ASBL NSL Infratech

స్వతంత్ర పాలస్తీనాయే లక్ష్యం : హమాస్‌

స్వతంత్ర పాలస్తీనాయే లక్ష్యం : హమాస్‌

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం మొదలై దాదాపు ఏడు నెలలవుతోంది. గాజాను మరుభూమిగా మార్చింది ఇజ్రాయెల్. భీకరదాడులతో హోరెత్తిస్తోంది. హమాస్ ఉగ్రవాదుల కోసం అణువణువూ గాలిస్తోంది. పుట్టల్లో దాక్కున్న ఉగ్రవాదులను హతమారుస్తోంది. అయినా హమాస్ నేతలు.. ఏమాత్రం తగ్గడం లేదు.దీంతో అటు ఇజ్రాయెలీ దళాలు..ఇటు హమాస్ ఉగ్రవాదుల మధ్య అమాయకపు గాజావాసులు నలిగిపోతున్నారు. అగ్రరాజ్యం ఓవైపు ఇజ్రాయెల్‌ తీరును ఖండిస్తూనే, వారికి ఆయుధ, ఇతర రక్షణ సంపత్తిని అందజేస్తోంది.

ఇప్పటికీ అనేకమంది బందీలు ఉగ్ర చెరలోనే ఉన్నారు. మరోవైపు టెల్‌అవీవ్‌ భీకర దాడులు.. గాజాను నేలమట్టం చేశాయి. ఇప్పటికే 34 వేల మందికి పైగా మృతి చెందారు. ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ చర్చలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా మారాయి. ఈ పరిణామాల నడుమ హమాస్‌ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్‌ అల్‌-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. 1967కు ముందునాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే.. ఇజ్రాయెల్‌తో ఐదేళ్లు, అంతకంటే ఎక్కువకాలం సంధికి సిద్ధంగా ఉన్నామన్నారు. అదేవిధంగా ఆయుధాలు వీడి.. గాజా, వెస్ట్ బ్యాంక్‌లో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌లో చేరాలనుకుంటున్నట్లు తెలిపారు.

హమాస్‌ను నిర్మూలించడంలో ఇజ్రాయెల్‌ విజయం సాధించలేదు. ఇప్పటివరకు కేవలం 20 శాతం మాత్రమే దెబ్బతీయగలిగింది. యుద్ధం ముగుస్తుందని మాకు హామీ ఇవ్వకపోతే.. బందీలను ఎందుకు విడుదల చేస్తాం? ఒకవేళ హమాస్‌ను అంతం చేయకపోతే పరిష్కారం ఏంటి? కాబట్టి.. ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వెళ్లడమే ఉత్తమం అని అల్‌-హయ్యా వ్యాఖ్యానించారు. గాజాలో వినాశనానికి దారితీసినప్పటికీ.. అక్టోబరు 7 నాటి దాడుల విషయంలో పశ్చాత్తాపం లేదని చెప్పారు.

పాలస్తీనా సమస్యను మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడంలో తాము విజయం సాధించామన్నారు. శాశ్వత కాల్పుల విరమణ, ఇజ్రాయెల్‌ బలగాల పూర్తిస్థాయి ఉపసంహరణ డిమాండ్ల నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. అయితే ద్విదేశ పరిష్కారానికి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు నిరాకరిస్తున్నారు. హమాస్‌ను అంతం చేసేవరకు పోరాటం సాగిస్తామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు నెతన్యాహు. దేశభద్రతకు ప్రమాదకరమైన ఇలాంటి ప్రతిపాదనలను తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :