స్పీకర్ పదవికి ఇండియా కూటమి పోటీ..

పార్లమెంటు చరిత్రలోనే తొలిసారిగా స్పీకర్ పదవికి పోటీ అనివార్యమైంది.ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటములు తమతమ అభ్యర్థులను బరిలోకి దించాయి. ఎన్డీఏ కూటమి తరపున ఓంబిర్లా, ఇండియా కూటమి తరపున కేరళ కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్ బరిలో నిలిచారు. దీంతో పోటీ అనివార్యమైంది.నిజానికి ఈ పదవి ఎంపిక ఎప్పుడు ఏకగ్రీవంగా జరిగేది. ఎందుకంటే స్పీకర్ అనే వ్యక్తి ఓ పార్టీ నుంచి వచ్చినా..తర్వాతి కాలంలో తటస్థుడిగా వ్యవహరించాల్సి ఉంటుంది.
స్పీకర్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. విపక్ష I.N.D.I.A కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి ఆశించగా.. అది దక్కకపోవడంతో స్పీకర్ పదవి కోసం పోటీ పడుతోంది. అయితే, ఎప్పటిలాగే లోక్‌సభ స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం యత్నించగా.. I.N.D.I.A కూటమి సైతం బరిలోకి దిగడంతో అది సాధ్యపడలేదు. తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని పట్టుబట్టినా ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో సభాపతి స్థానం కోసం I.N.D.I.A కూటమి బరిలో నిలిచింది.
ఎందుకీ పరిస్థితి వచ్చింది..?
అయితే, వాస్తవానికి లోక్‌సభలో స్పీకర్ పదవిని అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గత హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి. అయితే, ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబట్టాయి. తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాల్సిందేనని.. లేకుంటే సభాపతి స్థానం కోసం తాము అభ్యర్థిని నిలబెడతామని చెప్పాయి. ఈ క్రమంలో బీజేపీ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను రంగంలోకి దించింది. ఆయన I.N.D.I.A కూటమి నేతలు మల్లికార్జునఖర్గే, ఎంకే స్టాలిన్, ఇతర నేతలతోనూ వరుస చర్చలు జరిపారు.
స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని.. అందుకు సహకరించాలని కోరారు. అయితే, డిప్యూటీ స్పీకర్ పదవిని తమకు ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఇందుకు ఎన్డీయే ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు సైతం లోక్ సభ స్పీకర్ పదవి కోసం బరిలో నిలిచాయి. ఎన్డీయే తరఫున ఓం బిర్లా, I.N.D.I.A కూటమి తరఫున కేరళ ఎంపీ కె.సురేశ్ నామినేషన్ దాఖలు చేశారు.