స్పీకర్ గా టీడీపీ అభ్యర్థి అయితే ఓకే..? : ఇండియా కూటమి

పార్లమెంటులో స్పీకర్ పోస్టు ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. మంత్రులకున్నట్లు శాఖలు లేకున్నా.. స్పీకర్ చెబితే ఏమంత్రి కాదనే పరిస్థితి ఉండదు. సభలో అధికార పక్షానికి, విపక్షానికి మధ్యవర్తిగా ఉండే పదవి స్పీకర్. అందుకే ఆపదవికి ఉండాల్సిన ఘనత ఉంది. అందుకే మంత్రిపదవి దక్కకున్నా స్పీకరైనా దక్కుతుందని చాలా మంది భావిస్తారు.. మరీ ముఖ్యంగా పనులు చక్కబెట్టుకోవాలంటే తమవారు స్పీకర్ గా ఉంటే బాగుంటుందని జాతీయ, ప్రాంతీయ పార్టీలు భావిస్తాయి. ఎందుకంటే స్పీకర్ పిలిచి మాట్లాడితే.. అధినేతలు సైతం తలూపిన సందర్భాలు చాలా ఉన్నాయి చరిత్రలో…
ప్రస్తుతం లోక్ సభలో స్పీకర్ పోస్టుకోసం టీడీపీ, జేడీయూ ప్రయత్నిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవలే జేడీయూ అధినేత నితీష్ కుమార్.. బీజేపీ బలపర్చిన అభ్యర్థికి స్పీకర్ గా తాము మద్దతిస్తామని తేల్చేశారు. టీడీపీ మాత్రం ఏం మాట్లాడడం లేదు. అయితే అంతర్గతంగా టీడీపీ స్పీకర్ పోస్టుకోసం పట్టుబడుతోందని ప్రచారం జరుగుతోంది. గతంలోనూ స్పీకర్ గా బాలయోగి చేసి ఉండడంతో.. ఆపదవి మరోసారి తమకు దక్కుతుందని టీడీపీ ఆశిస్తోందంటున్నారు రాజనీతిజ్ఞులు.
ఇలాంటి సందర్భంలో శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కీలక ప్రకటన చేశారు. లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో టీడీపీ తన అభ్యర్థిని నిలబెడితే ఆ పార్టీకి ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ముంబయిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..స్పీకర్ ఎన్నిక చాలా ముఖ్యమైందన్నారు. ఒకవేళ ఆ పదవిని బీజేపీ దక్కించుకుంటే ప్రభుత్వానికి మద్దతిస్తున్న టీడీపీ, జేడీయూలతోపాటు చిరాగ్ పాస్వాన్, జయంత్ చౌధరిల పార్టీలను చీలుస్తారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు అనుభవం ఉందన్నారు. ‘‘స్పీకర్ పదవికి టీడీపీ తన అభ్యర్థిని నిలబెట్టాలనుకుంటోందని నాకు తెలిసింది. అదేకనక జరిగితే ఇండియా కూటమి భాగస్వాములు దీనిపై చర్చిస్తారు. అంతేకాకుండా వారంతా తెదేపాకు మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తారు’’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
నిబంధనల ప్రకారం ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కుతుందన్నారు. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానిది సుస్థిర పాలన కాదని అభివర్ణించారు. అంటే పాత పరిచయాల ఆధారంగా టీడీపీ కానీ తన అభ్యర్థిని స్పీకర్ గానిలిపితే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అలా కాకుండా బీజేపీ అభ్యర్థిని కనుక స్పీకర్ గా నిలిపితే.. ఆ అభ్యర్థిని బట్టి ఓటింగ్ జరిగే అవకాశముంది. అయితే ప్రస్తుతమున్న బొటాబొటీ మెజార్టీ సమయంలో .. స్పీకర్ పోస్టును ఇతర పార్టీలకు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించడం కష్టమే అంటున్నారు రాజనీతిజ్ఞులు. స్పీకర్ పోస్టు లాంటి వాటిని.. ఏకగ్రీవంగా జరిపేందుకు అందరూ ప్రయత్నిస్తారు. ఇది సాదారణంగా జరిగే ప్రక్రియ కూడా..