Pawan Kalyan: ప్రజల మధ్యకు పవన్ కళ్యాణ్.. ఎప్పుడో తెలుసా?

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దసరా పండుగ తర్వాత ప్రజల్లోకి రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. నిజానికి ఈ ఏడాది జూలై నెలలోనే ఆయన గ్రామాలు, పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రకటించారు. పార్టీ తరఫున, అలాగే ప్రభుత్వ తరఫున చేస్తున్న పనులను నేరుగా ప్రజలకు చూపించాలన్న ఉద్దేశంతో ముందే ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. తాజాగా పరిస్థితులు మారడంతో, ముఖ్యంగా పార్టీ నాయకుల నుంచి కార్యకర్తల వరకు వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా రోడ్డెక్కాలని నిర్ణయించారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరగడం లేదనే భావన ఆయనకు కలిగింది. ఇటీవల విశాఖపట్నం (Visakhapatnam)లో జరిగిన “సేనతో సేనాని” (Sena tho Senani) కార్యక్రమంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, పథకాలు ఉన్నా వాటి గురించి ప్రజలకు సరైన సమాచారం చేరడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లోపాన్ని సరిచేయడానికి ప్రజలతో నేరుగా మమేకం కావడమే మార్గమని భావించారు.
గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి పలు పనులు కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మంత్రిగా వాటిని పర్యవేక్షిస్తున్నప్పటికీ జనసేన పార్టీకి పెద్దగా లాభం చేకూరలేదని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో కూడా విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా, అందుకు కావలసిన గుర్తింపు పార్టీకి రాలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రజల మధ్యకు వెళ్లి అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
దసరా తర్వాత ప్రారంభమయ్యే ఈ పర్యటనలో అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడం, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రచారం చేయడం, కోటి మొక్కల నాటకం (Plantation) కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వంటి అంశాలు ఉండనున్నాయి. దీని ద్వారా ప్రజలతో మరింత సన్నిహితంగా మమేకమవడమే కాకుండా, పార్టీకి కొత్త ఊపుని తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని బలపరచాలనుకుంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన స్వయంగా పోటీ చేయకపోయినా, చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థులు మంచి ఫలితాలు సాధించగలరనే నమ్మకం ఏర్పడింది. ఈ కారణంగానే గ్రామస్థాయిలో నుంచి పట్టణాల దాకా పార్టీని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.మొత్తం మీద దసరా తర్వాత జనసేన కార్యాచరణ కొత్త దిశలో సాగనుంది. పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజలతో కలిసే ప్రయత్నం చేస్తే, పార్టీకి అవసరమైన మైలేజీ లభించే అవకాశం ఉందని జనసేన వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.