Modi: పహల్గాం ఉగ్రవాదుల పీచమణిచాం.. బుల్లెట్ కు బుల్లెట్ తోనే సమాధానమన్న మోడీ..!

పహల్గాం ఉగ్రదాడి నిందితులు ముగ్గురిని హతమార్చినట్లు ప్రధాని మోడీ (Modi).. పార్లమెంటులో స్పష్టంచేశారు. భారతీయుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను.. భారత సైన్యం హతమార్చిందన్నారు. అంతే కాదు.. ఎవరైనా భారత్ పై ఉగ్రదాడికి పాల్పడితే , వారికి నూకలు చెల్లినట్లే అన్న విషయం.. ఆ మాస్టర్ మైండ్స్, వారిని ప్రోత్సహిస్తున్న దేశాలకు సైతం అర్థమైందన్నారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపినందుకు.. భారత్ విజయోత్సవాలు చేసుకుంటోందన్నారు ప్రధాని మోడీ.140 కోట్ల భారతీయుల ఐక్యత, ఇచ్ఛాశక్తి ఫలాలతో భారత్ విజయోత్సవాలు చేసుకుంటోందని తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’పై లోక్‌సభలో వాడీ వేడిగా జరిగిన చర్చకు సమాధానంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. కాల్పుల విరమణలో అమెరికా పాత్రను మరోసారి తోసిపుచ్చిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్, విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పాకిస్తాన్ (Pakistan) కాళ్ల బేరానికి రావడంతోనే ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ను నిలిపివేశామని ప్రధాని మోడీ సభలో స్పష్టం చేశారు. సిందూర్ ఆపాలంటూ ప్రపంచంలో ఏ నేత కూడా తమకు చెప్పలేదన్నారు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాతో ఫోన్‌లో మాట్లాడారు. పాక్ భారీగా దాడి చేయబోతోందని ఆయన హెచ్చరించారు. పాక్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని జేడీ వాన్స్‌కు చెప్పా. పాక్‌కు ఎవరు సాయం చేసినా.. చూస్తూ ఊరుకొనేది లేదని చెప్పాం. పాక్ ఎలాంటి దాడి చేసినా మేం చూసుకుంటామని వాన్స్‌కు చెప్పామన్నారు మోడీ. బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం చెప్తామని జేడీ వాన్స్‌కు చెప్పాం. పాక్‌కు ఎవరు సహాయం చేసినా.. చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశాం. పాక్‌కు చిరకాలం గుర్తుండిపోయే సమాధానం ఇచ్చాం. పాక్ డీజీఎం అర్ధరాత్రి ఫోన్ చేసి దాడులు ఆపాలని బతిమాలితేనే ఆపరేషన్ సిందూర్ నిలిపివేశాం. ’’ అన్నారు.
పాక్‌కు అండగా మూడు దేశాలే..
‘‘మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే పహల్గాం దాడులని మోడీ స్పష్టం చేశారు. ఈ దాడి తర్వాత ఉగ్రవాదులను మట్టిలో కలుపుతామని ప్రతినబూనాం. ద్రోహులకు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని చెప్పాం. ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పాలని అఖిలపక్ష భేటీలోనూ చర్చించాం. పాక్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశాం. పాక్ ఎయిర్ బేస్‌లు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాయి. అణుబాంబులు బెదిరింపులు చెల్లవని పాక్‌ను హెచ్చరించాం. ప్రపంచ దేశాలు ఆపరేషన్ సిందూర్‌ను సమర్థించాయి. 193 ప్రపంచ దేశాల్లో కేవలం మూడు దేశాలే పాకిస్థాన్‌కు అండగా నిలిచాయి’’ అన్నారు మోడీ.
‘‘ఆపరేషన్ సిందూర్‌ను ప్రపంచమంతా స్వాగతిస్తుంటే..కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోందన్నారు ప్రధాని మోడీ.. స్వార్థ రాజకీయాల కోసం సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోందన్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తద్వారా సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. మీడియా హెడ్‌లైన్లలో వచ్చేందుకు కొందరు నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మీడియా హెడ్‌లైన్లలో ఉండొచ్చేమో గానీ.. ప్రజల మనస్సుల్ని గెలవలేరు. పాకిస్థాన్‌ను కాంగ్రెస్ వెనకేసుకురావడం దౌర్భాగ్యం. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలోనూ కాంగ్రెస్ నేతలు ఇలాగే మాట్లాడారు. పైలట్ అభినందన్ పాక్‌కు చిక్కినప్పుడూ ఇలాగే మాట్లాడారు. పాక్ నుంచి అభినందన్‌ను మోడీ ఎలా తెస్తారో చూస్తామన్నారు. మేం ఆయన్ను సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చాం. విపక్షాల తీరు చూసి దేశమంతా నవ్వుకుంటోందన్నారు ప్రధాని మోడీ.