ఇన్ఫినిటీ వైజాగ్.. జనవరి 20, 21 తేదీల్లో ఐటీ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు
AP News, Breaking News, Telugu News,Latest News, Trending News,Vizag IT Summit
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విశాఖపట్నానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐటాప్), సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)తో కలిసి ‘ఇన్ఫినిటీ వైజాగ్’ పేరుతో విశాఖ వేదికగా 20, 21 తేదీల్లో సదస్సు నిర్వహిస్తోంది. ముఖ్యంగా విశాఖను ఇండస్ట్రీ 4 టెక్నాలజీ రంగం, స్టార్టప్స్ హబ్‌గా తీర్చిదిద్దేలా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఐటాప్ ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు తెలిపారు. బీమా, లాజిస్టిక్స్, డేటా అనలిటిక్స్, వంటి రంగాల్లో పెట్టుబడులకు విశాఖ ఎంతటి అనువైన ప్రదేశమో ఈ సమ్మిట్ ద్వారా వివరిస్తామన్నారు. ఈ సదస్సు విజయవంతంపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు వారు చెప్పారు.
మైక్రోసాఫ్ట్, టెక్‌మహీంద్రా, జాన్సన్ అండ్ జాన్సన్, ఇండియన్ సొసైటీ ఫర్ అసెంబ్లీ టెక్నాలజీ(ఐశాట్), విప్రో, బోష్, సీమెన్స్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో పాటు, కేంద్ర ఐటీ శాఖ మంత్రి చంద్రశేఖరన్ ఈ సదస్సుకు హాజరవుతున్నారని శ్రీధర్ చెప్పారు. సదస్సు సందర్భంగా రాష్ట్రంలో ఐటీ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన కంపెనీలకు ఎస్టీపీఐ అవార్డులతో పాటు స్టార్టప్‌లకు అవార్డులు అందిస్తున్నట్టు వెల్లడిరచారు.
రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నంలో పుంజుకుంటున్న ఐటీ రంగానికి మరింత ఊతమిచ్చేలా ‘ఇన్ఫినిటీ వైజాగ్ – 2023’ పేరుతో నిర్వహించే సదస్సు దోహదపడుతుందని, ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేం దుకు ఉన్న వనరులు, అవకాశాలపై రోడ్ మ్యాప్‌ను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు శ్రీధర్ కొసరాజు తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల వైపు ఐటీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, వాటికి విశాఖలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని, అందువల్లే ఈ ప్రాంతాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఇన్ఫినిటీ వైజాగ్`2023’ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే 20కి పైగా ఐటీ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. సదస్సులో తొలిరోజు ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలపై, రెండో రోజు బీపీవో కంపెనీలపై చర్చలు ఉంటాయని వివరించారు. ఏపీలో ప్రస్తుతం ఐటీ ఎగుమతులు సుమారు రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల వరకు జరుగుతున్నాయని వెల్లడిరచారు. ఐటాప్ పూర్వ ప్రెసిడెంట్ ఆర్ఎల్ నారాయణ మాట్లాడుతూ సదస్సులో భాగంగా ఎస్టీపీఐ ఆధ్వర్యంలో ఐటీ ఇండస్ట్రీస్ అవార్డులు, స్టార్టప్ అవార్డులు అందజేయ నున్నట్లు తెలిపారు. ఐటాప్ కాబోయే అధ్యక్షురాలు లక్ష్మి ముక్కవెల్లి మాట్లాడుతూ ఇన్ఫినిటీ వైజాగ్ సదస్సులో బాస్, టెక్ మహింద్రా, మైక్రోసాఫ్ట్, సీమెన్స్, జాన్సన్ అండ్ జాన్సన్, సైబర్ సెక్యూరిటీ, ఐశాట్ తదితర ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయని చెపారు. ఈ సదస్సుకు పర్యావరణ భాగస్వాములుగా నాస్కామ్, టై ఏపీ చాప్టర్, ఏపీ చాంబర్స్, ఏపీ స్టార్టప్స్, ఏ`హబ్ వ్యవహరించనున్నాయని వివరించారు.






