US: లక్షమందికిపైగా ఇండియన్స్ కు బహిష్కరణ గండం..

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత అక్కడ నివసిస్తున్న భారతీయులు సహా విదేశీయుల్లో కొత్త భయాలు ప్రారంభమయ్యాయి. అక్రమంగా లేదా నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న విదేశీయులందరినీ వారివారి దేశాలకు పంపిస్తామని బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ స్పష్టం చేశారు.
డిపెండెంట్ వీసాలపై ఉన్నవారి పరిస్థితి
అమెరికాలో హెచ్ 1 బీ వీసాదారుల పిల్లలు ఇప్పుడు అమెరికాను వీడాల్సిన పరిస్థితి నెలకొంది. హెచ్ 1 బీ వీసాదారుల పిల్లలు మైనర్లుగా అమెరికాకు వెళ్లి, అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసినవారు, ఇప్పుడు తిరిగి స్వదేశం తిరిగిరావాల్సిన పరిస్థితి ఉంది. తల్లిదండ్రులతో పాటు మైనర్లుగా యూఎస్ వెళ్లి, ఇప్పుడు మైనారిటీ తీరి, 21వ పుట్టినరోజుకు చేరుకుంటున్న పిల్లలు దారుణమైన సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే, వారిని ఇకపై వారి తల్లిదండ్రులపై ఆధారపడిన వారిగా వర్గీకరించలేరు. అందువల్ల వారు యూఎస్ లో అక్రమ నివాసులగా నిర్ధారించబడుతారు.
గ్రేస్ పీరియడ్
అయితే, యూఎస్ లో, ఇలాంటి వారు వేరే వీసా విధానానికి మారడానికి రెండు సంవత్సరాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అయితే, ఇప్పుడు ట్రంప్ కొత్త విధానాలు, కొనసాగుతున్న కోర్టు కేసుల పుణ్యమా అని, ఆ గ్రేస్ పీరియడ్ నిబంధన ఇప్పుడు అమలులో ఉందా? లేదా? అనే సందిగ్ఢత నెలకొని ఉంది. దీనిపై ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు.
సుమారు 1.3 లక్షల మంది..
ఇప్పుడు వారి ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి తిరిగి స్వదేశానికి తిరిగిరావడం. కానీ, వారు చిన్నప్పటి నుంచి అమెరికాలోనే ఉన్నవారు కావడంతో, ఇక్కడ వారు సెటిల్ కావడం, అడ్జస్ట్ కావడం కష్టం. మరో ఆప్షన్ అమెరికాలోనే ‘ఏదో విధంగా’ కొనసాగడం. మార్చి 2023 నాటి డేటా ప్రకారం, అమెరికాలో ఇండియా నుంచి వెళ్లిన తల్లిదండ్రులు గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తుండగా, డిపెండెంట్ వీసా స్థితి నుంచి బయటకు వచ్చే భారతీయ పిల్లల సంఖ్య దాదాపు 1.34 లక్షలు.
కొత్త గందరగోళం..
డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్ (DACA) కింద కొత్త దరఖాస్తుదారులకు వర్క్ పర్మిట్‌లను ఇవ్వకుండా నిలిపివేస్తూ ఇటీవల టెక్సాస్ కోర్టు ఇచ్చిన తీర్పు గందరగోళాన్ని మరింత పెంచింది. 21 ఏళ్లు నిండిన తర్వాత తమ డిపెండెంట్ స్టేటస్‌ను కోల్పోయే పిల్లలతో సహా, డాక్యుమెంట్లు లేని వలసదారులకు బహిష్కరణ నుండి తాత్కాలికంగా రెండేళ్ల రక్షణను ఈ డీఏసీఏ అందిస్తుంది. దానిని వారు పునరుద్ధరించుకునే అవకాశం కూడా ఉండేది.
భారతీయుల్లో ఆందోళన
ఈ పరిస్థితుల్లో, చాలా మంది భారతీయ యువత తమ అనిశ్చిత భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, వారి తల్లిదండ్రులు గ్రీన్ కార్డ్ పొందడం కోసం 12 నుండి 100 సంవత్సరాల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.