ASBL NSL Infratech

గ్రహణం వీడిన తానా... కొత్త కార్యవర్గం ఏర్పాటు

గ్రహణం వీడిన తానా... కొత్త కార్యవర్గం ఏర్పాటు

గత 3 రోజులు గా అందరూ 23 వ తానా మహా సభలు గురించి, అత్యధిక సంఖ్యలో (దాదాపు 18000 మంది) వచ్చిన తెలుగు వారి గురించి, అందరిని అలరించిన సమావేశాలు, సినీ విభావరుల గురించి, మధ్యలో వచ్చిన చిన్న చిన్న లోటు పాట్లు గురించి చర్చించుకొంటున్న విషయం అందరికి తెలిసిందే. 

ఈ మహాసభలు విషయం ఒకవైపు, మరోవైపు నూతన కార్యవర్గం ఎలా ఉంటుందన్న దానిపై తానా సభ్యుల్లోనేకాక ఇతర చోట్ల కూడా చర్చలు జరుగుతూ వచ్చింది. దీనికి కారణం సరైన సమయంలో తానా కార్యవర్గం ఎన్నికలు జరగకపోవటమే. దానికితోడు ఈ సంవత్సరం జరగాల్సిన ఎన్నికల విషయంలో ఇరు వర్గాలు మేరీల్యాండ్‌ కోర్ట్‌ ని ఆశ్రయించటం, ఇంజంక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకోవటం, ఎన్నికలు జరగక పోవటం తానా సభ్యులకు తెలిసిన విషయం. ఇంకా చెప్పాలంటే ఎన్నికలు జరగకపోతే.. కొత్త కార్యవర్గం తయారు కాకపొతే జరిగే పరిణామాలు (రాజ్యాంగ సంక్షోభం) గురించి  సీనియర్‌ లేదా సీరియస్‌ తానా సభ్యులు మాత్రమే వర్రీ అవుతున్న సంగతి కొందరికే తెలుసు. తానాకు గత కొద్దీ నెలలుగా పట్టిన గ్రహాణం ఈరోజు జరిగిన బోర్డు మీటింగ్‌ లో తీసుకొన్న తీర్మానాలతో పూర్తిగా విడిచింది అనే చెప్పాలి. 

గత 30-40 రోజులుగా ఎం జరుగుతోంది?

తానా ఎన్నికల విషయంలో కొత్త గా చేరిన సభ్యులకు వోటు హక్కు ఇచ్చే విషయంలో ఇరు వర్గాలు కోర్టుకి వెళ్ళటం వలన ఎన్నికల నిర్వహణ ఆగిపోయింది. తానా రాజ్యాంగం ప్రకారం అప్పటికే 2 సంవత్సరాల క్రితం ఎన్నికైన ఎక్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, 2- 3 నెలల క్రితం ఎన్నికైన కార్య వర్గ సభ్యులతో, తానా మహా సభాల చివరి రోజున తన బాధ్యతలు చేపడుతారు. ఈ సంవత్సరం కార్య వర్గ ఎన్నికలు జరగ లేదు. ప్రస్తుత కార్య వర్గం (శ్రీ అంజయ్య చౌదరి టీమ్‌) కాల పరిమితి పెంచాలంటే బోర్డ్‌ లో 2/3 మెజారిటీ తో ఆమోదం పొందాలి కనుక ఆ పని చెయ్యలేక పోయింది. మరి ఎలా? దీనినే రాజ్యాంగ సంక్షోభం అంటారు.

అప్పుడు తానా పెద్దలు జయరామ్‌ కోమటి, నాదెండ్ల గంగాధర్‌, జంపాల చౌదరి ఇరు వర్గాల మధ్య సంధి సమావేశాలు నిర్వహించటం మొదలు పెట్టారు. తానాలో భీష్ముడి లాంటి డా.బండ్ల హనుమయ్య ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా ఉండటం వలన కూడా రాజీ ప్రయత్నాలు సెమి ఫార్మల్‌ గా జరగటం మొదలు అయ్యాయి. ఎన్నికలు జరిపి ప్రజాస్వామ్య బద్దంగా నాయకులు రావటం మంచి విషయమే.. హర్షణీయం. గౌరవనీయం కూడా..  అయితే తానా లాంటి నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ కి ఇలాంటి విపత్కర పరిస్థితి నుంచి బయట పడాలంటే... ఎన్నికలు లేకుండా ఇరు వర్గాలు రాజి పడి ముందుకు వెళ్ళాలని చెప్పారు. 

