తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభసంకేతాలు..

మోడీ 3.0 సర్కార్.. తెలుగు రాష్ట్రాలకు శుభవార్త అందించింది. మరీ ముఖ్యంగా తెలంగాణ వాసుల సెంటిమెంటు సింగరేణి ప్రైవేటీకరణ అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. 2018 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేసీఆర్ సింగరేణి ప్రైవేటీకరణ అంటూ విషప్రచారంచేశారు తప్ప, అందులో నిజం లేదన్నారు. అంతేకాదు.. దేశంలోని ఏ ప్రభుత్వరంగ బొగ్గు సంస్థనూ తాము ప్రైవేటీకరణ చేయబోమన్నారు.
బొగ్గు గనులను వేలం ద్వారానే కేటాయించాలని, నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దానివల్లే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తొమ్మిది రౌండ్ల వేలం నిర్వహించి.. 300 గనులను వేలం వేసింది. ఈ నెల 21న పదో రౌండ్ వేలం హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకే ఆదాయం వస్తుంది. బొగ్గు, గనుల వేలం కారణంగా ఒడిశా ప్రభుత్వానికి ఏటా రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తోందన్నారు కిషన్ రెడ్డి.
ఈసారి వేలంలో పాల్గొననున్న సింగరేణి
బొగ్గు గనులను తనకు ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకోవడానికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేలాన్ని వ్యతిరేకించారు. అందుకే వేలంలో పాల్గొనవద్దని సింగరేణిని ఆదేశించారు. అయితే ఈసారి సింగరేణి ద్వారా వేలంలో పాల్గొంటామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మా శాఖ పూర్వ మంత్రి ప్రహ్లాద్‌జోషీకి చెప్పారు. దానివల్ల రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుంది. సింగరేణికి సాయం విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేయబోదు. ఆ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51%, కేంద్రానికి 49% వాటా ఉంది కనుక.. రోజువారీ పరిపాలనాధికారాలన్నీ తెలంగాణ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి. ఎండీని వాళ్లే నియమిస్తారు. కేంద్ర జోక్యం 1% కూడా ఉండదన్నారు. మెజార్టీ వాటా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పుడు కేంద్రం దాన్ని ఎలా ప్రైవేటీకరించగలుగుతుందని ప్రశ్నించారు.
విశాఖ స్టీల్ పై ఆందోళన వద్దు..
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఫైల్ కు సంబంధించి దస్త్రంలో ఏమీ కదలిక లేదు. దాన్ని కొనుగోలు చేసేంత పెద్ద సంస్థలు కనిపించడంలేదు. ఇప్పట్లో దాని ప్రైవేటీకరణ జరగదు. కార్మికులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ సంస్థ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో రూ.3 వేల కోట్లు మంజూరు చేసే అవకాశం ఉందన్నారు కిషన్ రెడ్డి.. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కు బొగ్గు, ఇనుప ఖనిజాలు కేటాయించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. మా మంత్రిత్వశాఖలతో మాట్లాడి అందుకు అవకాశం ఉందా? అని చర్చిస్తా. నాకు తెలిసినంతవరకు వైజాగ్ స్టీల్ కూడా వేలంలో పాల్గొని గనులను సొంతం చేసుకోవచ్చన్నారు. పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. దాని నిర్మాణం పూర్తి చేయడానికి మోడీ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. కేంద్ర మంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారానికి ఇకపై నేను కూడా తగిన చొరవ తీసుకుంటా’’ అని కిషన్‌రెడ్డి వివరించారు.