారా?

ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నిదడవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస నాయుడు, పిసిసి మాజీ అధ్యక్షులు జిఎస్‌ రావుతోపాటు ఎంతోమంది మా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

నాటా మహాసభల వివరాలు చెప్పండి?

న్యూజెర్సిలోని అట్లాంటిక్‌ సిటీలో ఉన్న అట్లాంటిక్‌ సిటీ కన్వెన్షన్‌ సెంటర్‌లో నాటా మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. జూన్‌ 26 నుంచి 28వ తేదీవరకు జరిగే ఈ మహాసభలకోసం ఏర్పాట్లను నాటా ఘనంగా చేస్తోంది. ఈ మహాసభలకు రావాల్సిందిగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను స్వయంగా కలిసి ఆహ్వానించడం జరిగింది. ఈ మహాసభల్లో పాల్గొనాల్సిందిగా వివిధ రంగాల ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నాము.

తెలుగుటైమ్స్‌ ద్వారా మీరు చెప్పదలుచుకున్న సందేశమేమిటి?

అమెరికాలో 16 సంవత్సరాలకుపైగా తెలుగు టైమ్స్‌ పత్రిక మీడియా సేవలను అందిస్తోంది. నాటాతో మంచి అనుబంధాన్ని కలిగిన తెలుగు టైమ్స్‌ ద్వారా న్యూజెర్సిలో  నాటా నిర్వహించనున్న మహాసభలకు అందరూ తరలిరావాలని కోరుకుంటున్నాను.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :