ఇండియన్స్ వల్లే అమెరికా టెక్ పరిశ్రమకు మనుగడ : భాటియా
అమెరికా టెక్ పరిశ్రమకు కేరాఫ్ సిటీ సిలికాన్ వ్యాలీలో ఇన్నోవేషన్లకు భారతీయులే నాయకత్వం వహిస్తున్నారట. భారతీయుల సహకారం లేకుండా యూఎస్ టెక్ పరిశ్రమ మనుగడ సాగించడం కష్టతరమట. ఈ విషయాన్ని సిలికాన్ వ్యాలీ సెంట్రర్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఈసీవో హర్బీర్ కె భాటియా తెలిపారు. గత రికార్డుల ప్రకారం, సిలికాన్ వ్యాలీలో 40 శాతం సీఈవోలు/ వ్యవస్థాపకులు దక్షిణాసియా లేదా ఇండియాకు చెందిన వారేనని భాటియా తెలిపారు. గూగుల్ నుంచి యూట్యూబ్, మైక్రోసాఫ్ట్ వరకు ప్రధాన కంపెనీలన్నింటికీ భారతీయులే నాయకత్వం వహిస్తున్నారని వెల్లడిరచారు. కష్టపడే తత్వం, మెరుగైన ఉత్పాదతక వంటి విలువలే భారతీయుల్ని ఉన్నత స్థానాలకు చేర్చుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 100 శాతం లక్ష్యం చేరుకోవాలన్న మన సంస్కృతే మనల్ని ఇతరులకు భిన్నంగా నిలబెడుతోందని, మనం ఒకపట్టాన సంతృప్తి చెందే వ్యక్తులం కాదని ఆయన అన్నారు. సిలికాన్ వ్యాలీ విజయంలో భారతీయుల పాత్ర చాలా కీలకమైందని తెలిపారు.
అమెరికా టెక్ పరిశ్రమ కార్యకలాపాలు అన్నింటినీ భారతీయులే నిర్వహిస్తున్నారన్న భాటియా, ఆయా టెక్ కంపెనీల్లో ఒక ఉద్యోగి అమెరికన్ అయితే, ముగ్గురు భారత్ నుంచి పనిచేస్తుంటారని పేర్కొన్నారు. ప్రతి టెక్ సంస్థ లాభార్జనకు భారతీయులే కారణమని గర్వంగా తెలిపారు.