Vizag: విశాఖపట్నంలో ఐటి కంపెనీల పండుగ…! ఒకేరోజు 5 కంపెనీలకు లోకేష్ భూమిపూజ
విశాఖపట్నం: విశాఖపట్నంలో సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ కు ఒకరోజు ముందే ఐటి పండుగ వచ్చింది. సమ్మిట్ లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) గురువారం ఒకేరోజు 5 కంపెనీలకు భూమిపూజ చేశారు. పారిశ్రామికవేత్తలతో పాటు విశాఖప్రజలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.3,800 కోట్లతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 30వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కంపెనీల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి లోకేష్ కు నగర ప్రజలు నీరాజనాలు పట్టారు. భారత్ లో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖ గూగుల్ ఎఐ హబ్ ప్రకటన తర్వాత నగరానికి ఐటి కంపెనీలు క్యూకట్టాయి. ఇప్పటికే టిసిఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఎపి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోగా, తాజాగా సైల్స్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్, ఐస్పేస్ సాఫ్ట్ వేర్, టెక్ తమ్మిన, ఫీనోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కె.రహేజా, కపిల్ గ్రూప్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు మంత్రి లోకేష్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాల్లో కారక్రమానికి హాజరైన ఎంపి ముతుకుమిల్లి శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, లోకం మాధవి, ఎపిఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సెయిల్స్ సాఫ్ట్ వేర్ కు శంకుస్థాపన
విశాఖ మధురవాడ ఐటి హిల్ నెం.2లో సెయిల్స్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ సంస్థ అడ్వాన్స్ సాఫ్ట్ వేర్ ఇన్నొవేషన్ అండ్ ఎఐ ఎక్సలెన్స్ సెంటర్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. మంత్రితోపాటు ఈ కార్యక్రమానికి హాజరైన సంస్థ ఎండి & సిఇఓ కిరణ్ మాట్లాడుతూ… విశాఖలో రూ.21 కోట్లతో సెయిల్ సంస్థ ఏర్పాటు చేసే ఎఐ ఎక్సలెన్స్ సెంటర్ ద్వారా 430మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. డిజిటల్ ఆంధ్రప్రదేశ్, ఇండియా ఎఐ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఎఐ, క్లౌడ్ టెక్నాలజీలను ఉపయోగించి అత్యాధునిక ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్స్ పై దృష్టిసారించనున్నట్లు ఆయన చెప్పారు.
ఐస్పేస్ సాఫ్ట్ వేర్ కు భూమిపూజ
విశాఖ మధురవాడ ఐటి హిల్ నెం.2లో ఐ స్పేస్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ సంస్థ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు హాజరైన సంస్థ సిఇఓ రమేష్ మాట్లాడుతూ… విశాఖలో తమ సంస్థ మూడు దశల్లో రూ.119.18 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా, 2వేలమందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రొడక్ట్ డెవలప్ మెంట్, మెయింటెనెన్స్ సర్వీసెస్, ఐటి సొల్యూషన్స్, ఐటిఓ సేవల డెలివరీ కార్యకలాపాలను తాము విశాఖ యూనిట్ ద్వారా చేపడతామని తెలిపారు.
ఫీనోమ్ డెవలప్ మెంట్ సెంటర్ కు భూమిపూజ
విశాఖ మధురవాడ ఐటి హిల్ నెం.2లో ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్లోబల్ డెవలప్ మెంట్ సెంటర్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. లోకేష్ తోపాటు కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ కో ఫౌండర్ హరి బైర్రెడ్డి మాట్లాడుతూ… విశాఖ యూనిట్ పై రెండుదశల్లో రూ.207.5 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా, 2,500 మంది ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. తాము అడ్వాన్స్ ప్రొడక్ట్ డెవలప్ మెంట్, ఎఐ రీసెర్చి, కస్టమర్ డెలివరీ ఎక్సలెన్స్ పై దృష్టిసారిస్తామని తెలిపారు.
రహేజా మిక్స్ డ్ డెవలప్ మెంట్ స్పేస్ కు శంకుస్థాపన
విశాఖ మధురవాడ ఐటి హిల్ నెం.3లో రహేజా సంస్థ ఐటి స్పేస్/ కమర్షియల్ స్పేస్ మిక్స్ డ్ డెవలప్ మెంట్ స్పేస్ కు మంత్రి నారా లోకేష్ భూమిపూజ చే శారు. మంత్రి వెంట కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ ప్రెసిడెంట్ రవి సి.రహేజా మాట్లాడుతూ… విశాఖలో రూ.2,172 కోట్ల పెట్టుబడి పెట్టడంద్వారా, 15వేలమందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఐటి కంపెనీలు, డాటా సెంటర్లు, జిసిసి కంపెనీలకు అవసరమైన ఐటి స్పేస్, రెసిడెన్షియల్ లగ్జరీ ఫ్లాట్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు భూమిపూజ
విశాఖ యండాడలో కపిల్ గ్రూప్ అనుబంధ సంస్థ బివిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ఆధ్వర్యాన వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. మంత్రి లోకేష్ వెంట కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ గ్రూప్ చైర్మన్ వామనరావు మాట్లాడుతూ… విశాఖలో రెండు విడతలుగా రూ.1250 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా, 15వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో IT/ITeS ఆఫీసు స్పేస్, కమర్షియల్ స్పేస్ మిక్స్ డ్ డెవలప్ మెంట్ తోపాటు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పెట్టుబడుల ఆకర్షణ, హైవ్యాల్యూ జాబ్ క్రియేషన్ లక్ష్యాలుగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.






