బాబుపై బీఆర్ఎస్, జగన్‌పై కాంగ్రెస్.. ప్రశంసల వర్షం..!!

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో ఊహించడం చాలా కష్టం. అందుకే దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై దృష్టి ఉంటుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలనూ వరదలు ముంచెత్తాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమదైన స్థాయిలో సహాయక చర్యలు చేప్టటాయి. సాధారణంగా సహాయక చర్యల విషయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాల పైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు ఒకేసారి రావడంతో రాజకీయ పార్టీలు స్పందించిన తీరు చర్చనీయాంశమైంది.
తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ తదితర జిల్లాలో వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పోటెత్తాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రులతో కలిసి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శిస్తోంది. దీనిపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి పరామర్శిస్తోందని.. మరి తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు ఫాంహౌస్ లో పడుకుంటే కొడుకు కేటీఆర్ విదేశాల్లో ఉంటూ ట్వీట్లు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. కవితకు బెయిల్ కోసం పదుల సంఖ్యలో ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆపదలో ఆదుకునేందుకు ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నించారు. అయితే దీనిపై కేటీఆర్ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 6 రెస్క్యూ హెలికాప్టర్లు, 150 బోట్లతో సహాయక చర్యలు చేపడుతుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని హెలికాప్టర్లు, బోట్లతో ప్రాణాలు కాపాడగలిగారో ఊహించండి.. బిగ్ జీరో అంటూ ఎద్దేవా చేశారు.
వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ టీడీపీకి వ్యతిరేకంగా ఉంటుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వైసీపీని ఎట్టిపరిస్థితుల్లో సమర్థించదు. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు అనూహ్యంగా ప్రశంసలు కురిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీడీపీని ఓడించేందుకు బీఆర్ఎస్ తుదివరకూ ప్రయత్నించిందని తెలుగుదేశం శ్రేణులు భావిస్తుంటాయి. వైసీపీకోసం బీఆర్ఎస్ పనిచేసిందని చెప్పుకుంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ టీడీపీ ప్రభుత్వాన్ని కొనియాడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా వైసీపీని ప్రశంసించడం చర్చనీయాంశమైంది.