Simhachalam: సింహాచలం ప్రమాదం.. రాజకీయ లబ్దికోసం పార్టీల ఆరాటం!?

విశాఖపట్టణంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వద్ద చందనోత్సవం (Chandanotsavam) సమయంలో గోడ కూలిన ఘటన ఏపీ రాజకీయాలను మరోసారి వేడెక్కించింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. భారీ వర్షాల కారణంగా గోడ కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ దుర్ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP), తెలుగుదేశం పార్టీ (TDP) మధ్య రాజకీయ రగడకు దారితీస్తోంది.
చంద్రబాబు నాయుడు (Chandrababu) అధికారంలోకి వస్తే ఆలయాల వద్ద ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయ్.. అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. 2015 గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) సమయంలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణించారు. తాజాగా తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు సింహాచలంలో మరో ఏడుగురు చనిపోయారు. ఇవన్నీ టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సింహాచలంలో అధికారులు సరైన చర్యలు చేపట్టలేదని, 20 రోజుల కిందట నిర్మించిన గూడ కూలిందంటే దాని నాణ్యత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ఆరోపించారు. ప్రజల భద్రత కంటే రాజకీయ లబ్ధి ముఖ్యమని చంద్రబాబు భావిస్తారని ఆయన విమర్శలు గుప్పించారు.
అయితే వైసీపీ ఆరోపణలను టీడీపీ తీవ్రంగా ఖండించింది. “ప్రమాదాలను కూడా రాజకీయానికి వాడుకోవడం వైసీపీకి అలవాటు” అని టీడీపీ నేతలు తిప్పికొడుతున్నారు. వైసీపీ హయాంలో కూడా పలు దుర్ఘటనల జరిగిన విషయాలను వాళ్లు ప్రస్తావిస్తున్నారు. 2019లో కచ్చులూరు వద్ద (Kachuluru Boat Accident) గోదావరిలో బోటు ప్రమాదంలో 47 మంది మరణించిన ఘటన, 2021లో అన్నమయ్య డ్యాం (Annamayya Dam) గేట్లు విరిగిపోయి 37 మంది మరణించిన సంఘటన, 2020లో విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ వల్ల 12 మంది మరణించిన ఘటన, జంగారెడ్డి గూడెంలో నాటుసారా తాగి 46 మంది మరణించిన ఘటనలను టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ ఘటనలకు వైసీపీ బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఏపీలో రాజకీయ అవకాశావాదాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రమాదాలు, దుర్ఘటనలు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు బాధ్యత వహించడం కంటే, ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వైసీపీ, టీడీపీ రెండూ గత ఘటనలను ఆయుధాలుగా ఉపయోగించుకుంటూ, ప్రజల మధ్య గందరగోళం సృష్టిస్తున్నాయి. ఇలాంటి దుష్ప్రచారం వల్ల బాధిత కుటుంబాలకు న్యాయం జరగడం కంటే, రాజకీయ లాభాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి.