ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రధాని మోడీ ఈ "టెక్సాస్" రాష్ట్రాన్ని మాత్రమే ఎందుకు ఎంచుకొన్నారు ?

ప్రధాని మోడీ ఈ "టెక్సాస్" రాష్ట్రాన్ని మాత్రమే ఎందుకు ఎంచుకొన్నారు ?

ఇది చాలా ఆసక్తికరమైన, చారిత్రిక ప్రాధాన్యమైన అంశం. ఓసారి చరిత్రను తిరగేస్తే, 90వ దశకంలో పీవీ నరసింహారావు గారు ప్రధాని అయినప్పుడు కాశ్మీర్లో అల్లకల్లోలంగా పరిస్థితులు నెలకొనివున్నాయి. ఆ అల్లర్లను ఉక్కుపాదంతో అణచివేశారు పీవీ గారు. ఆసందర్భంలో జరిగిన ప్రాణనష్టం, అశాంతి, శాంతిభద్రతలు, మానవహక్కులూ తదితర అంశాలన్నీ అంతర్జాతీయంగా భారతదేశాన్ని ఇబ్బందికరపరిస్థితుల్లోకి నెట్టాయి.

అప్పుడే కొత్తగా అమెరికా అధ్యక్షుడైన బిల్ క్లింటన్ గారు భారత్ పై గుర్రుగా ఉన్నారు. మన ప్రధాని పీవీ గారిని ఇబ్బందులకు గురిచేశాడు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్న దేశాలన్నింటినీ తూర్పారబడుతూ, ఆ లిస్ట్ లో భారత్ ను కూడా చేర్చాడు క్లింటన్. ఈ సందర్బంగా దక్షిణ ఆసియా వ్యవహారాలను చూడడానికి క్లింటన్ నియమించిన Robin Raphel కాశ్మీర్ అంశంలో భారతదేశాన్ని తీవ్రంగా యిబ్బంది పెట్టడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదు. ఈయనగారి మద్దతుతోనే పాకిస్థాన్ 1994 లో ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘంలో తీర్మానాన్ని పెట్టి భారత్ ను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. - అయితే ఆ అసంక్షోబాన్ని పీవీ గారు అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అప్పటి ప్రతిపక్షనేత వాజపేయి గారి నాయకత్వంలో ఒక డెలిగేషన్ ను ఐక్యరాజ్యసమితికి పంపి భారతదేశపు వాదనను గట్టిగా వినిపించి పాకిస్థాన్ వాదనను సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఆ డెలిగేషన్లో ఫరూక్ అబ్దుల్లా,మన్మోహన్ సింగ్, సల్మాన్ ఖుర్షీద్ లాంటి ఉద్దండులు ఉన్నారు. - పీవీగారి చాణక్యానికి నిదర్శనం ఆ సంఘటన. 

ఇదే సందర్భంలోనే అప్పటి మన ప్రధాని పీవీ నరసింహారావు గారు 1994 లో అమెరికా ఉభయ చట్టసభలను ఉద్దేశ్యించి ప్రసంగించారు. అదొక చారిత్రాత్మక ప్రసంగం. కాశ్మీర్ అంశంలో భారతదేశాన్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్న అమెరికా ప్రవర్తనతో చికాకులో ఉన్న పీవీగారు, అమెరికా ఉభయసభల ప్రసంగంలో అచ్చం మనకు కాశ్మీర్ సమస్యగానే ఉన్నటువంటి వారి "టెక్సాస్ రాష్ట్ర"సమస్యను ప్రస్తావించారు. 

1868లో టెక్సాస్ రాష్ట్రం అమెరికాలో భాగమైంది. ఆసందర్భంలో "టెక్సాస్ ప్రాంతం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భాగమైన మరుక్షణంనుండే అది అమెరికాలో విడదీయరాని అంతర్భాగమైంది" అంటూ అమెరికా సుప్రీం కోర్ట్ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ టెక్సాస్ గత చరిత్రను వారికి గుర్తుచేశారు. 

