దేశీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెట్టుబడులను ఆకట్టుకునేందుకు వీలుగా విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 (జీఐఎస్)ను భారీ ఎత్తున నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా సమ్మిట్ విజయానికి అవసరమైన కార్యాచరణను, లోగోను, రిజిస్ట్రేషన్లను ప్రారంభిం చారు. ఇప్పటికే ఈ సదస్సుకు అంతర్జాతీయ ప్రముఖులను రాష్ట్రం ఆహ్వానించింది. కీలకమైన 12 రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే విధంగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన రోడ్ షోలకు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే అమెరికాలో కూడా రోడ్ షో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.
వాస్తవ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మార్చి 3, 4 తేదీల్లో ఈ సదస్సును నిర్వహించ నున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ కారణంగా రెండేళ్ల నుంచి ఎటువంటి పెట్టుబడుల సమావేశాలు నిర్వహించలేకపోయామని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నిర్వహిస్తున్న తొలి సదస్సు విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన పెట్టుబడుల సదస్సుకు భిన్నంగా దీనిని నిర్వహిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో రూ.16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు ప్రచారం చేసుకున్నారని, కానీ వాస్తవ రూపంలోకి వచ్చింది రూ.40,000 కోట్లే అని చెప్పారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి లక్ష్యాలు లేకుండా, వాస్తవంగా రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులకు సంబంధించి మాత్రమే ఒప్పందం చేసుకుంటామన్నారు.
రాష్ట్రంలో ఉన్న వనరులను వినియోగించు కుంటూ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించే విధంగా దేశ, విదేశాల్లో రోడ్‌షోలను నిర్వహిస్తున్నా మని మంత్రి అమరనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో విజయవంతంగా పరిశ్రమలు నడుపుతున్న వారు చెబుతున్న అభిప్రాయాలనే బ్రాండిరగ్గా వినియోగించుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షణ, ఎరోస్పేస్, మెరైన్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, టూరిజం, గ్రీన్ ఎనర్జీ, ఎంఎస్ఎంఈ, ఫుట్‌వేర్, పోర్టు ఆధారిత పరిశ్రమలు వంటి రంగాలపై దృష్టి సారించి ఆ దిశగా పెట్టుబడులు వచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మిట్ విజయవంతం కోసం ఇజ్రాయిల్, తైవాన్, దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో రోడ్‌షోలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుని అందుకు తగ్గట్టుగా పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడులతో పాటు స్థానిక పెట్టుబడులను ఆకర్షించే విధంగా దేశ వ్యాప్తంగా వివిధ పట్టణాల్లో కూడా రోడ్‌షోలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే ఇన్వెస్టర్ మీట్‌కు అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించి రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తామన్నారు.
కాగా ఈ సదస్సుకు సంబంధించి లోగోను సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఆవిష్కరించారు.
సదస్సుకు గ్లోబల్ లీడర్లకు ఆహ్వానం
ఏపీలో త్వరలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)కు ప్రముఖ వ్యాపారవేత్తలను ఆహ్వానించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్టణం వేదికగా జరిగే ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, యాపిల్ సీఈవో టిమ్ కుక్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ సీఈవో సత్య నాదెళ్ల వంటి అంతర్జాతీయ దిగ్గజాలను ఆహ్వానించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే 15 మంది కేంద్ర మంత్రులు, 15 రాష్ట్రాల సీఎంలు, 44 మంది అంతర్జాతీయ ఇండస్ట్రియలిస్టులు, 53 మంది భారతీయ వ్యాపారవేత్తలు, వివిధ దేశాల అంబాసిడర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యేలా కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు. రెండ్రోజుల పాటు జరిగే ఈ సదస్సు ద్వారా ఏపీలోకి భారీగా పెట్టుబడులను ఆహ్వానించాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారని సమాచారం. అమెజాన్ చైర్మన్ జెఫ్ బెజోస్, శామ్సంగ్ సీఈవో ఓ హ్యూన్ క్వాన్, ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, కుమార మంగళం బిర్లా తదితరులు ఈ సదస్సులో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన మంత్రులు
విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్`2023 (జీఐఎస్) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జీఐఎస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించి బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కీలకమైన 12 రంగాల్లో దేశీయ, విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేవిధంగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగే ఈ సమ్మిట్‌కు సంబంధించిన లోగోను ఇప్పటికే సీఎం ఆవిష్కరించారని గుర్తుచేశారు. దీనికి విస్తృత ప్రచారం కల్పించే విధంగా ప్రకటనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎంగా జగన్ పదవి చేపట్టిన తర్వాత విజయవాడలో వివిధ దేశాల రాయబారులతో కలిసి డిప్లమాటిక్ సదస్సు నిర్వహించారని, తర్వాత కరోనాతో పెట్టుబడుల సమావేశాలు నిర్వహించలేకపోయామని చెప్పారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ, మారిటైమ్ రంగాలపై రెండు భారీ సదస్సులను నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సదస్సులకు ఈవెంట్ పార్టనర్‌గా సీఐఐ, నాలెడ్జ్ పార్టనర్‌గా కేపీఎంజీ వ్యవహరించనున్నాయని తెలిపారు. వీటి ప్రచారానికి ఈవెంట్ మేనేజర్ ఏజెన్సీ కోసం టెండర్లు పిలిచామన్నారు.
