Raja Singh: ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా ఆమోదం..!

తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ లోధ్ (MLA Raja Singh) రాజీనామాను బీజేపీ (BJP) అధికారికంగా ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని జాతీయ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ లేఖ ద్వారా ధృవీకరించారు. తెలంగాణ బీజేపీలోని (Telangana BJP) అంతర్గత రాజకీయాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడిగా జి.రామచంద్ర రావును (Ramachandra Rao) నియమించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ జూన్ 30న పార్టీకి రాజీనామా సమర్పించారు.
రాజా సింగ్ తన రాజీనామా లేఖలో రామచంద్ర రావు నియామకంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐడియాలజీ, సంస్థాగత సమస్యలను ప్రస్తావించారు. పార్టీ హైకమాండ్ మాత్రం ఆయన ఆరోపణలను తోసిపుచ్చింది. ఆయన వాదనలు పార్టీ ఆలోచనా విధానానికి, సూత్రాలకు అనుగుణంగా లేవని పేర్కొంది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు, రాజా సింగ్ రాజీనామాను తక్షణమే ఆమోదించినట్లు వెల్లడించింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా జి.రామచంద్ర రావును నియమించడం కొంతమంది పార్టీ సభ్యులకు నచ్చలేదు. ఇందులో రాజాసింగ్ ఒకరు. తాను పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్నానని, తనకు ఆ అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. పార్టీలో హిందు, జాతీయవాద భావనలు కనుమరుగైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అప్పట్లోనే రాజాసింగ్ ఆరోపణలను పార్టీ ఖండించింది. దీన్ని బట్టి ఆయన రాజీనామాను ఆమోదించడం ఖాయమని అందరూ అనుకున్నారు. ఊహించినట్లుగానే ఆయన రాజీనామాను పార్టీ ఆమోదించింది.
తెలంగాణలో రాజా సింగ్ బలమైన నేతగా పేరొందారు. గోషామహల్ నియోజకవర్గాన్ని (Gosha Mahal Assembly) తన కంచుకోటగా మలుచుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన చరిత్ర ఆయనకు ఉంది. ఇప్పుడు ఆయన రాజీనామాను ఆమోదించడంతో ఆ పార్టీకి తీరనిలోటుగానే చెప్పొచ్చు. గోషామహల్ లో ఆయనకంటూ ప్రత్యేక వర్గం ఉంది. సొంత అభిమానులున్నారు. అయితే ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. పార్టీకి రాజీనామా చేసినప్పుడు దాని ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని పలువురు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
ప్రస్తుతం రాజా సింగ్ అమరనాథ్ యాత్రలో ఉన్నారు. ఆయన యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన రాజీనామాపై స్పందించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తారా లేదా అనేది తెలీదు. అయితే తెలంగాణలో శివసేన పార్టీ తరపున రాజా సింగ్ పనిచేయబోతున్నారనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై రాజా సింగ్ ఇంతవరకూ స్పందించలేదు. ఇప్పుడు పార్టీ రాజీనామాను ఆమోదించడంతో ఇకపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.