నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇజ్రాయెలీలు..?
హమాస్ ఉగ్రవాద ఉన్మాదంతో ఇజ్రాయెల్ తీవ్రంగా గాయపడి పదకొండు నెలలు కావస్తోంది. ఈ ఉన్మాదంపై తీవ్రంగా మండిపడిన ప్రధాని బెంజమిన్ నెతన్యాహు..హమాస్ పై యుద్ధం ప్రకటించారు. అసలే బాధతో ఉన్న ఇజ్రాయెలీలు. ఇజ్రాయెలీ పార్టీలు సైతం నెతన్యాహు వెంట నడిచాయి.11 నెలలుగా యుద్ధం జరుగుతోంది. హమాస్ నేతలను.. ఇజ్రాయెల్ దళాలు హతమారుస్తున్నాయి. కానీ.. ఇజ్రాయెలీ పౌరులను విడిపించుకోవడంలో మాత్రం … నెతన్యాహు సర్కార్ విఫలమైంది. దీంతో బందీలను హమాస్ .. క్రూరంగా హతమారుస్తున్నట్లు సమాచారం. 200 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లిన హమాస్ ఉగ్రవాదులు… వీరిలో కొందరిని విడిచిపెట్టగా , మిగిలిన వారిని తమవద్దే ఉంచుకున్నారు.
ఇంకా వంద మంది వరకు బందీలుగానే ఉన్నట్లు సమాచారం. ఇటీవలే వీరిలో ఇజ్రాయెలీ-అమెరికన్ సహా ఆరుగురిని హమాస్ హతమార్చింది. వీరి డెడ్ బాడీలను తీసుకొచ్చారు. వాటిని చూసిన ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉగ్ర సంస్థ చెరలో ఉన్నవారిని విడిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. హమాస్ తో కాల్పుల విరమణకు ఇజ్రాయెలీ పౌరులు మొగ్గుచూపుతున్నారు.మాకు హింస వద్దు.. మా వాళ్లను విడిపించండంటూ ..ఆదివారం వేలాది మంది జెరూసలెంలోని వీధుల్లోకి వచ్చారు. ప్రధాని బెంజామిన్ నెతన్యాహూకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నెతన్యాహు ఇంటి ఎదుట రాత్రంతా ఆందోళన కొనసాగించారు. దేశంలోని అతిపెద్ద వాణిజ్య సంఘం హిస్టద్రుత్ బంద్ పాటించింది. మరోవైపు..హమాస్ ఆరుగురు బందీలను హతమార్చడంతో అమెరికా కూడా తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ పై దాడి చేయకపోతే అది దైవ దూషణే అని ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా ఖొమేనీ ప్రకటించారు. తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్ అగ్ర నేత ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ హతమార్చడాన్ని ఇరాన్ తీవ్రంగా తీసుకుంది. లెబనాన్ హెజ్జొల్లా సాయంతో ఇజ్రాయెల్ పై దాడికి ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, వీటి మధ్యలో శాంతి రేఖ అన్నట్లుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య చర్చలకు ఈజిప్ట్ చొరవ చూపుతోంది. కానీ.. ఇంతలోనే బందీలను హతమార్చింది హమాస్. ఇప్పుడు ప్రజల ఆందోళనల నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.






