ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆటా వేడుకలకు మంచి స్పందన వచ్చింది - పరమేష్ భీంరెడ్డి

ఆటా వేడుకలకు మంచి స్పందన వచ్చింది - పరమేష్ భీంరెడ్డి

అమెరికాలో ఎన్నో సంఘాలు ఉన్నా అందులో దశాబ్దాల చరిత్ర ఉన్న సంఘంగా అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా)కు గణనీయమైన చరిత్ర ఉంది. అమెరికా తెలుగువారికి మాతృసంస్థగా 'ఆటా' వ్యవహరిస్తోంది. అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళల పరిరక్షణకు కృషి చేస్తూ మరోవైపు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలకు కూడా తనవంతుగా సేవలందిస్తోంది. ప్రతి రెండేళ్ళకోమారు ఆటా వేడుకలు పేరుతో మాతృరాష్ట్రాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 2019 డిసెంబర్‌ నెలలో ఆటా రెండు రాష్ట్రాల్లో నిర్వహించిన వేడుకలు విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆటా అధ్యక్షుడు పరమేష్‌ భీంరెడ్డిని 'తెలుగు టైమ్స్‌' ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పిన విషయాలు.

ఆటా వేడుకలు 2019 గురించి చెప్పండి?

అమెరికాలో ఉన్న తెలుగువారితోపాటు మాతృరాష్ట్రంలో ఉన్న తెలుగువారికి ఆటా ఎల్లప్పుడూ సహాయపడుతూనే ఉంది. దానికితోడు ఇక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహించి వారికి ఆటా చేస్తున్న సేవలను ఇతర వివరాలను తెలియజేస్తున్నాము. ఈసారి నిర్వహించిన ఆటా వేడుకలు 2019 సంవత్సరంలో చేసిన కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది. మేము ఊహించినదానికన్నా విజయవంతమైంది. ఆటా వేడుకల కార్యక్రమాల్లో అందరికీ ఉపయోపడే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేశాము.

డిసెంబర్‌ 4 నుంచి 28వ తేదీ వరకు మేము రెండురాష్ట్రాల్లోనూ వేడుకలను చేశాము. వివిధ చోట్ల నిర్వహించిన కార్యక్రమాలు, ఏర్పాటు చేసిన సెమినార్‌లు, వేడుకలు, సేవలు అందరినీ ఎంతగానో ఆకట్టుకోవడం సంతోషకరం. ఆటా టీమ్‌ సమష్టిగా చేసిన కృషి వల్లే ఈ వేడుకలు విజయవంతమయ్యాయి.

ఈ వేడుకల్లో మీతోపాటు ఎవరెవరు పాల్గొన్నారు?

మాతృరాష్ట్రాల్లో నిర్వహించిన ఆటా వేడుకల్లో పాల్గొనడానికి ఆటా ముఖ్యనాయకులంతా అమెరికా నుంచి వచ్చారు. ఆటా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ భువనేష్‌ బూజాల, సెక్రటరీ వేణు, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ నర్సింహారెడ్డి ద్యాసాని, ట్రస్టీ రామకృష్ణారెడ్డి, ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ వల్లపాటి, కిషోర్‌ కుమార్‌, ట్రస్టీలు జయంత్‌ చల్లా, అనిల్‌ బొద్దిరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కిరణ్‌ పాశం తదితరులు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడంతోపాటు వేడుకల విజయవంతానికి కృషి చేశారు.

మీ కార్యక్రమాల్లో పాలుపంచుకున్న ప్రముఖుల వివరాలు చెబుతారా?

తెలంగాణ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, టీటీడి చైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, తెలంగాణ స్టేట్‌ ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆళ్ళ నాని, తెలంగాణ, సాహిత్యఅకాడమీ అధ్యక్షుడు నందినీ సిధారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌, విఎంఆర్‌డీఎ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ తదితరులు పాలుపంచుకున్నారు.

ఈ వేడుకల్లో మంచి స్పందన వచ్చిన కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయా?

