Parakamani Case: రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఏం జరిగింది? సతీష్ కుమార్ మరణంపై దర్యాప్తు వేగం..
టీటీడీ (TTD) పరకామణి (Parakamani) చోరీ కేసు మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన గుంతకల్లు జీఆర్పీ సీఐ సతీష్ కుమార్ (Satish Kumar) మరణం ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఉంది. ఆయన అకస్మాత్తుగా మరణించడంతో విచారణ కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో అనేక ప్రశ్నలు ఇంకా జవాబులు లేకుండానే ఉండటం వల్ల హైకోర్టు (High Court) కూడా జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
వైసీపీ (YCP ) ప్రభుత్వం హయం లో రవికుమార్ (Ravi Kumar) అనే టీటీడీ ఉద్యోగి (TTD employee) పరకామణిలో జరిగిన చోరీ కేసులో పట్టుబడగా, ఆ సమయంలో విజిలెన్స్ విభాగంలో ఉన్న సతీష్ కుమార్ అతన్ని గుర్తించి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు అయిన తర్వాత కొద్దిరోజులకే లోక్ అదాలత్లో (Lok Adalat) రాజీ జరిగిపోయింది. దీనిపై తీవ్రమైన అవకతవకలు ఉన్నాయంటూ ఒక జర్నలిస్ట్ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ పునఃప్రారంభమైంది.
విచారణ కోసం రెండోసారి కోర్టుకు వెళ్లే సమయంలో సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మరణించటం పట్ల పలు రకాల ప్రశ్నలు ఉత్తన్నమయ్యాయి. మరణించిన వ్యక్తి శరీరంపై తీవ్రమైన గాయాలు, ఛాతి ఎముకలు విరిగిపోవడం వంటి లక్షణాలు కనిపించడంతో ఇది నిజంగా ప్రమాదమా? లేక హత్యా? అనేది పోలీసుల ముందున్న పెద్ద సవాలుగా మారింది.
ప్రస్తుతం కేసు దర్యాప్తును తాడిపత్రి (Tadipatri) పోలీసులకు బదిలీ చేశారు. సతీష్ కుమార్ బరువుతో సమానమైన పావురపు బొమ్మలను రైలు నుంచి తోసి, డ్రోన్ కెమెరాతో వీడియోలు తీసి, అలా సడన్గా రైలు నుంచి కింద పడడం వల్ల ఎలాంటి గాయాలు వస్తాయో పరిశీలిస్తున్నారు. ఇది హత్య లేక ప్రమాదవశాత్తు పడిపోవడమా అన్నదానిపై క్లారిటీ తెచ్చేందుకు పోలీసులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.
ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు ప్రస్తుతం 15 ప్రత్యేక బృందాలు దర్యాప్తులో ఉన్నాయి. సతీష్ కుమార్ గుంతకల్లు (Guntakallu) రైల్వే స్టేషన్ నుండి రాయలసీమ ఎక్స్ప్రెస్లో (Rayalaseema Express) బయల్దేరిన గంట వ్యవధిలోనే మరణించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ సమయంలో ఆయనతో రైలులో ఎవరు ఉన్నారు? పాత నేరస్తులు ఏమైనా ప్రయాణించారా? అన్నదానిపై నిశితంగా విచారణ సాగుతోంది.
రైల్వే పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం, సతీష్ కుమార్ లగేజ్ ఆయన రిజర్వ్ చేసిన సీటు వద్ద కాకుండా వేరే చోట ఉండటం, అలాగే బోగీలో రక్తపు మరకలు కనిపించడం దర్యాప్తును కొత్త కోణంలోకి తీసుకెళ్లింది. ప్రయాణికుల జాబితాను పరిశీలించగా 13 మంది పాత కేసుల నిందితులు ఆ రోజు రైలులో ప్రయాణించినట్లు వెల్లడైంది. వారిలో ముగ్గురు సతీష్ ఉన్న కంపార్ట్మెంట్లోనే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.ఇక ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు వేగంగా సాగుతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ రహస్యానికి తెరలేవనని పోలీసులు భావిస్తున్నారు.