ఈసందర్బంగా ఓసారి టెక్సాస్ గత చరిత్రను చూస్తే, టెక్సాస్ అన్నది అంతకుముందు మెక్సికోలో భాగంగా ఉండేది. తదనంతరపరిణామాల్లో 1830లో స్వతంత్రరాజ్యంగా ప్రకటించుకొన్నది. ఆతరవాత అమెరికాతో కలవడానికి ఒప్పందం చేసుకొన్నది. ఈపరిణామాల నేపథ్యంలో అమెరికా మెక్సికో మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇప్పటికీ మెక్సికో - అమెరికా మధ్యన సరిహద్దువిషయమై వివాదాలే ఉన్నాయి. ఈ సరిహద్దు గొడవలను శాశ్వతంగా రూపుమాపడంతోబాటు, అక్రమ చొరబాట్లు, డ్రగ్ స్మగ్లింగ్ ఇలాంటివాటిని అరికట్టడానికి అమెరికా - మెక్సికో మధ్యలో ఒక పెద్ద శాశ్వతమైన గోడను కట్టడానికి నిర్ణయం తీసుకొన్నాడు ట్రంప్. 

.... ఈ "మెక్సికో - టెక్సాస్ - అమెరికా" సమస్యను చూస్తూంటే అచ్చం మన "పాకిస్తాన్ - కాశ్మీర్ - భారత్" సమస్యలాగానే ఉందికదా ? 

సరిగ్గా ఇదే అంశంపై దెబ్బవేశారు మన పీవీ గారు. - పీవీగారి ఉద్దేశ్యం ఏమిటంటే, టెక్సాస్ విషయంలో మీరేలాగైతే మెక్సికోతో ఘర్షణలు పడుతూ, ముమ్మాటికీ టెక్సాస్ అన్నది అమెరికాలో అంతర్భాగం, అమెరికాతో విడదీయరానిది టెక్సాస్ అంటూ బల్లగుద్ది చెబుతున్నారో, అచ్చం కాశ్మీర్ కూడా టెక్సాస్ లాగా స్వతంత్రరాజ్యంగా ఉంటూ, భారతదేశంలో జాయిన్ అవడానికి ఒప్పందం చేసుకొన్నది. దానిని మా పార్లమెంట్ ఆమోదించింది. అలాంటప్పుడు కాశ్మీర్ మాది అంటూ పాకిస్థాన్ ఏవిధంగా వాదిస్తుంది అంటూ ప్రశ్నించారు. టెక్సాస్ ఎలాగైతే అమెరికాలో అంతర్భాగమో కాశ్మీర్ కూడా భారత్ లో అంతర్భాగంగా ఉంది. మీ సమస్యలాగే మాసమస్యనుకూడా చూడండి అంటూ అమెరికా ఉభయసభల్లో అందరినోర్లూ మూయించారు - పీవీగారి ప్రసంగానికి అమెరికా ఉభయసభల సమావేశంలో హర్షద్వానాలు చేశారని చదివాను. 

..... అదీ చరిత్ర, ఇక మోదీగారి ప్రస్తుత టెక్సాస్ పర్యటనను చూస్తే, 25 ఏళ్ళక్రితం నాటి పరిస్థితులే ఇప్పుడు భారత్ - కాశ్మీర్ - పాకిస్థాన్ మధ్యలో నెలకొని ఉన్నాయి. పైగా ఆర్టికల్-370 ని నిర్వీర్యం చేశేశాక, ఇక పాకిస్థాన్ రెక్కలుతెగిన పక్షిలా గిలగిలా కొట్టుకొంటూ ఉంది. ఇరవైఏళ్లక్రితం ఐక్యరాజ్యసమితిలో ఇరుదేశాలూ కాలుదువ్వుకొన్నాయి. అయితే, పాకిస్థాన్ కు అప్పుడున్న మద్దతు నేడు లేదు. అప్పుడు అమెరికా పాకిస్థాన్ పక్షాన ఉండేది. నేడు పరిస్థితి పూర్తిగా తారుమారయింది. 

అచ్చంగా కాశ్మీర్ లాంటి చరిత్రఉన్న టెక్సాస్ లో కనీవినీ ఎరుగనటువంటి రీతిలో నిర్వహిస్తున్న అతిపెద్ద సభలో మోడీతో బాటు అమెరికా రాజకీయనాయకులూ, వివిధరంగాల ప్రముఖులూ, భారత సంతతికి చెందినవారూ పాల్గొంటున్నారు, పైగా ఏకంగా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా వస్తున్నారు అంటే ఈ కార్యక్రమానికున్న ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతోంది. 

