Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నపై వేటు వేసిన కాంగ్రెస్ పార్టీ..!!

తీన్మార్ మల్లన్న.. పేరు తెలియని వారుండరు. తీన్మార్ ప్రోగ్రామ్ ద్వారా సుపరిచితులైన మల్లన్న పేరు చింతపండు నవీన్ కుమార్ (Chinthapandu Naveen Kumar). ఇప్పుడీయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన మల్లన్న ఓడిపోయారు. కొంతకాలం బీజేపీలో (BJP) పని చేశారు. ఇటీవల కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరి ఎమ్మెల్సీగా (MLC) ఎన్నికయ్యారు. అయితే ఆయన వ్యవహరించే తీరు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్ గా మారింది. కులాల మధ్య చిచ్చురేపేలా ఇటీవల మల్లన్న చేసిన కామెంట్స్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయి. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ ఊపందుకున్నాయి. తాజాగా తీన్మార్ మల్లన్నపై వేటు వేసింది కాంగ్రెస్ పార్టీ.
తీన్మార్ మల్లన్న వ్యవహారశైలి ఎప్పుడూ వివాదాస్పదమే. ఆయన చేసే కామెంట్స్ కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఉంటాయి. ఎంతటివాళ్లనైనా లెక్కచేయని మనస్తత్వం ఆయనది. తనతో పాటు తన వర్గం ప్రయోజనాలకోసం ఎదుటి వాళ్లపై బురదజల్లడం ఆయన నైజం. అందుకే ఆయన్ను దరి చేర్చుకునేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపరు. అయినా కొన్ని రాజకీయ పార్టీలు ఆయనకు ఆశ్రయం ఇచ్చాయి. మల్లన్న కూడా తన ప్రయోజనాల కోసమే ఆయా పార్టీలను వాడుకుంటారనే పేరు తెచ్చుకున్నారు. ఆయన పని నెరవేరగానే పార్టీని లెక్కచేయరనే పేరుంది. ఇప్పుడు అదే నిజమైంది. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అవగానే పార్టీని కూడా ఇబ్బందుల్లోకి నెట్టేలా ఆయన వ్యవహార శైలి ఉంది.
రెడ్డి సామాజికవర్గంపై ఇటీవల మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డే (CM Revanth Reddy) చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని.. రెడ్ల పనైపోయిందని చెప్పారు. రెడ్లే చిన్న వర్గాలను తొక్కేశారన్నారు. ఇకపై రెడ్ల అంతు చూస్తామని.. రాబోయేది బీసీల రాజ్యమని చెప్పారు. పైగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణనను పార్టీలోనే ఉండి మల్లన్న వ్యతిరేకించారు. దీంతో మల్లన్నపై చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలే హైకమాండ్ కు ఫిర్యాదులు చేశారు. దీంతో పీసీసీ క్రమశిక్షణ సంఘం మల్లన్నకు నోటీసులు ఇచ్చింది. విచారణ జరిపింది. ఆయన చేసిన కామెంట్స్ పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని భావించి మల్లన్ను పార్టీ నుంచి సస్పెండ్ (Suspension) చేసింది.
పీసీసీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డి.. తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. పార్టీ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా మల్లన్న వ్యవహార శైలి మార్చుకోలేదు. మరింత రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారు. బీసీలకోసం మాట్లాడితే నోటీసులు ఇస్తారా అని ఎదురు ప్రశ్నించారు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని, ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలుసని వ్యాఖ్యానించారు. ఇలా అడుగడుగునా పార్టీ వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తుండడం, నోటీసుల తర్వాత కూడా తీరు మార్చుకోకపోవడంతో మల్లన్నపై వేటు వేయక తప్పలేదు.