కశ్మీర్ లో బుసకొడుతున్న ఉగ్రనాగులు..

జమ్మూ కశ్మీర్ మళ్లీ నెత్తురోడుతోంది. వరుసగా ఉగ్రవాదులు.. ప్రజలు, భద్రతాదళాలు టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. వారం వ్యవధిలో మూడు ఉగ్రదాడులు జరగడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రశాంతంగా మారుతున్న లోయలో మళ్లీ ఉగ్రదాడులు జరగడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం బస్సుపై దాడిచేశారు. అది మరవక ముందే.. మంగళవారం మరో దాడికి తెగబడ్డారు. ఇందులో ఓ సీఆర్పీఎఫ్ జవన్ మృతిచెందగా ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరు ఉగ్రవాదులను కూడా సైన్యం మట్టుపెట్టింది. డోరా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న ఓ ఇంటిపై కూడా ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ ఘటనలో ఇంటి యజమాని గాయపడ్డాడు. మంచినీళ్లు అడిగిన ఉగ్రవాదులు తర్వాత గ్రామస్తులు తమను గుర్తుపట్టారని కాల్పులకు తెగబాడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో ఒక ఉగ్రవాదిని హతమార్చారు. మరో ఉగ్రవాది కోసం 15 గంటలు డ్రోన్ల సాయంతో గాలించి మట్టుపెట్టారు.
ఉగ్రవాదం అణచివేతకు గానూ ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ గట్టిచర్యలే చేపట్టింది.సుందరలోయ ఎరుపుబారడాన్ని సహించమంటూ.. కఠిన చర్యలు చేపట్టింది. సాక్షాత్తూ మాజీ సీఎంలు అయిన ప్రధాన పార్టీల అధినేతలను గృహనిర్బంధంలో ఉంచింది. రాళ్లదాడులు, ఇతరత్రా దాడులకు పాల్పడిన వారిని గుర్తించి సైన్యం వదించింది. పెద్దనోట్లు రద్దు చేయడంతో ఉగ్రవాదులకు మనీ సరఫరా నిలిచి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈపరిణామాలతో లోయ కాస్త శాంతించింది. దీనికి తోడు ఆర్టికల్ 370 రద్దు, ఇతరత్రా చర్యలతో అక్కడి టూరిజం పెంపొందించేందుకు ప్రయత్నాలు చేసింది.
అవి ఫలిస్తున్న వేళ.. మళ్లీ ఉగ్రనాగులు బుసకొట్టి,కాటేస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. కొద్దిరోజులపాటు దేశం మొత్తం ఎన్నికల మూడ్ లోకిపోవడంతో ఉగ్రవాదులు చాపకింద నీరులా పనులు నిర్వహించారు. స్థానికంగా మళ్లీ బలోపేతమయ్యారు. ఇప్పుడు సైన్యానికి సవాల్ విసురుతున్నారు. ప్రజలపై దాడులు చేస్తూ.. అస్థిరత సృష్టిస్తున్నారు. ఈ పరిణామం కాస్తా.. భారతీయులకు ఆందోళన కలిగిస్తోంది.
మళ్లీ కశ్మీర్ ను ప్రపంచ యవనికపైకి తేవాలన్నది ఉగ్రవాదుల లక్ష్యంగా కనిపిస్తోంది. కశ్మీర్ లో ఆందోళనలు జరిగి, హింస జరిగితే.. దాన్ని చూపి మళ్లీ ఉగ్రవాదులకు ఫండింగ్ తెచ్చుకోవచ్చన్నది ఉగ్రవాదసంస్థల ఆలోచనగా కనిపిస్తోంది. ఎలాంటి ఆందోళనలు, హింసాత్మక ఘటనలు లేకుండా ఫండింగ్ అంటే.. ఏదేశమిస్తుంది మరి.. ఉగ్రదాడులతో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు చేపట్టాలని.. వేటాడి ఏరివేయాలని అమిత్ షా..బలగాలకు విస్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీనికి తోడు అమర్నాథ్ యాత్ర భద్రతపైనా పలుసూచనలు చేశారు. దీంతో ఇప్పటివరకూ అమలవుతున్న జీరో టోలరెన్స్ కు మించి మరింత పదునైన వ్యూహాన్ని సైన్యం అమలు చేయనుందన్నది రక్షణ వర్గాల సమాచారం.