అసలు ఆర్టికల్-370 రద్దుచేశాక పాకిస్తాను ప్రయత్నాలన్నిటినీ విజయవంతంగా నిర్వీర్యంచేస్తూ, రెక్కలువిరిచిపడేసిన భారత్, ఈ అంశానికి క్లైమాక్స్ లాంటి ఐక్యరాజ్యసమితిలో మోదీగారి ప్రసంగానికి వెళ్లేముందు అమెరికా కాశ్మీర్ లాంటి టెక్సాస్ లో ట్రంప్ సమక్షంలో తన బలప్రదర్శన చేయనున్నారు మోడీ. మోడీ గారికి దౌత్యపరంగా ఇది అత్యద్భుతమైన విజయం - లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్ అన్నమాట. 

... అయితే, దీంట్లో ట్రంప్ రాజకీయం కూడా ఇమిడి ఉంది. 

టెక్సాస్ రాష్ట్రంలో మెజారిటీ రిపబ్లికన్లపక్షమే అయినప్పటికీ, ప్రస్తుత సర్వేలప్రకారం వెనకబడిఉన్నాడు. అలాగే రాబోయే అధ్యక్షా ఎన్నికల్లో ట్రంప్ కున్న భారత వ్యతిరేక - వలసవాద వ్యతిరేకముద్రకూడా కొంతవరకూ తొలిగే అవకాశం ఉంది. ఇక వాణిజ్యం విషయానికిస్తే మనం అమెరికానుండి ఆయిల్, గ్యాస్ తదితరాలను దిగుమతి చేసుకోవడంలో టెక్సాస్ కంపెనీల భాగం ఎక్కువగా ఉంది. 

ఏరకంగా చూసినా "హౌడీ మోడీ" పేరిట టెక్సాస్ లో నిర్వహిస్తున్న ఈ భారీ కార్యక్రమానికి రాజకీయం - వాణిజ్యం - దౌత్యం ఇలా పలు పార్శ్వాలున్నాయి. అమెరికాలో ఉన్న భారతీయులు అక్కడి రాజకీయాల్లోనూ, పాలనా వ్యవస్థల్లోనూ క్రియాశీలం కావడానికి ఇలాంటివి ఎంతో ఉపయుక్తమవుతాయి. అలాగే మనకు అమెరికా రాజకీయ - పాలనావ్యవస్థల్లో ఒక బలమైన లాబీ తయారవుతుంది. 

అమెరికాలో అధికారపక్షమైన రిపబ్లికన్లను, ప్రతిపక్షమైన డెమొక్రాట్లను ఒకేసభకు ఆహ్వానించి కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాటుచేయనున్నఈ కార్యక్రమం నిస్సందేహంగా మోడీ ఇమేజ్ ను అమాంతం పెంచుతుంది. 

అలాగే, ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించటానికి. వెళుతున్నమోడీ, ప్రస్తుత కాశ్మీర్ వివాదాల నేపథ్యంలో కాశ్మీర్ లాంటి చారిత్రాత్మక ప్రాధ్యాన్యమున్న టెక్సాస్ ను ఎంచుకోవడం అన్నది చాలా వ్యూహాత్మకమైన నిర్ణయం. 

మీకు టెక్సాస్ ఎలాగో మాకు కాశ్మీర్ అలాగే అని నొక్కిచెప్పడం. ఇక పాకిస్థాన్ శ్రీనగర్ గురించి కలలుకనడం మానేసి, ముజఫరాబాద్ ను భారత్ నుండి ఎలా కాపాడుకోవాలో ఆలోచించుకోవాలి. ఇకపై ఏవైనా అంతర్జాతీయ వేదికల్లో పాకిస్థాన్ కాశ్మీర్ అంశం ప్రస్తావనకు తెస్తే, భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అన్న కాంటెక్స్టు లోనే చర్చలు జరుపుతుంది - పాకిస్థాన్ కు ఇది కోలుకోలేని దెబ్బ.

 

Tags :