మేము వివిధ చోట్ల జరిపిన అన్ని కార్యక్రమాలకు మంచి స్పందనే వచ్చింది. మాకార్యక్రమాల్లో ఇక్కడి విద్యార్థులకోసం నిర్వహించిన ఆటా ఎడ్యుకేషన్‌ సెమినార్‌, బిజినెస్‌ సెమినార్‌ ఎంతో కీలకమైనది. అమెరికాలో చదువుకోవడానికి వచ్చే మన రాష్ట్రాల విద్యార్థులకోసం ఏర్పాటు చేసిన ఈ సెమినార్‌లో ప్రభుత్వ పెద్దలు పాలుపంచుకోవడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ సెమినార్‌కు ఎంతోమంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంతోమందికి ఉపయోగపడేలా ఈ సెమినార్‌ మేము ఊహించినదానికన్నా ఎంతో విజయవంతమైంది. అలాగే రెండు రాష్ట్రాల్లో నిర్వహించిన బిజినెస్‌ సెమినార్‌కు మంచి స్పందనే వచ్చింది. అమెరికాలోనూ, మాతృరాష్ట్రాల్లోనూ బిజినెస్‌ రంగంలో పెట్టుబడులకు పెట్టడానికి ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడానికి మా కార్యక్రమం ఎంతో ఉపయోగపడింది.

ఇతర కార్యక్రమాలు ఏవైనా చేశారా?

ఈ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో అవసరమైన మౌళిక సదుపాయాల ఏర్పాటులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆటా సంఘం అధ్యర్యంలో రూ.1.50 లక్షలతో మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం పొతిరెడ్డిపల్లిలోని పాఠశాలకు రూ.లక్షల విలువ చేసే బెంచీలు, కంప్యూటర్లు, క్రీడాసామాగ్రి, పుస్తకాలను అందించాము. నిర్మల్‌ జడ్‌పి హైస్కూల్‌కు క్లాస్‌రూం బెంచీలు, బ్యాక్‌ప్యాక్‌ కిట్లను అందించాము. హైదరాబాద్‌లోని బధిరుల పాఠశాలకు లక్ష రూపాయల సహాయాన్ని తొలి విడతగా అందించాము. నర్సంపేట పట్టణంలో, సూర్యాపేటలో, ఉండవల్లి ఆముదాలపాడు గ్రామంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ జాబ్‌ మేళా నిర్వహించాము.

తెలుగు సాహిత్యంలో యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు వీలుగా ఆటా అంతర్జాతీయ తెలుగు సాహిత్య సదస్సును నిర్వహించాము. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఈ సదస్సుకు ఎంతోమంది ప్రముఖ కవులు, యువ కవులు హాజరవడం సంతోషాన్ని ఇచ్చింది.

ఆటా కాన్ఫరెన్స్‌ వివరాలు చెబుతారా?

హాలీవుడ్‌ రాజధానిగా పేరు పొందిన లాస్‌ఏంజెల్స్‌లో ఆటా మహాసభలు జరగనున్నాయి. జూలై 3,4,5 తేదీల్లో జరిగే ఈ మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నాము. ఈ మహాసభల విజయవంతానికి అవసరమైన కార్యక్రమాలను చేపట్టాము. ఈ మహాసభల్లో పాల్గొనాల్సిందిగా ఇప్పటికే ఎంతోమందిని ఆహ్వానించాము. మాతృరాష్ట్రాల్లో జరిగిన ఆటా వేడుకల్లో మహాసభల గురించి కూడా ప్రచారం చేయడం జరిగింది. పలువురు ప్రముఖులను స్వయంగా కలుసుకుని ఆహ్వానించాము. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావులను కూడా ఆహ్వానిస్తున్నాము. మా మహాసభలకు సంబంధించిన అన్నీ వివరాలను ఎప్పటికప్పుడు ఆటా వెబ్‌సైట్‌లో తెలియజేస్తున్నాము.

తెలుగుటైమ్స్‌ ద్వారా మీరు చెప్పే సందేశం ఏమైనా ఉందా?

అమెరికాలో గత 16 సంవత్సరాలుగా తెలుగు ఎన్నారైలకు పత్రికాపరంగా సేవలందిస్తున్న తెలుగుటైమ్స్‌తో ఆటాకు చిరకాల అనుబంధం ఉంది. ఈ మహాసభలకు తెలుగుటైమ్స్‌ ద్వారా ఎన్నారైలను ఈ మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :