Vice President: ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రాసెస్ ఇదే, ఎలక్టోరల్ కాలేజి అంటే ఏంటీ..?

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ థన్కర్ రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత, భారత ఎన్నికల సంఘం (ECI) తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించింది. దీనితో తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరు కాబోతున్నారు..? అసలు ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఆయనను ఎవరు ఎన్నుకుంటారు? ఉపరాష్ట్రపతి ఎన్నికలలో వినపడే ఎలక్టోరల్ కాలేజీ అంటే దాని అర్ధం ఎంటీ..? ఆయన ఎన్నికకు రాజ్యాంగ నిబంధనలు ఏంటి..? అనే ప్రశ్నలు ఇప్పుడు పెద్ద ఎత్తున వింటున్నాం.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం 1952 ప్రకారం ఈ రెండు పదవులకు కీలక మార్గదర్శకాలు ఉన్నాయి. భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 64 నుండి 68 వరకు ఉన్న నిబంధనల ద్వారా నిర్వహిస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఉపరాష్ట్రపతి కార్యాలయానికి ఎన్నికలు నిర్వహించే అధికారం భారత ఎన్నికల సంఘానికి ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66(1) ఉపరాష్ట్రపతి ఎన్నిక ఒకే బదిలీ ఓటుతో అనుపాత ప్రాతినిధ్య వ్యవస్థ ద్వారా జరుగుతుందని స్పష్టంగా వివరిస్తోంది.
ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం.. ఎలక్టోరల్ కాలేజీలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎన్నికైన, నామినేట్ చేయబడిన సభ్యులు ఉంటారు. ఒకసారి అర్హతలు చూస్తే.. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి భారత పౌరుడై ఉండాలి. అతని వయస్సు 35 సంవత్సరాలు ఉండాలి. అతను రాజ్యసభ(Rajyasabha) సభ్యుడిగా అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వాల నియంత్రణకు లోబడి ఏదైనా స్థానిక లేదా ఇతర అధికారం కింద ఎటువంటి లాభదాయక పదవిని కలిగి ఉండకూడదు.
కనీసం 20 మంది ఓటర్లు నామినేషన్ పత్రాన్ని ప్రతిపాదించాలి. మరో 20 మంది అభ్యర్థి నామినేషన్ పత్రానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలో ఈవీఎం వినియోగించరు. బ్యాలెట్ పత్రాలు గులాబీ రంగులో హిందీ, ఆంగ్లంలో ముద్రిస్తారు. దీనిలో రెండు వరుసలు ఉంటాయి. ఒకటి అభ్యర్థుల పేర్లు మరియు మరొకటి ప్రాధాన్యతలు ఉంటాయి. భారత ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎం వాడకపోవడానికి కారణం ఒకే బదిలీ ఓటు ద్వారా అనుపాత ప్రాతినిధ్య వ్యవస్థ కింద అభ్యర్థులకు ఒక ఓటరు తన ప్రాధాన్యతను గుర్తించవలసి ఉంటుంది. కాబట్టి, ఈవీఎంకు బదులుగా బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తారు. ఉపాధ్యక్షుడి ఎన్నికలో ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు. ఓటర్లు తమ సొంతగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకు ఏ విధమైన విప్ వర్తించదు.