పారిశ్రామికవేత్తల మనోగతమే మాకు బ్రాండింగ్: మంత్రి అమర్నాథ్
సాధారణంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రముఖ సినీ నటులు, క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి భారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. వారు కోరినంత డబ్బులు చెల్లించి మరీ ప్రచారాన్ని చేపడతాయి. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ సహకారం ఉన్నప్పుడు ఇలాంటి కృత్రిమ ప్రచారంతో పనిలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొంటూ, తమకు, ఈ సదస్సు ప్రచారానికి, రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రత్యేకంగా తమకు బ్రాండిరగ్ అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న ప్రజాదరణే తమకు ఉన్న అతి పెద్ద బ్రాండిరగ్ అంటూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ సంస్థల అభిప్రాయాలనే వచ్చే మార్చిలో విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు బ్రాండిరగ్గా వినియోగించుకుంటా మన్నారు. 100 శాతం పారిశ్రామికవేత్తల అభిప్రా యాల ఆధారంగా ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మూడేళ్లుగా మొదటి స్థానంలో నిలవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అంటూ, వారే తమకు ప్రచారకర్తలని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాన్ని మెచ్చి దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆదిత్య బిర్లా, టాటా, ఐటీసీ, టెక్ మహీంద్రా, డిక్సన్, సెంచురీ ప్లై, అపాచీ ఫుట్‌వేర్, ఏటీజీ టైర్స్, రామ్‌కో, శ్రీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్, అరబిందో, బ్లూస్టార్, హావెల్స్ లాంటి పలు సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఆదిత్య బిర్లా, ఐటీసీ గత ఏడాది కాలంలో రాష్ట్రంలో రెండేసి యూనిట్లు ఏర్పాటు చేయడమే కాకుండా విస్తరణ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాయి. ఏటీజీ టైర్స్, సెంచురీ ప్లైవుడ్స్ లాంటి సంస్థలైతే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తున్న వేగాన్ని చూసి పునాది సమయంలోనే విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలకు నిదర్శనం. ఇవన్నీ చూపించి తాము మరిన్ని పెట్టుబడులను రాష్ట్రానికి వచ్చేలా చూస్తామని, అందుకు ఈ సదస్సు ఎంతగానో తోడ్పడుతుందని భావిస్తున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొంటున్నారు.
ఆకట్టుకునేలా లోగో
ప్రపంచంలోని బెస్ట్ కంపెనీల నుంచి పెట్టుబడు లను ఆకర్షించి, రాష్ట్రాన్ని సుసంపన్నం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుం టోంది. దీనికోసం విశాఖపట్టణం వేదికగా జరగనున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2023ను వేదికగా చేసుకుంటోంది. ఈ సమ్మిట్ కోసం తయారు చేసిన లోగో కూడా ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోకి భారీగా పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్న విధానాన్ని సూచించేలా లోగోను తయారు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర పక్షి రామచిలుక స్పష్టంగా కనిపించేలా లోగోను తయారు చేశారు. రామచిలుక తన ఎర్రటి ముక్కుతో డాలర్లు పట్టుకొని వస్తున్నట్లు ఉన్న ఈ లోగో అందరినీ ఆకట్టుకుంటోంది. ‘అడ్వాంటేజ్ ఆంధ్ర – వనరులు సంపద చేరే ప్రాంతం’ అనే థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
ఎపి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఆహ్వానితులు…
ఎపి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఆహ్వానితుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల ఉన్నారు. విశాఖలో జరగనున్న సమ్మిట్ ఆహ్వానితుల జాబితాలో అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ బెజోస్, సామ్సంగ్ ఛైర్మన్, సీఈఓ ఓప్‌ా-హ్యున్ క్వాన్ కూడా ఉన్నారు. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, కుమార్ మంగళం బిర్లా, ఆది గోద్రేజ్, రిషద్ ప్రేమ్‌జీ, ఎన్. చంద్రశేఖరన్ వంటి భారతీయ పరిశ్రమ దిగ్గజాలు ఆహ్వానించారు. ఈ సమ్మిట్ ‘‘భవిష్యత్తు కోసం సిద్ధమయ్యే లక్ష్యంతో’’ అనే నినాదంతో నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ ఈవెంట్‌కు హాజరు కావాలని ‘‘మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి’’ ‘‘మాతో కలిసి పని చేయమని’’ అందరికీ ఆహ్వానాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి 15 మంది కేంద్ర మంత్రులు, 15 మంది ముఖ్యమంత్రులు, 44 మంది ప్రపంచ పారిశ్రామికవేత్తలు, 53 మంది భారతీయ పరిశ్రమల ప్రముఖులు, వివిధ దేశాల రాయబారులను కూడా ఆహ్వానిస్తున్నారు.
వివిధ సమావేశాలు… పెట్టుబడులకు ఆహ్వానం
రాబోయే పెట్టుబడుల కోసం నిర్దిష్ట లక్ష్యం నిర్దేశించనప్పటికీ, వివిధ రంగాల్లోకి రూ. 5-8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, వివిధ దేశాల దౌత్యవేత్తలు, వ్యాపార ప్రతినిధులు, ఇన్ఫ్లుయెన్సర్లు, పరిశ్రమ సంఘాలు, వాణిజ్య సంస్థలను దీర్ఘకాలిక భాగస్వామ్యం చేసేందుకు ఈ సమ్మిట్ వేదిక కానుందన్నారు. ఈవెంట్లో బిజినెస్-టు-బిజినెస్, గవర్నమెంట్-టు-బిజినెస్ సమావేశాలు, గ్లోబల్ లీడర్లకు అవకాశాలను ప్రదర్శించడానికి సెక్టార్- ప్లీనరీ సెషన్లు ఉంటాయి. వ్యవసాయ-ఆహార ప్రాసెసింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, పారిశ్రామిక లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, పెట్రోకెమికల్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, పునరుత్పాదక ఇంధనం, వీూవీజులు టూరిజం వంటి వాటిపై దృష్టిసారించినట్లు అధికారులు తెలిపారు.






