అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కశ్మీర్ సన్నద్ధం…

భూతలస్వర్గం కశ్మీరం..అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నద్ధమైంది. జూన్ 21 జరుగుతున్న యోగా దినోత్సవానికి..శ్రీనగర్‌లోని దాల్ సరస్సు సమీపంలోని షేర్ ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ వేదిక కానుంది.ఆ రోజు ఉదయం 6.30 గంటలకు దాదాపు 7 వేల మందితో కలిసి ప్రధాని మోడీ యోగా చేయనున్నారు. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటి.. ఈ ఏడాది యోగా దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యంగా నిర్ణయించారు.
రెండురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ శ్రీనగర్ లో జరిగే..ఎంపవరింగ్ యూత్ అండ్ ట్రాన్స్‌ఫార్మింగ్ జమ్ము అండ్ కాశ్మీర్ కార్యక్రమంలో పాల్గొంటారు. అందులోభాగంగా స్థానిక యువతను ఆయన కలవనున్నారు. అలాగే రూ. 15 వందల కోట్ల విలువైన 84 మేజర్ ప్రాజెక్ట్‌లకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరనున్న 2 వేల మందికి మోడీ నియామక ప్రతాలు అందజేయనున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భద్రత చర్యలను జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పర్యవేక్షిస్తున్నారు.
ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. 2015 నుండి ఢిల్లీలోని కర్తవ్య పథ్, చండీగఢ్, డెహ్రాడూన్, రాంచీ, లక్నో, మైసూరు, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంతో సహా వివిధ ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు మోడీ నాయకత్వం వహించారు. అప్పటి నుంచి ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మోడీ పాల్గొంటున్నారు. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.