నరేన్‌ కొడాలి వర్గం, నిరంజన్‌ శృంగవరపు వర్గం కూడా అందుకు సమ్మతించి రాజి చర్చలకు ముందుకు వచ్చారు. జయ్‌ తాళ్లూరి, సతీష్‌ వేమన లాంటి సీనియర్లు కూడా ఇలా వెళ్ళటమే పరిష్కారం అని ఇరు వైపులా సూచించారు. రాజి మార్గం అంటే ఇరు వైపులా కొందరు పోటీదారులు తప్పుకోవాలి. అలాగే ఆ పేర్లు ఇరు వర్గాలు ఒప్పుకోవాలి. ఇది ఒక రోజులో, ఒక మీటింగ్‌ లో తేలే విషయం కూడా కాదు. ఆ విధంగా అనేక ఫార్మల్‌ టెలి కాన్ఫరెన్స్‌ లు, ఇన్ఫార్మల్‌ ఫోన్‌ డిస్కషన్స్‌ లతో, మెల్ల మెల్లగా ఇరు వర్గాలకు ఆమోద యోగ్యమైన సభ్యుల సెలక్షన్‌ (ఎలక్షన్‌ కి బదులుగా) జరుగుతూ ఉంది. 

10 జులై 2023న ఏం జరిగింది? 

ఇరు వర్గాలు మాట్లాడుకొని ఆమోద యోగ్యమైన సభ్యులతో ఒక కార్యవర్గం ఏర్పడటం ఒక ఎత్తు అయితే... ఆ కార్య వర్గం ఎన్నిక అయినట్టు ప్రకటించాలి అంటే తానా బోర్డు ఆమోదించాలి.  బోర్డు సమావేశం తానా సభల ముందు జరిగితే ... సభల నిర్వహణకి ఏమన్నా ఇబ్బంది రావచ్చు అని ఆ సమావేశాన్ని ఈరోజు (10 జులై 2023) న హోటల్‌ మారియట్‌ లో జరిపారు. కొత్త కార్యవర్గాన్ని బోర్డులో ప్రవేశ పెట్టి 2/3 మెజారిటీ తో పాస్‌ అయ్యేలా చూసుకొన్నారు. ఆ విధంగా వచ్చిన కార్యవర్గ వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. 

చివరి మాట.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు తయారు అయి, విరమించుకోవడం వలన కొందరు నాయకులు, వారి స్నేహితులు నిరుత్సాహ పడవచ్చు. ఆవేశ పడవచ్చు. కానీ తానా సంస్థ ని తల్లి గా భావించి, తల్లి ఆరోగ్యం ముఖ్యం అని  ముందుకు వెళ్ళాలి అందరు అనుకోవడం ఒక శుభ పరిణామం. ఎన్నికలలో పోటీకి దిగిన నాయకులు అందరూ ఇప్పటికే తమ టైమ్‌ ని, డబ్బుని ఖర్చు పెట్టారు. ఈ పద్దతిలో బోలెడు డబ్బు వృధా కాకుండా మిగిలింది. తానా సంస్థకి కూడా ఎన్నికల నిర్వహణ భారం పోయింది.  కొన్ని వేల (లేదా లక్షల) డాలర్ల ఖర్చు మిగిలింది. 

ముందుగా ఎంతో శ్రమపడి ఈ ప్రక్రియ పూర్తి చేసిన జయరాం కోమటి, నాదెళ్ల గంగాధర్‌, జంపాల చౌదరి లకు మా హృదయపూర్వక అభినందనలు. తానా సంస్థ మీ సేవలను చిరకాలం గుర్తించు కొంటుందని భావిద్దాం. 

నిన్న రాత్రి (9 జులైన) బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు నిరంజన్‌ శృంగవరపు, కొత్తగా 2025-27కి అధ్యక్షుడి గా వస్తున్న డా నరేన్‌ కోడాలి ఇద్దరు అందరికి తెలిసిన నాయకులు. ఇద్దరూ సౌమ్యులుగా పేరు పొందిన వారు.  ఇద్దరూ కలిసి ఇరువర్గాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులతో తానాని ముందుకు తీసుకెళ్లాల్సిన భాద్యత ఇద్దరి మీద ఉంది.  ఇప్పటి వరకు 36000 మంది సభ్యలతో వున్న తానా ఇప్పుడు 70000 మంది సభ్యులతో ప్రపంచం లోనే అతి పెద్ద సంస్థగా మారింది. ఈ సంస్థ ను ముందుకు తీసుకెళ్లే అవకాశం, అదృష్టం వచ్చింది. ఎంతో శ్రమ పడాలి.. ఎన్నో రాజిలు పడాలి.. కానీ తానాను ముందుకు తీసుకెళ్ళాలి.  అలా స్నేహభావంతో ముందుకు వెళ్లాల్సింది గా మా కోరిక.

 

(చెన్నూరి వెంకట సుబ్బారావు)

 

 

 

 

Tags :