లోక్‌సభ స్పీకర్ రేసులో పురందేశ్వరి..!?

కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. వరుసగా మూడోసారి మోదీ నేతృత్వంలో ఎన్డీయే సర్కార్ బాధ్యతలు చేపట్టింది. కొత్త మంత్రివర్గం కూడా ప్రమాణస్వీకారం చేసేసింది. ఇక మిగిలింది ఎంపీలందరూ ప్రమాణ స్వీకారం చేసి కొత్త స్పీకర్ ను ఎన్నుకోవడమే.! ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడంతో స్పీకర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలకు ఈ పదవి దక్కుతుందని కొందరు భావిస్తున్నారు. అయితే మిత్రపక్షాలకు ఇవ్వకుండా తన పార్టీ వ్యక్తినే స్పీకర్ సీట్లో కూర్చోబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
లోక్ సభ స్పీకర్ పదవికోసం టీడీపీ, జేడీయూ పట్టుబడుతున్నట్టు కొంతకాలంగా టాక్ నడుస్తోంది. అయితే తాము కేంద్రంలో ఎలాంటి పదవులకోసమూ పోటీ పడట్లేదని టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. జేడీయూ కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉంది. దీంతో బీజేపీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాలు నడిపేటప్పుడు స్పీకర్ పాత్ర కీలకంగా ఉంటుంది. అందుకే క్లిష్ట సమయాల్లో తమ వ్యక్తి అయితేనే బాగుంటుందని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మిత్రపక్షాలకు ఇవ్వకుండా తమ పార్టీ నేతనే స్పీకర్ సీట్లో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతోంది.
స్పీకర్ రేసులో ఏపీ నుంచి గెలిచిన పురందేశ్వరి ముందువరసలో ఉన్నట్టు తెలుస్తోంది. మహిళ కావడం, దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి కావడం ఆమెకు కలిసొచ్చే అంశాలు. పైగా గతంలో కేంద్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అన్నిటికీ మించి ఎన్టీఆర్ కుమార్తెగా చరిష్మా ఉంది. ఆమెకు మద్దతిచ్చేందుకు టీడీపీ కూడా ముందుంటుంది. ఆమెకు స్పీకర్ స్థానం ఇస్తే టీడీపీ కూడా తమకు స్పీకర్ కావాలని పట్టుబట్టకపోవచ్చని బీజేపీ భావిస్తోంది. పురంధేశ్వరి కాకుండా రాధామోహన్ సింగ్, ఓం బిర్లా కూడా స్పీకర్ స్థానాన్ని ఆశిస్తున్నారు.
స్పీకర్ రేసు నుంచి జేడీయూ కూడా దాదాపు తప్పుకున్నట్టే. ఎందుకంటే ఇప్పటికే రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ గా జేడీయూకు చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ ఉన్నారు. కాబట్టి జేడీయూకు మరో ప్రాధాన్య పోస్టు ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. అయితే తమకు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇవ్వాలని ఇండియా కూటమి పట్టుబడుతోంది. అలా ఇవ్వకపోతే స్పీకర్ కు అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరిస్తోంది. బీజేపీ మాత్రం ఎన్నికలకు వెళ్లేందుకే మొగ్గు చూపుతోంది. డిప్యూటీ స్పీకర్ పోస్టును ఇతరులకు ఇచ్చేందుకు సిద్దంగా లేదు.