Priyanka Gandhi : ప్రియాంక గాంధీ తప్పటడుగులు..!?

దేశంలో రాజకీయాలు ఎటు పోతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఒక పార్టీ ఒక దారిలో నడుస్తూ ఉంటే.. దాన్ని వ్యతిరేకించే పార్టీ కచ్చితంగా మరో దారిలో నడవాలనుకుంటోంది. ఆ దారిలో ముళ్లకంపలు ఉంటాయని తెలిసినా.. ప్రత్యర్థికి వ్యతిరేకంగా వెళ్లాలనే ఆలోచన తప్పా మంచి చెడుల గురించి పార్టీ ఆలోచించట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇలాగే కనిపిస్తోంది. బీజేపీ ఓ అంశాన్ని లేవనెత్తిందంటే దాన్ని కచ్చితంగా వ్యతిరేకించాలనే ధోరణి కాంగ్రెస్ పార్టీ చూపిస్తోంది. పాలస్తీనా – ఇజ్రాయెల్ అంశాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటూ తమ బేలతనాన్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి రుజువు చేసుకుంటోంది.
ఇటీవలే వయనాడ్ (Wayanad) లోక్ సభ స్థానం నుంచి గెలిచిన ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టారు. ఆమె నడవడిక ఎలా ఉంటందో.. ఆమె ఎలా మాట్లాడుతుందో.. అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) దాదాపు పదిహేనేళ్లుగా కాంగ్రెస్ (Congress) లో యాక్టివ్ రోల్ తీసుకున్నా పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ రాహుల్ కు తోడైతే మంచి ఫలితాలు వస్తాయని ఆ పార్టీ కేడర్ అంతా ఆశిస్తోంది. అయితే ప్రియాంక గాంధీ ఆరంభంలోనే తప్పటడగులు వేస్తున్నట్టు ఆమె చర్యలను బట్టి అర్థమవుతోంది.
ఆదివారం ప్రియాంక గాంధీ పాలస్తీనా (Palastine) రాయబారి అబు జాజర్ తో సమావేశమయ్యారు. వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ విజయం సాధించడాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ పాలస్తీనా స్కార్ఫ్ ధరించారు. ఇవాళ లోక్ సభకు ప్రియాంక గాంధీ పాలస్తీన్ బ్యాగ్ తో వచ్చారు. ఇది విమర్శలకు తావిచ్చింది. గతంలో కూడా పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయెల్ (Isreal) కు వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ గళం వినిపించారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమెన్ నెతన్యాహూ అక్కడ మారణహోమం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇజ్రాయెల్ చర్యలపై ప్రపంచదేశాలు జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
వాస్తవానికి భారత్ విలీన మార్గాన్ని అనుసరిస్తుంది. రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నప్పుడు ఏ ఒక్క దేశానికీ భారత్ మద్దతుగా ఉండదు. రెండింటినీ సంయమనం పాటించాలని కోరుతుంది. వీలైతే చొరవ తీసుకుని శాంతింపచేస్తుంది. ఇజ్రాయెల్ తో భారత్ కు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. మన రక్షణ వ్యవస్థకు ఇజ్రాయెల్ వెన్నుదన్నుగా నిలుస్తోంది. అయినా అమెరికా లాగా ఇజ్రాయెల్ వైపు భారత్ ఏకపక్ష ధోరణితో నిర్ణయాలు తీసుకోలేదు. యుద్ధాన్ని విరమించి శాంతిచర్చలు ప్రారంభించాలని ఇరు దేశాలనూ కోరింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇజ్రాయెల్ ను తిడుతూ పాలస్తీనాకు మద్దతుగా నిలిచింది. కేవలం ముస్లిం (Muslim) ఓట్లకోసమే కాంగ్రెస్ ఇలాంటి పనులు చేస్తోందని.. ఆ పార్టీకి దేశ శ్రేయస్సు ముఖ్యం కాదని బీజేపీ (BJP) ఆరోపిస్తోంది. నేషన్ ఫస్ట్ అనేది మన పార్టీల లక్ష్యంగా ఉండాలి. దేశ భద్రత – రక్షణ విషయాల్లో అన్ని పార్టీలూ ఏకతాటిపైకి రావాలి. కానీ దురదృష్టవశాత్తూ మన పార్టీలు దేశ సంబంధింత అంశాలను కూడా రాజకీయాలకు వాడుకుంటు ప్రపంచదేశాల ముందు పరువు తీస్తున్నారు. నేడు ప్రియాంక గాంధీ చేసిన పని కూడా అదే. ఇలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా నేషన్ ఫస్ట్ (Nation First) అనే నినాదాన్ని కాంగ్రెస్ కూడా అందిపుచ్చుకుంటేనే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది.