Telangana BJP : తెలంగాణ బీజేపీ నిద్ర లేచిందా..!?

దక్షిణ భారతదేశంలో కర్నాటక తర్వాత బీజేపీకి అత్యంత పట్టున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఒకానొక దశలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనుకున్నారు. బీఆర్ఎస్ తర్వాత కచ్చితంగా బీజేపీకే తెలంగాణలో భవిష్యత్తు ఉంటుందనుకున్నారు. అయితే బీజేపీ పరిస్థితి మాత్రం రివర్స్ అయింది. కాంగ్రెస్ పనైపోయిందనుకుంటున్న సమయంలో ఏకంగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఇందుకు అనేక కారణాలున్నాయి. అయితే అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో బీజేపీ విఫలమైందని మాత్రం చెప్పొచ్చు.
బీఆర్ఎస్ పదేళ్లపాటు అధికారంలో ఉంది. ఆ సమయంలో బీజేపీ పూర్తి యాక్టివ్ గా ఉండేది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు మూడు చెరువుల నీళ్లు తాగించేవారు. బండి సంజయ్ స్పీడ్, కేంద్ర బీజేపీ జోష్ చూసి తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనుకున్నారు. అయితే ఎన్నికల ముంగిట బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం, కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించడం.. లాంటి పరిణామాలు బీజేపీ స్పీడ్ కు బ్రేకులు వేశాయి. కేడర్ లో కూడా గందరగోళం నెలకొంది. నేతల మధ్య అనైక్యత పార్టీని కొంప ముంచింది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఏకంగా అధికారంలోకి వస్తుందనుకున్న బీజేపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటింది. బీఆర్ఎస్ కు ఒక్క సీటూ రాకుండా చేయగలిగింది. అయితే ఇదంతా మోడీ పుణ్యమే. రాష్ట్ర నేతల మధ్య అనైక్యత మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది. కేంద్రంలో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని తెలంగాణ ప్రజలు నమ్మడంతో ఆ పార్టీకి పెద్ద ఎత్తున సీట్లు కట్టబెట్టారు. ఇంత జరిగనిన తర్వాత కూడా బీజేపీ రాష్ట్ర శాఖ మాత్రం ఇంకా మత్తు వదులించుకున్నట్టు కనిపించట్లేదు.
తెలంగాణ బీజేపీ ఇప్పటికీ పెద్దగా యాక్టివ్ గా లేదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు అడపాదడపా వార్తల్లో కనిపిస్తున్నా కేడర్ మొత్తం పూర్తిగా దిగాలుపడింది. కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రంలో ఆ స్థాయి పాత్ర పోషించడంలో మాత్రం బీజేపీ వెనకబడింది. బీఆర్ఎస్ పనైపోయిందనకుంటున్న సమయంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టి మళ్లీ రేస్ లోకి వచ్చింది గులాబీ పార్టీ. కానీ బీజేపీ మాత్రం కాంగ్రెస్ వైఫల్యాలను క్యాష్ చేసుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేనట్టు అర్థమవుతోంది. నేతలెవరూ పెద్దగా కాంగ్రెస్ సర్కార్ పై ఫోకస్ పెట్టలేదు. అయితే కేంద్రం నుంచి తగిన గైడెన్స్ లేకపోవడం కూడా ఇందుకు కారణం అనే మాట వినిపిస్తోంది. అయితే డిసెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తాజామా కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. మరి ఈసారైనా దూకుడు కంటిన్యూ చేస్తారా.. లేదా అనేది వేచి చూడాలి.