ASBL NSL Infratech

అమెరికాలో తెలుగు వారందర్నీ తానా ఏకం చేసింది : సుప్రీంకోర్ట్ మాజీ సీజే ఎన్వీ రమణ

అమెరికాలో తెలుగు వారందర్నీ తానా ఏకం చేసింది : సుప్రీంకోర్ట్ మాజీ సీజే ఎన్వీ రమణ

తానా మహాసభలు మూడో రోజు కూడా ఘనంగా సాగాయి. ఈ క్రమంలోనే భారత సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను తానా నేతలు సత్కరించారు. వేద పండితుల ఆశీర్వాదం అనంతరం తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి తదితరులు ఆయనకు సన్మానం చేశారు. ఆ తర్వాత ఎన్వీ రమణ చేసిన సేవలను గుర్తించిన న్యూజెర్సీ ప్రభుత్వం.. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కూడా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాలోని తెలుగు వారందర్నీ ఏకం చేస్తున్న తానాను మెచ్చుకున్నారు. అదే సమయంలో తానా వ్యవస్థాపకులను స్మరించుకోవాలన్నారు.

ఫిలడెల్ఫియాకు అమెరికాలో చాలా ప్రత్యేకత ఉందని, ఇక్కడి నుంచే అమెరికా తమ స్వతంత్రాన్ని ప్రకటించుకుందని చెప్పారు. అమెరికా పర్యటనకు భారత ప్రధాని మోదీ వచ్చినప్పుడు ఆయనకు దక్కిన గౌరవం భారతీయులందరికీ దక్కిన గౌరవంగా భావించాలన్నారు. భారత స్వతంత్రం కోసం తెలుగు వారు ఎంతో పోరాటం చేసినా.. అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండటంతో తగిన గుర్తింపు రాలేదని ఎన్వీ రమణ చెప్పారు. ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో ముందుకు వచ్చిన తర్వాత తెలుగు వారికి దక్కాల్సిన గౌరవం దక్కిందన్నారు. 

‘జాతీయ స్థాయిలో కూటమి కట్టి వందేళ్ల రాజకీయ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి వేసిన చరిత్ర ఆయనది. ఆయన రాజీ ఎరుగని నాయకుడు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. రాజ్యాంగ అధికారంలో బడుగుబలహీన వర్గాలకు స్థానం కల్పించారు. తన మూలాలు మరువని వ్యక్తి. పేదలను, పల్లె ప్రజలను అభిమానించే వ్యక్తి. క్రమశిక్షణకు మారుపేరు. ఆయన అభిమానులంతా కూడా అలాగే క్రమశిక్షణతో ఉండి ఆయనకు నివాళులు అర్పించాలని కోరుతున్నా. పార్టీలు ఆయన్ను వాడుకున్నారే కానీ.. ఆయనకు అందించాల్సిన గౌరవం లభించలేదు. తెలుగు జాతి ఐక్యంగా ఉండి ఆయన వెనుక నిలబడి ఉంటే.. తెలుగు వారి గుర్తింపు, ఎన్టీఆర్‌కు గుర్తింపు వేరుగా ఉండేది. ఇప్పుడు శతజయంతి ఉత్సవాల సందర్భంగా అయినా సరే.. ఆయనకు భారత రత్న దక్కే వరకు పోరాడాలి’ అని ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. 

భారత్ నుంచి అమెరికా వచ్చిన తొలి తరం డాక్టర్లు, ఇంజనీర్లు చేసిన కృషిని ఆయన గుర్తుచేసుకున్నారు. అమెరికాలో ఉన్న భారతీయల్లో 14 శాతం తెలుగు వారేనని అంచనా ఉన్నట్లు చెప్పారు. అలాగే ఇటీవల అమెరికా వచ్చిన విద్యార్థుల్లో 25 శాతం మంది తెలుగు వారే కావడం గర్వకారణమన్నారు. గతంలో తను వచ్చినప్పుడు తెలుగు వారికి కొన్ని విషయాలు చెప్పానన్న ఆయన.. వాటిని మరోసారి గుర్తుచేశారు. ‘సమాజానికి దూరంగా వెళ్లకండి. సమాజంలో భాగంగా మెలగండి. అమెరికా రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే తెలుగు వారికి ఇన్ని అవకాశాలు లభించాయని మర్చిపోకూడదు. వైవిధ్యాన్ని గౌరవించే సమాజమే ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని గుర్తుంచుకోవాలి’ అని తెలిపారు.

‘మన మంచిని పంచండి. తెలుగు వారి ఖ్యాతిని పెంచండి. కుల, మత దురభిమానాలను వదిలేయండి. పురాతన కాలపు పోకడలు అభివృద్ధికి ప్రతిబంధకాలు అని గుర్తించండి’ అని సూచించారు. అలాగే తెలుగు భాష భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతుందని, ఆ భాషను చిన్నచూపు చూడటం సరైంది కాదని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే శక్తిగా తెలుగు జాతి ఎదగాలని ఆకాంక్షించారు. తెలుగు మూలాలున్న వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలనేది తన కోరిక అన్నారు.

 

>

 

 

Tags :