One Nation One Election: జమిలి ఎన్నికల బిల్లుకు మొదటి అడుగు..!

కొన్నేళ్లుగా జమిలి ఎన్నికల (duel elections) ప్రస్తావన దేశవ్యాప్తంగా జోరుగా వినిపిస్తోంది. 2024లోనే జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ (BJP) సిద్ధమైందనే ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు 2027లో ఒకేసారి లోక్ సభ (Loksabha), అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) నిర్వహించేందుకు ఎన్డీయే ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇన్నాళ్లూ ఆ జమిలి ఎన్నికల బిల్లు జోలికి మోదీ (Modi) ప్రభుత్వం ముందడుగు వేయలేదు. కానీ ఇవాళ తొలిసారి జమిలి ఎన్నికల బిల్లు లోక్ సభ ముందుకొచ్చింది. ఎంతోకాలంగా దీనిపై చర్చ జరుగుతుండగా.. ఇది తొలిసారి చట్టసభల్లోకి అడుగు పెట్టడంతో తదుపరి ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
జమిలి ఎన్నికల బిల్లుతో పాటు అందుకు అవసరమైన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్. అయితే ఈ బిల్లును చట్టసభల ముందుకు తీసుకురావడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, డీఎంకే తదితర పార్టీలు దీన్ని నిరసించాయి. రాజ్యాంగ మౌలిక స్వరూపానికే ఈ బిల్లు వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ మండిపడ్డారు. రాజ్యంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లును తీసుకొస్తున్నారని.. ఈ ఎన్నికలు నియంతృత్వానికి దారి తీస్తాయని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ విమర్శించారు. జమిలి ఎన్నికలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తాయని టీఎంపీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఆరోపించారు.
అదే సమయంలో టీడీపీ (TDP) సహా ఎన్డీయే మిత్రపక్షాలు స్వాగతించాయి. దీనిపై మాట్లాడిన టీడీపీ ఎంపీ, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సృజనాత్మక ఆలోచనలకు, దేశాభివృద్ధికి సంబంధించిన ఎలాంటి అంశాలకైనా టీడీపీ మద్దతుగా ఉంటుందని స్పష్టంచేశారు. జిమిలి ఎన్నికల నిర్వహణ అనేది కొత్తది కాదని.. 1983 నుంచి ఈ తరహా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఉందని న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ వివరించారు. వీటి వల్ల రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగమూ వాటిల్లబోదని స్పష్టం చేశారు. పలు దేశాల్లో జమిలి ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ బిల్లును జేపీసీకి పంపడానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని హోంమంత్రి అమిత్ షా వివరించారు.
అనంతరం ఈ బిల్లుపై హైబ్రిడ్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. కొంతమంది ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటుహక్కును వినియోగించుకోగా.. మరికొంతమంది స్లిప్పుల్లో ఓటు వేశారు. ఎలక్ట్రానిక్ పద్దతిలో 220 మంది ఈ బిల్లుకు మద్దతుగా, 149 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఇక స్లిప్పుల ద్వారా వేసిన ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. 269 మంది అనుకూలంగా.. 198 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి లభించినట్లయింది. ఓటింగ్ అనంతరం న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ ఈ బిల్లులను లోక్ సభలో ప్రవేశ పెట్టారు. వీటిపై చర్చ అనంతరం జేపీసీకి పంపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జమిలి ఎన్నికలకు తొలి అడుగు పడినట్లయింది.