South India: దక్షిణాదిలో ఎన్డీయే విస్తరణ.. చంద్రబాబు కీలక పాత్ర..!?

ఏ రాజకీయ పార్టీకి అయినా అధికారమే అంతిమ లక్ష్యం. స్వయంగా అధికారపగ్గాలు చేపట్టాలనుకుంటుంది. అయితే ఒక్కోసారి అది సాధ్యం కాదని భావించినప్పుడు ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసి అధికారాన్ని కైవసం చేసుకుంటూ ఉంటుంది. వరుసగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఉత్తరాదిలో (North India) తన హవా కొనసాగించగలుగుతోంది. కానీ దక్షిణ భారతదేశంలో (South India) మాత్రం బీజేపీ పప్పులు ఉడకట్లేదు. అందుకే ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు వార్తలొస్తున్నాయి. దక్షిణాదిన కూడా ఎన్డీయే (NDA) అధికారంలోకి వచ్చేందుకు అవసరైన చర్యలకోసం ప్రత్యేక టీం నియమించినట్లు తెలుస్తోంది.
దక్షిణాదిలో బీజేపీ పాగా వేయాలని ఎప్పటినుంచో ఆలోచిస్తోంది. అయితే ఒక్క కర్నాటక (Karnataka) మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీకి కాలం కలిసి రావట్లేదు. కర్నాటక తర్వాత ఒక్క తెలంగాణలో (Telangana) మాత్రమే ఆ పార్టీకి మంచి ఓట్ బ్యాంకు ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు (Tamilnadu), కేరళలో (Kerala) కమలం పార్టీ ప్రభావం నిర్ణయాత్మక స్థాయిలో లేదని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ (AP) లో టీడీపీ, జనసేనతో పొత్తు వల్ల అధికారంలో భాగస్వామి అవగలిగింది. అక్కడ కూడా ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా దక్కించుకుంటుందనే నమ్మకం లేదు. పొత్తులో ఉన్నప్పుడు మాత్రమే ఏపీలో బీజేపీ కాస్తోకూస్తో సీట్లు గెలుచుకోగలిగింది.
అయితే బీజేపీ ఇప్పుడు దక్షిణాదిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతోంది. ఒంటరిగా అధికారంలోకి రాలేకపోయినా ఇతర పార్టీలతో కలిసి అధికారాన్ని కైవసం చేసుకునేలా వ్యూహరచన చేస్తోంది. ఇందుకు ఎలా ముందుకెళ్తే బాగుంటుందో అధ్యయనం చేయాలంటూ ఓ ప్రత్యేక బృందాన్ని బీజేపీ హైకమాండ్ నియమించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, భూపేంద్ర యాదవ్, రామ్మోహన్ నాయుడితో కూడిన ఈ బృందానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వం వహిస్తారు. అంతేకాక.. రాష్ట్రాల వారీగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు అంతర్గత కమిటీలను కూడా నియమించినట్లు తెలుస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబునాయుడు (Chandrababu) కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. మోదీ, అమిత్ షా, నడ్డా ఎప్పటికప్పుడు చంద్రబాబుతో చర్చిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రాల వారీగా కీలక నేతలు, చేపట్టాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయా కమిటీలు ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నాయి. మంత్రులస్థాయి బృందం వీటిని ప్రయారిటీగా తీసుకుని క్లియర్ చేస్తోంది. అంతకుముందు వీటిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఒపీనియన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఏపీతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీలను సమన్వయం చేసుకుంటూ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు చంద్రబాబును ప్రధాన భాగస్వామిగా బీజేపీ పరిగణిస్తున్నట్టు న్యూఢిల్లీ వర్గాలు చెప్తున్న మాట.