కన్నడ కాంగ్రెస్ లో ఆధిపత్యపోరాటం…

కర్నాటకలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయం తారస్థాయికి చేరింది. ఏడాది పాలన ముగియడం, సార్వత్రిక ఎన్నికలు కూడా పూర్తికావడంతో .. మళ్లీ ఆధిపత్యపోరాటానికి నేతలు తెరతీశారు.కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ప్రాభవాన్ని తగ్గించేందుకు సీఎం సిద్ధరామయ్య వర్గీయులు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ కీలకభూమిక పోషిస్తున్న డికె తీరు…పలువురు సీనియర్ మంత్రులకు నచ్చడం లేదు. దీంతో డీకేకు ఝలక్ ఇచ్చేలా పావులు కదుపుతున్నారు.
డికె స్థాయి తగ్గించేలా..?
లోక్‌సభ ఎన్నికలకు ముందే మరిన్ని సామాజిక వర్గాలకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరికతో ఎన్నికల దాకా మౌనం పాటించారు. లోక్‌సభ ఎన్నికల తంతు ముగియగానే ఈ అంశాన్ని సీనియర్ మంత్రి సతీశ్‌జార్కిహొళి ప్రస్తావించారు. అందుకు మద్దతు ఇచ్చేలా మంత్రులు రాజణ్ణ, జమీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. లింగాయత, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలలో ఒక్కొక్కరికి డీసీఎం పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
డికేకు మద్దతుగా…
ప్రస్తుతానికి డీసీఎం పదవిలో డీకే శివకుమార్ ఉన్నారని, మరొక డీసీఎం అవసరం లేదన్నారు డీకే శివకుమార్‌కు ఆప్తులైన మంత్రి చలువరాయస్వామి, ఎమ్మెల్యే బాలకృష్ణ తదితరులు. మరో సీనియర్ మంత్రి ప్రియాంక ఖర్గే స్పందిస్తూ మంత్రులందరినీ డీసీఎంలు చేస్తే సరిపోతుందని సెటైర్ వేశారు.ఇదే సమయంలో చెన్నగిరి ఎమ్మెల్యే బసవరాజు శివగంగ కొత్త ప్రతిపాదన చేశారు. డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేస్తే సరిపోతుందన్నారు. ఈ అంశం సర్వత్రా చర్చకు దారితీసింది.
రాష్ట్ర ప్రభుత్వంలో ఏకైక ఉపముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న డీకే శివకుమార్ హవా అన్నింటా సాగుతోంది. అందుకు పలు కారణాలు ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగాను, బెంగళూరు నగరాభివృద్ధి, కీలకమైన జలవనరులశాఖ మంత్రిగాను వ్యవహరిస్తున్నారు. ఇలా డీకే శివకుమార్ కేబినెట్‌లో ప్రముఖుడిగా రాణిస్తున్నారు. దీనిని పలువురు సీనియర్ మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరింతమంది డీసీఎంలను చేస్తే డీకే శివకుమార్ హవా తగ్గించవచ్చునని తరచూ ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల్లోనే ఈ డిమాండ్ వచ్చింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు ముందు హల్‌చల్ చేయగా తాజాగా వారం రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది.
కౌంటర్ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న డికె శివకుమార్..!
వివిధ సామాజిక వర్గాలకు డీసీఎం పదవులు కట్టబెట్టాలనే ప్రతిపాదన చేస్తూ డీకే శివకుమార్‌ను ఇబ్బంది కలిగించేలా సాగుతున్న కుట్రకు భారీగా షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కోర్టు కేసు కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బెంగళూరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఓటమిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, ఎవరు పనిచేయలేదో సంబంధిత ఇన్‌చార్జ్‌లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. రాహుల్‌గాంధీ సూచనలను దృష్టిలో పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో 20 స్థానాలు విజయం సాధిస్తామనే ధీమాలో ఉన్నామని, ఎక్కడ విఫలం చెందామనే కోణంలోనే నివేదిక రూపొందించినట్టు తెలుస్తోంది.
బెంగళూరుతోపాటు మైసూరు, దక్షిణకన్నడ, మండ్య, ఉత్తరకర్ణాటక ప్రాంతాల్లో ఇన్‌చార్జిలుగా వ్యవహరించినవారు సిద్దరామయ్యకు ఆప్తులు కావడంతో వీరిపై వ్యతిరేకంగా నివేదిక రూపొందించడం ద్వారా కట్టడి చేయాలని డీకే శివకుమార్ భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు మాజీ మంత్రి వినయ్‌కులకర్ణి నేతృత్వంలో 15 మంది వీరశైవలింగాయత ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి సీఎం ఆప్తమంత్రులు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా బైరతి సురేశ్, కేఎన్ రాజణ్ణను టార్గెట్ చేస్తూ ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. సిద్దరామయ్యను ఢిల్లీలో ఇరకాటంలో పెట్టేలా లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి సీఎం, డీసీఎం మధ్య అగాథం పెరుగుతున్నట్టు తెలుస్తోంది.