ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నాగ్‌పూర్‌లో 7 నుంచి ప్రారంభం కానున్న తెలుగు 'పాఠశాల'

నాగ్‌పూర్‌లో 7 నుంచి ప్రారంభం కానున్న తెలుగు 'పాఠశాల'

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న తెలుగు కుటుంబాల చిన్నారుల కోసం ఆంధ్ర అసోసియేషన్‌ తెలుగు పలుకు కోర్స్‌ను ప్రారంభిస్తోంది. అమెరికాలో తెలుగు పలుకు కోర్స్‌ను నేర్పుతున్న 'పాఠశాల' తో కలిసి నాగ్‌పూర్‌లో ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గుర్తింపు పొందిన తెలుగు పలుకు కోర్స్‌ను గత ఐదు సంవత్సరాలుగా అమెరికాలోని చిన్నారులకు పాఠశాల నేర్పిస్తోంది. జనవరి 7వ తేదీన ఈ తెలుగు పలుకు కోర్స్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రతి ఆదివారం 2 గంటలపాటు చిన్నారులకు పాఠశాల ద్వారా తెలుగును నేర్పిస్తామని నాగ్‌పూర్‌ ఆంధ్ర అసోసియేషన్‌ సెక్రటరీ పిఎస్‌ఎన్‌ మూర్తి చెప్పారు. ఇందుకోసం తాము టీచర్లను, క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలిపారు.

పాఠశాల బోధిస్తున్న తెలుగు పలుకు కోర్స్‌ నాలుగు సంవత్సరాలు అని, ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం గుర్తింపు పొందిన ఈ పాఠశాల అమెరికాలో 501 సి (3) సర్టిఫికెట్‌ పొందిన సంస్థ అని పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు తెలిపారు. తరగతుల్లో తెలుగును నేర్పించడంతోపాటు ఆన్‌లైన్‌ ద్వారా కూడా తెలుగును నేర్పిస్తామని, 2 సంవత్సరాల కోర్స్‌ను, 4 సంవత్సరాల కోర్స్‌ను పూర్తి చేసిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్‌ను కూడా అందజేస్తామని ఆయన వివరించారు. నాగ్‌పూర్‌లోనూ, పరిసర ప్రాంతాల్లోనూ ఉన్న తెలుగు కుటుంబాల వారు మాతృభాష తెలుగును తమ చిన్నారులకు నేర్పించేందుకు పాఠశాల దోహదపడుతుందని, అందరూ తమ చిన్నారులను పాఠశాలలో చేర్పించాలని ఆయన కోరారు.

ఇక్కడ నివసిస్తున్న తెలుగు కుటుంబాలకు ఇది మంచి అవకాశమని పాఠశాల సెంటర్‌ కో ఆర్డినేటర్‌ పి.టి. శర్మ అన్నారు. మాతృభాష పరిరక్షణకు తమవంతుగా పెద్దలు ముందుకువచ్చి పాఠశాలను ప్రోత్సహించాలన్నారు.

నాగ్‌పూర్‌లో పాఠశాల బ్రాంచీని ఏర్పాటు చేసేందుకు సహకరించిన రాంటెక్‌ ఎమ్మెల్యే మల్లిఖార్జున రెడ్డి, జాతీయ రోడ్లు, భవనాలశాఖ ప్రాంతీయ అధికారి ఎం. చంద్రశేఖర్‌, నాగ్‌పూర్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. కె. వెంకటేశం పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంగీకరించడం పట్ల వారికి ఆంధ్ర అసోసియేషన్‌ తరపున ధన్యవాదాలు చెబుతున్నట్లు కార్యదర్శి పిఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :