World Telugu Mahasabhalu: గుంటూరులో ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభలు
ఆంధ్రప్రదేశ్లో రెండేళ్లకోసారి జరిగే తెలుగు పెద్ద పండుగ ప్రపంచ తెలుగు మహాసభలు ఈసారి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమరావతి రాజధాని ప్రాంతంలోని గుంటూరుశివార్ల లో గల ప్రత్తిపాడు బై పాస్ లోని శ్రీ సత్య సాయి స్పిరిట్యూవల్ సిటీ ప్రాంగణంలో ఈ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. జనవరి 3, శనివారం ఉదయం శ్రీనివాస కల్యాణ కార్యక్రమంతో తెలుగు మహాసభలకు నిర్వాహకులు శ్రీకారం చుట్టారు. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. నేటి నుంచి ఈనెల 5 వరకు మూడో ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సభకు, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు, మూడు గిన్నీస్ రికార్డుల గ్రహీత డాక్టర్ కేసిరాజు (గజల్) శ్రీనివాస్ అధ్యక్షత వహిస్తున్నారు.

తెలుగు మహాసభల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మరో అయిదు ఉప వేదికలపై సన్మానాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, తెలుగు గీతాలాపనలు వంటి అనేక తెలుగు దనం ఉట్టిపడే కార్యక్రమాలు రాత్రి 11 గంటవరకు ఏర్పాటుచేశారు. ప్రాంగణం లోని ఆధ్యాత్మిక వేదికపై, ప్రవచనాలు, హోమాలు, కళ్యాణాలు వంటి కార్యక్రమాలు ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక భావనలతో నింపుతోంది. ఉదయం పూట ప్రాంగణం లో ఏర్పాటు చేసిన శ్రీ రామోజీరావ్ ప్రదర్శన ప్రాంగణాన్ని శ్రీ రామోజీరావ్ విగ్రహానికి పూల మాలలు వేసి, ప్రముఖులు ప్రారంభిస్తారు. ఈ ప్రాంగణం లో తెలుగు భాష ప్రాచీన తత్వాన్ని వివరించేలా పురా తనతెలుగు సాహిత్యం, పురాతన నాణేలు , తెలుగు సంప్రదాయ వంటకాలు, తెలుగు వినోదం వంటి అనేక అంశాలపై కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఆదివారం ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ పాల్గొననున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ఒక దేశాధ్యక్షుడు రావడం ఇదే ప్రథమం. ఇక సోమవారం నాడు జరిగే మహాసభల్లో సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరుల ప్రముఖుల హాజరుతో ప్రపంచ తెలుగు మహాసభలు మరింత వైభవంగా సాగనున్నాయి.






