Chandra Babu: పేదల అభివృద్ధికి పీ-4 పథకం కీలకం.. సీఎం చంద్రబాబు సంకల్పబలం

ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) వర్క్ కమిట్‌మెంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకసారి ఏదైనా డిసైడ్ అయ్యారంటే ఆయన మాట ఆయనే వినరని పేరు. ఇక 75 ఏళ్ల వయసులో 45 ఏళ్ల క్రితం నాటి సీఎం ను చూస్తారని చెబుతున్న చంద్రబాబు మాటల్లోనే కాదు చేతల్లోనూ ఆ పని చేసి చూపిస్తున్నారు. అనంతపురం (Ananthapuram) జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు హంద్రీనీవా (Handreeniva) పనుల పరిశీలనకు వెళ్లారు. ఆ సమయంలో దాదాపు 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదైనా సీఎం మాత్రం ఏ మాత్రం లెక్క చేయలేదు. హుషారుగా తిరగడమే కాకుండా, తన వెంట ఉన్న అధికార సిబ్బందినీ పరుగులు పెట్టించారు.
రాయలసీమకు (Rayalaseema) వరప్రసాదాయినిగా పేర్కొనే హంద్రీనీవా పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా దాదాపు గంట పాటు ప్రాజెక్టు వద్దే పనులను సమీక్షించారు. ప్రాజెక్టులో పూడిక తీత పనులను స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్టు పనులను వేగంగా పనిచేయాలని ఆదేశించారు. అనంతరం జరిగిన సభలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ-4 పథకంపై (P4 Scheme) కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పేదలు ఎక్కువగా ఉన్నారని చెప్పిన సీఎం.. వారి సంక్షేమం బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే కాదన్నారు.
సమాజం నుంచి పైకి వచ్చిన ఉన్నత ఆదాయ వర్గాల వారు పేదలకు సాయపడాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఉన్నత చదువులు చదివి బాగుపడిన వారంతా పేదల కష్టం నుంచే ఎదిగారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీ-4కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
రాష్ట్రంలో 2 లక్షల మంది పేదలను ఉన్నత వర్గాలుగా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంతో పేదలను పైకి తీసుకురావడం ఉన్నత వర్గాలుగా ప్రతి ఒక్కరి కర్తవ్యమని పేర్కొన్నారు. ‘పేదరికంలో ఉన్న 20 శాతం మందికి అండగా నిలుద్దాం’’ అంటూ సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పేదలు వచ్చేనాలుగేళ్లలో ధనవంతులు కావాలన్నదే తన సంకల్పమని ప్రకటించారు.