INDIA Alliance: ఇండియా కూటమి సారధ్య బాధ్యతలు ఎవరికి?

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమి(INDIA Alliance) పేరుతో ఎన్డీఏను ఢీకొట్టాలని భావించాయి. అయితే ఇప్పుడు అదే ఇండియా కూటమి విచ్ఛిన్నం కాబోతోంది. వాస్తవానికి 2023లో దేశంలోని 26 ప్రధాన ప్రతిపక్షాలు కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ 26 ప్రధాన పార్టీల కలయికతో ఇండియా అలయన్స్ (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) ఏర్పాటయ్యింది. ప్రస్తుతం మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షునిగా ఉన్న కాంగ్రెస్ ఈ కూటమికి సారధ్యం వహిస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీని పొందలేకపోయింది. మరోవైపు భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చి తమకు తిరుగులేదని చాటి చెప్పింది. పదేళ్లు పరిపాలన పూర్తి చేసుకున్న బీజేపీ 2024 ఎన్నికల్లో ఓడిపోతుందని.. ప్రభుత్వ వ్యతిరేకత ఖాయమని చాలా మంది అంచనా వేశారు. అయితే వాళ్ల అంచనాలన్నీ తలకిందులు చేస్తూ బీజేపీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. బీజేపీని ఎలాగైనా ఓడిరచాలని పట్టుదలతో ప్రయత్నించిన కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది.
ఇండియా కూటమిలో చేరిన పార్టీలు ఇప్పుడు ఒక్కొక్కటిగా దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. వీటిలో ముందుగా మహారాష్ట్రకు చెందిన ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) నుంచి విడిపోతున్నట్లు మహారాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. దీనికి ముందు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించడంతో సమాజ్‌వాదీ పార్టీ – కాంగ్రెస్ మధ్య వివాదం నెలకొంది. సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. లోక్‌సభలో అవధేష్ ప్రసాద్‌ను వెనక్కి పంపడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ ఓటమి తర్వాత మమతా బెనర్జీ.. బెంగాల్ నుండే కూటమి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో ఇండియా అలయన్స్‌కు నాయకత్వం వహించే బాధ్యతను ఆమె కోరుకుంటున్నారా లేక ఇండియా అలయన్స్ నుండి ఆమె వేరుపడుతున్నారా అనేది అర్థంకాని ప్రశ్నగా మారింది. ఒక ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ ఇండియా కూటమి సృష్టికర్త తానేనని, దానిని నిర్వహించాల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉందన్నారు. కానీ వారు దానిని సమర్థవంతంగా నెరవేర్చలేకపోతే తానేమి చేయగలనని ప్రశ్నించారు. మరోవైపు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఇటీవల మమతా బెనర్జీని ఇండియా కూటమికి నాయకురాలిగా అభివర్ణించారు.
మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి వరుస అపజయాలు ఎదురవుతున్న నేపధ్యంలో ఇప్పుడు కూటమి సారధ్య బాధ్యతల టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి అప్పగించాలనే వాదన వినిపిస్తోంది. దీనికితోడు ఆమె కూడా ప్రతిపక్ష కూటమికి నాయకత్వ బాధ్యతలు వహించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో దేశంలోని పలువురు మేధావులు, రాజకీయ పార్టీలు మమతా బెనర్జీవైపు మొగ్గుచూపడం ప్రారంభించారు. ఈ విషయంలో ప్రముఖ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్‌లు మమతకు తమ ఓటు వేశారు.
రాహుల్ గాంధీ నాయకత్వ లోపం
అటు హర్యానా, ఇటు మహారాష్ట్రలలో బీజేపీతో జరిగిన ప్రత్యక్ష పోరులో కూటమి ఓటమికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వ లోపమే కారణమంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇవి తృణమూల్ అధినేత మమతకు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో అటు రాహుల్ గాంధీ, ఇటు మమతా బెనర్జీలలో ఎవరి బలాలు ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. మమతా బెనర్జీకి ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయనే మాట వినిపిస్తోంది. టీఎంసీ నేతలు కూడా మమతనే కూటమికి తగిన సారధి అంటూ ప్రచారం సాగిస్తున్నారు. మమతా బెనర్జీ ఏడుసార్లు ఎంపీగా, నాలుగుసార్లు కేంద్రమంత్రిగా, మూడుసార్లు సీఎంగా రాజకీయాల్లో అపార అనుభవం సంపాదించారని టీఎంసీ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. అందుకే ఆమెనే కూటమికి తగిన సారధి అంటూ స్పష్టం చేస్తున్నారు. సుపరిపాలనలో ఆమె రికార్డు అద్భుతంగా ఉందని, గత ఎన్నికల్లో బీజేపీని ఆమె చిత్తుగా ఓడిరచారని పలువురు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలువురు నేతలు కూడా కూటమి సారధిగా ఆమె ఉంటేనే అధికార పక్షానికి తగిన సమాధానం చెప్పగలమని అంటున్నారు. అంతేకాకుండా మమత నేతలనందరినీ తన వెంట తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగివున్నారని వారు విశ్లేషిస్తున్నారు. ఇండియా కూటమికి అధినేత్రిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉండేందుకు మద్దతు పలికిన ప్రతిపక్ష నేతల జాబితాలో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ నేతలు అఖిలేష్ యాదవ్, రామ్ గోపాల్ యాదవ్ ఉన్నారు.
మమతా బెనర్జీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2011లో తొలిసారిగా ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. మూడు సార్లు సీఎంగా ఉన్నారు. ఆమె టీఎంసీ అధినేత్రిగానూ వ్యవహరిస్తున్నారు. 1998లో కాంగ్రెస్ నుంచి విడిపోయి టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. మమత పలుమార్లు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. రెండుసార్లు రైల్వే మంత్రిగా ఉన్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు కూడా సారధ్యం వహించారు. ఆమె 2011 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మమతా బెనర్జీ ఏడుసార్లు ఎంపీగా ఉన్నారు.
యూపీలోని రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతు న్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ రాయ్‌బరేలీ, వయనాడ్ రెండు స్థానాల్లోనూ గెలుపొం దారు. అయితే ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గంగా రాయ్‌బరేలీని ఎంచుకున్నారు. ఆయన సోదరి ప్రియాంక వయనాడ్ ఎంపీగా ఇటీవలే ఎన్నికయ్యారు. రాహుల్ గాంధీ 2017 నుంచి 2019 వరకు కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన 2004లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అమేథీ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో కూడా అమేథీ నుంచి గెలుపొందారు. 2019లో రాహుల్ గాంధీ అమేథీ స్థానం నుంచి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిని చవిచూశారు. 2019లో ఆయన వయనాడ్ ఎంపీగా ఎన్నికయ్యారు.