లోక్‌సభ స్పీకర్ బీజేపీ వ్యక్తే..! ఎన్డీయే మిత్రపక్షాలకు నో ఛాన్స్..!!

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. గత రెండుసార్లు బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చినా కూడా మిత్రపక్షాలను కూడా భాగస్వాములుగానే పరిగణించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈసారి బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై తప్పకుండా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం సాగదనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన లోక్ సభ స్పీకర్ పోస్టును మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలలో ఒకదానికి ఇస్తారనే టాక్ నడుస్తోంది.
మోదీ ప్రభుత్వం కేంద్రంలో మనుగడ సాగించాలంటే కచ్చితంగా టీడీపీ, జేడీయూలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో టీడీపీ, జేడీయూలకు కేంద్రంలో సముచిత స్థానం దక్కుతుందని అందరూ భావించారు. ఈ రెండు పార్టీలు కూడా బీజేపీ మెడలు వంచి తమకు కావాల్సినవి దక్కించుకుంటాయని అనుకున్నారు. ఐదారు మంత్రి పదవులు తప్పకుండా తీసుకుంటాయని అంచనా వేశారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీకి ఎలాంటి షరతులు పెట్టకుండా మంత్రివర్గంలో చేరాయి టీడీపీ, జేడీయూ. దీంతో ఇప్పుడు అందరి చూపూ స్పీకర్ పోస్టుపై పడింది.
గతంలో నేషనల్ ఫ్రంట్ లో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ.. స్పీకర్ పోస్టును తీసుకుంది. బాలయోగికి ఆ బాధ్యతలు అప్పగించింది. సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు స్పీకర్ పాత్ర చాలా కీలకం. దీంతో ఈసారి కూడా స్పీకర్ పోస్టును టీడీపీ కచ్చితంగా తీసుకుంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. అటు జేడీయూ కూడా ఈ పోస్ట్ కోసం పట్టుబడుతోందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ టీడీపీకి స్పీకర్ పదవి దక్కితే తాము మద్దతు ఇస్తామని ఇండియా భాగస్వామ్య పక్షాలు కూడా చెప్తున్నాయి. దీంతో స్పీకర్ పాత్ర ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
అయితే స్పీకర్ ఎంపికకు సంబంధించి తుది నిర్ణయాన్ని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు బీజేపీకే అప్పగించినట్లు తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కేబినెట్లో కూడా ఇదే విధంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశాయి. ఇప్పుడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీడీపీ, జేడీయూ స్పీకర్ ఎంపికను బీజేపీకే వదిలేసినట్లు తెలుస్తోంది. దీంతో స్పీకర్ పోస్టును తమ వద్దే ఉంచుకునేందుకు బీజేపీ సిద్ధమైనట్టు సమాచారం. అవసరమైతే డిప్యూటీ స్పీకర్ పోస్టును టీడీపీ, జేడీయూల్లో ఒకరికి అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో స్పీకర్ పోస్టు ద్వారా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో చీలిక వస్తుందని భావించిన ఇండియా కూటమికి నిరాశే మిగిలినట్లయింది.