జవదేకర్ భేటీతో ప్రారంభమై, ధర్మేంద్ర ప్రధాన్ ను కలవడంతో ముగిసిన జగన్ ఢిల్లీ పర్యటన

కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో భేటీతో ప్రారంభమైన ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన… కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ కావడంతో ముగిసింది. రెండు రోజుల పాటు సాగిన ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం తాడేపల్లికి చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా సీఎం జగన్ కేంద్ర మంత్రులు అమిత్‌షా, ప్రకాశ్ జవదేకర్, గజేంద్ర సింగ్ షెకావత్, పీయూశ్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం వారితో చర్చించారు. కేంద్ర మంత్రులతో సీఎం జగన్ ఏం చర్చించారంటే….
1. గజేంద్ర సింగ్ షెకావత్ (జలవనరుల మంత్రి)
పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని సీఎం జగన్ కేంద్ర మంత్రి షెకావత్‌కు వివరించారు. పోలవరం ప్రాజెక్టు బకాయిల అంశాన్ని కూడా ఆయన దృష్టికి తెచ్చారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరి భేటీ సాగింది. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలని, ఇందుకు సహకరించాలని సీఎం జగన్ కోరారు.
2. అమిత్ షా (కేంద్ర హోంమంత్రి)
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధి ప్రాజెక్టులు, అభివృద్ధి వికేంద్రీకరణ, విభజన హామీల విషయంపై అమిత్‌షాతో చర్చించారు. వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులను ఏర్పాటు చేసుకున్నామని, ఇందుకు సహకరించాలని కోరారు. అలాగే విద్యుత్ సంస్కరణల్లో ఏపీ ముందంజలో ఉందని, అయితే ప్రస్తుతం కాస్త ఇబ్బందుల్లో ఉన్నామని, తగు సహాయం చేయాలని కోరారు. విద్యుత్ సంస్థ 50 వేల కోట్ల అప్పుల్లో ఉందని, కేంద్రం రాష్ట్రానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీ హైకోర్టులను అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం జగన్ కోరారు.
3. పీయూశ్ గోయల్ (రైల్వే, ప్రజా పంపిణీ మంత్రి)
సీఎం జగన్ కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్‌తో కూడా భేటీ అయ్యారు. రాష్ట్ర సివిల్ సప్లైకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని కోరారు. మరో రెండు నెలల పాటు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించినందుకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఆహార భద్రతా చట్టం కింద ఏపీలో 1.29 కోట్ల రేషన్ కార్డులకు 1,85,640 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతినెలా కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏపీకి రేషన్ బియ్యాన్ని కేటాయిస్తున్న విధానం రాష్ట్ర విభజనకు ముందు నిర్ణయించారని, తెలంగాణ, ఏపీ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేకుండా కేటాయిస్తున్నారని అన్నారు. ఏపీ కన్నా కర్నాటక, గుజరాత్, మహారాష్ట్రలు బాగా అభివృద్ధి చెందాయని, కేంద్రం విధానంతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, రేషన్ భారాన్ని తగ్గించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
4. ధర్మేంద్ర ప్రధాన్ (ఉక్కు, పెట్రోలియం మంత్రి)
చివరగా సీఎం జగన్ కేంద్ర ఉక్కు, పెట్రోలియ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేరే ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని సూచించారు. కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటును వేగవంతం చేయాలని, పెట్రో వర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని, చాలా మంది ఉపాధిని కోల్పోవాల్సి వస్తుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్ రుణాలను ఈక్విటీగా మార్చాలని, ఒడిశాలో ఉన్న ఇనుప ఖనిజం గనులను విశాఖ ప్లాంట్‌కు కేటాయించాలని సీఎం జగన్ కోరారు.