ASBL NSL Infratech

అమెరికాలో తెలుగు పిల్లలకు తెలుగు నేర్పించాలనే తపనతో ప్రారంభమైన ‘పాఠశాల’

అమెరికాలో తెలుగు పిల్లలకు తెలుగు నేర్పించాలనే తపనతో ప్రారంభమైన ‘పాఠశాల’

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 23వ మహాసభలు అత్యంత వైభవంగా జరిగాయి. వీటిలో భాగంగా జరిగిన తానా పాఠశాల ఆత్మీయ సమావేశం కూడా ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో పిల్లలకు తెలుగు నేర్పించడానికి తల్లిదండ్రులు కృషి చేయాలని తానా-పాఠశాల ప్రతినిధులు కోరారు. ఈ ఆత్మీయ సమావేశంలో ‘పాఠశాల’ వ్యవస్థపకులు, ఫౌండింగ్ సీఈవో శ్రీ సుబ్బారావు చెన్నూరి కూడా పాల్గొన్నారు. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీలో మన తెలుగు భాష వాడుకను పెంచటానికి శ్రీ సుబ్బారావు ఎడిటర్‌గా ఉన్న ‘తెలుగు టైమ్స్’ వార్తాసంస్థ ఎంతో కృషి చేసింది. 2013  లో ఈ సంస్థ 10 వసంతాల వేడుకల చేసుకొన్న తరువాత తెలుగు భాష కోసం ఇంకా ఏదో చేయాలనే తపన నుంచి ‘పాఠశాల’ ప్రారంభమైంది.

2013 జులై నెలలో కాలిఫోర్నియా లో ఈ ఆలోచనలకు ఒక రూపం తీసుకు వచ్చారు. భారత్‌లో ఉండే తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు, ఇతర బంధువులతో వీళ్లతో తమ పిల్లలు సరిగా మాట్లాడలేకపోతున్నారని, వాళ్లకు ఆ మాత్రం తెలుగు అయినా నేర్పించాలని 75 శాతం మంది తల్లిదండ్రులు చెప్తున్నారు. ఈ ఆశను నిజం చేయడానికి పాఠశాల సరికొత్త ఆలోచనలతో ముందుకొచ్చింది. తెలుగు నేర్చుకోవడాన్ని చాలా సులభతరం చేసింది. తెలుగు పదాలకు ఇంగ్లిష్ అర్థాలు చెప్తూ.. తెలుగులో ప్రాథమిక విద్య పుస్తకాలను అందజేసింది. చిన్నారులు కష్టపడి కాకుండా, ఇష్టంతో తెలుగు నేర్చుకోవాలనేదే ‘పాఠశాల’ లక్ష్యం. అందుకోసమే నాలుగేళ్ల ఈ తెలుగు కోర్సులోని పుస్తకాలకు తెలుగు పలుకు, అడుగు, పరుగు, వెలుగు అంటూ అందరికీ సులభంగా అర్థమయ్యే పేర్లు పెట్టినట్లు శ్రీ సుబ్బారావు  చెప్పారు. ఈ పాఠశాల విలువను గుర్తించి, ఎదుగుదలకు మద్దతుగా నిలిచిన తానాకు శ్రీ సుబ్బారావు  ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ రచయిత శ్రీ బీరం మదర్ రావు మాట్లాడుతూ.. ‘గురి చూపే వాడు’ అనే వాక్యం నుంచి ‘గురువు’ పదం ఎలా పుట్టిందో వివరించారు. అలాగే ఎన్నారై కుటుంబాల్లో పిల్లలకు మాతృభాషలో చదువు చెప్పడం ఎంత ముఖ్యమో తెలిపారు. దీనికోసం పాఠశాల అందజేస్తున్న పుస్తకాలు సులభంగా అర్ధమయ్యే రీతిలో అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. తానా ద్వారా కర్నూలు జిల్లాలో రవి పొట్లూరి ఆధ్వర్యంలో జరిగే పలు సేవా కార్యక్రమాలకు ఆ జిల్లా ఎస్పీ ప్రభాకర్ ఎంతో మద్దతు ఇస్తారు. ఆయన కూడా పాఠశాల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. తెలుగు భాష కోసం పాఠశాల చేస్తున్న కృషిని ఆయన మెచ్చుకున్నారు. తమ పిల్లలకు తెలుగు నేర్పించాలని అనుకుంటున్న తల్లిదండ్రులను కూడా ఆయన కొనియాడారు.

యూఎస్ఏలో 15 సంవత్సరాలు ఉన్న తనకు ఇక్కడే పుట్టి పెరిగిన కొడుకు వున్నాడని, అతనికి 20 ఏళ్లు వచ్చిన తర్వాత మాతృభాష ప్రాముఖ్యత తెలిసి వచ్చిందని , అప్పుడు తెలుగు రాయడం, చదవడం  నేర్చుకున్నాడని  నటులు శ్రీ రవి వర్మ తెలిపారు. తెలుగు భాష నేర్చుకోవడం చాలా సులభం కావడంతోనే మా అబ్బాయి అంత త్వరగా భాష నేర్చుకొగలిగాడని అన్నారు. 

పాఠశాల కార్యక్రమాల్లో ఆరంభం నుంచి పాలు పంచుకుంటున్న బాటా (బే ఏరియా తెలుగు అసోసియేషన్) సలహాదారు శ్రీమతి విజయ ఆసూరి మాట్లాడుతూ.. పిల్లలకు తెలుగు నేర్పించడానికి తల్లిదండ్రులు, గురువులు కృషి చాలా ముఖ్యమని, వారికి అభినందనలు తెలిపారు. అలాగే తానా చాలా పెద్ద సంస్థ అని, పాఠశాలను తానా ముఖ్యమైన కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

తెలుగు అనేది తెలుగు కుటుంబాల ఆస్తి అని, దీన్ని జాగ్రత్తగా పదిలం చేసి భవిష్యత్తరాలకు అందజేయాల్సిన బాధ్యత మనందరి మీదా ఉందని తానా సంస్థలో పాఠశాల చైర్ నాగరాజు నలజుల అన్నారు. అమెరికా వ్యాప్తంగా పాఠశాల కార్యక్రమాలు మరింత విస్తృతమయ్యేలా తానా కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సమావేశానికి హాజరైన గురువులు పార్ధ పరిటాల, సత్య పొన్నగంటి, హేమలత బొర్ర, సునీత రాయపనేని, విజయ ప్రశాంతి చల్లగుండ్ల, హరిప్రియ పాతూరి, లక్ష్మీ ప్రసన్న పోతిరెడ్డి, శ్రీలక్ష్మి గండిపర్తి, లలిత ఎల్లూరు, మాధవి చీదర, హిమబిందు సుదర్శనం, వెంకట్ సాధు, మధుబాల విందురు, లక్ష్మీ అద్దంకి, పూర్ణ చంద్ర ఇరుకులపల్లి, వరుణ్ మాకల, మనోహరిని బాటాలో పాఠశాల డైరెక్టర్ ప్రసాద్ మంగిన సభకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో 9 ఏళ్లుగా పాఠాలు నేర్పిన పద్మ లక్ష్మి మాట్లాడుతూ.. తన వద్ద పాఠాలు నేర్చుకున్న విద్యార్థులు ఇప్పుడు పాఠశాల టీచర్లుగా ఉన్నారని, తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే సమావేశానికి హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

 

Click here for Photogallery

 

 

Tags :