దేశంలో కాంగ్రెస్ కనుమరుగేనా?

వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన పార్టీ కూడా అదే. అయితే గత కొన్నేళ్లుగా పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారి పోతోంది. మంచిరోజులు ముందున్నాయ్.. అని నాయకులు చెప్తున్నారే కానీ ఎక్కడా అలాంటి సూచనలు, సంకేతాలు కనిపించడం లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతలున్నారు. దేశంలో క్షేత్రస్థాయి వరకూ కేడర్ కలిగిన పార్టీ.. అయినా ఎన్నికల్లో దారుణంగా చతికిలపడుతోంది. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు సరికదా.. మరింత దిగజారిపోయింది. ఎందుకిలా జరుగుతోంది.
తాజా ఐదు రాష్ట్రాల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడినట్లు కనిపించట్లేదు. పైగా పాండిచ్చేరి లాంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. కొంతకాలంగా పాండిచ్చేరి కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలతో చాలా మంది నేతలు పార్టీని వీడారు. వీళ్లంతా బీజేపీ గూటికి చేరడంతో అక్కడ హస్తం పార్టీ పరిస్థితి దిగజారిపోయింది. దీంతో సిట్టింగ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ కోల్పోయినట్లయింది. ఇక్కడ అధికారం నుంచి కేవలం 2 సీట్లు మాత్రం దక్కించుకునే స్థాయికి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఇక అసోంలో ప్రతిపక్ష స్థానం దక్కడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇక్కడ రెండోసారి బీజేపీ అధికారం చేపట్టబోతోంది. అసోంలో ఎలాగైనా బీజేపీని ఓడించాలనుకున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక చాలా చెమటోడ్చారు. కానీ ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమైపోయారు.
ఇక కేరళలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది. అలాగే ఈసారి లెఫ్ట్ నుంచి తమకు రాష్ట్ర పగ్గాలు దక్కుతాయని కాంగ్రెస్ ఆశించింది. అయితే అధికార ఎల్డీఎఫ్ చరిత్ర తిరగరాసింది, వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. ఇక్క కాంగ్రెస్ పార్టీకి, అధికార సీపీఎంకు ఓట్లశాతంలో పెద్దగా తేడా లేదు. సీపీఎంకు 25.4శాతం ఓట్లు రాగా కాంగ్రెస్ కు 25.12 శాతం ఓట్లు వచ్చాయి. అయినా సీట్లలో భారీ తేడా కనిపించింది. ఇక్కడ కాంగ్రెస్ కు 21 సీట్లు దక్కాయి. ప్రతిపక్ష హోదా మాత్రమే దక్కింది. దీంతో మరోసారి ఇక్కడ అధికారం ఆశ అడియాశగానే మిగిలిపోయింది. తమిళనాడులో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. కాబట్టి ఇక్కడ మాత్రం 4.28 శాతం ఓట్లు దక్కించుకుని డీఎంకే అండతో 18 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుంది. ఇది కాంగ్రెస్ పార్టీ సొంత బలం అని ఏమాత్రం నమ్మడానికి వీల్లేదు. ఈ గెలుపు పూర్తిగా డీఎంకేదే అని చెప్పొచ్చు.
ఇక పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైందనే చెప్పొచ్చు. పశ్చిమ బెంగాల్ లో పదేళ్ల క్రితం వరకూ లెఫ్ట్ దే అధికారం. అప్పుడు కాంగ్రెస్సే ప్రతిపక్ష పార్టీ. అయితే మమత అధికారంలోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ కు ప్రతిపక్ష హోదా దక్కగా కాంగ్రెస్ మూడో స్థానంలో ఉండిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు రెండూ పూర్తిగా తెరమరుగైపోయి ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఓటింగ్ శాతం కూడా భారీగా పడిపోయింది. కేవలం 2.93శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ చరిత్రగానే మిగిలిపోయంది.
పార్టీని సమర్థంగా నడిపించే నాయకత్వం లేకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ కు పెద్ద మైనస్ పాయింట్. సీనియర్ల పెత్తనాన్ని రాహుల్ గాంధీ సహించట్లేదు. యువనాయకత్వం తీసుకురావాలని రాహుల్ కోరుకుంటున్నారు. అయితే రాహుల్ ప్రయత్నాలను సీనియర్లు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దీంతో సీనియర్లపైనే రాహుల్ అలక వహించి అధ్యక్షపదవికి రాజీనామా చేసిన పరిస్థితి ఏర్పడింది. సీనియర్లు కూడా తమకు పార్టీలో పట్టు కోల్పోతోందని, రాహుల్ తమకు తగిన గౌరవం ఇవ్వట్లేదని ఫీలవుతున్నారు. దీంతో పక్కచూపులు చూస్తున్నారు. దీంతో పార్టీలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. రాహుల్ కూడా సీనియర్లు పోతే పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు వెయిట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు పార్టీ సందిగ్ధ పరిస్థితిలో ఉంది. మరి ఈ పరిస్థితి నుంచి పార్టీ ఎప్పుడు గట్టెక్కుతుందో చూడాలి.