Manmohan Singh: మౌనముని కాదు.. మన్మోహనుడే….

ఆర్థిక సంస్కరణలతో(economic reforms) దేశానికి దశ దిశ చూపిన ప్రధాని మన్మోహన్ సింగ్ అనడంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. 2004-14 మధ్య పదేళ్లపాటు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్.. ఆ సమయంలో ఎవరినీ నొప్పించకుండా.. తానొవ్వక అన్నట్లు పనిచేశారు. కాదు పాలించారు అనాల్సి ఉంటుంది. అయితే ఆసమయంలో ఆయనపై విపక్షాలు మౌనముని, మౌనముని అంటూ విమర్శలు సంధించాయి.కానీ ఆయన మాత్రం తాను చేయాల్సింది చేసుకుంటూ ముందుకెళ్లారు.
నిజంగా మన్మోహనుడు మౌనమునియేనా..? అంటే కాదు.. అని పక్కాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనకు దేశ అవసరాలే పరమావధిగా పనిచేశారు. అమెరికాతో అణుఒప్పందం(Nuke deal) విషయంలో ఈయన ఏం చేయగలరులే అని వామపక్షాలతో పాటు సొంత పార్టీనేతలు కూడా భావించారు. కానీ ఆయన ప్రశ్నే లేదని భీష్మించుకు కూర్చున్నారు. అలా అని మొండిగా ప్రవర్తించలేదు. ఓవైపు వారిని ఒప్పించడానికి ప్రయత్నించారు. అది ఎందుకు అవసరమో అర్థమయ్యేలా చూపారు. ఓదశలో ఈ ఒప్పందం చేసుకోకుంటే తాను పదవి నుంచి దిగిపోతానంటూ… తన వైఖరి కుండబద్దలు కొట్టారు మన్మోహన్.
అంతే కాదు.. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయమది..దేశ ఆర్థిక నిల్వలు 1.2 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఈ సమయంలో మన్మోహన్ సింగ్.. ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు కూడా. ఆర్బీఐ దగ్గర ఉన్న 44 టన్నుల బంగారాన్ని(gold) ఇంగ్లాండ్ దగ్గర తాకట్టు పెట్టారు. ఈ డబ్బును విదేశీ అప్పులు చెల్లించడానికి, దిగుమతులు నిర్వహించడానికి ఉపయోగించారు. బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన అవమానకర పరిస్థితి నుంచి .. దేశాన్ని బంగారు బాతులా మార్చిన ఘనత మన్మోహనుడిదే. ఆర్థిక సంస్కరణలు అమలు చేసి, దేశానికి దశ,దిశా చూపించడంలో కృతకృత్యులయ్యారు కూడా.
విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా నవ్వి ఊరుకోవడం మన్మోహనుడి స్టైల్. తెరవెనక గాంధీ కుటుంబం పాలిస్తోందని, మన్మోహన్ కేవలం ఓ డమ్మీ అని నాటి విపక్షాలు తీవ్రంగా ఆరోపించాయి. ఇవి ఆయన మనసుకు నొప్పించినా కూడా.. రాజకీయాల్లో ఇలాంటివి కామన్ అని తెలిసిన మన్మోహనుడు వాటికి పుస్తకరూపంలో బదులిచ్చారు. ఆసమయంలో తాను చేసిన కార్యక్రమాలతోపాటు పరిస్థితులను ఈ changing india పుస్తకంలో వివరించారు మన్మోహనుడు.
అందుకే ఇప్పుడు దేశం.. ఆయన సేవలను స్మరించుకుంటోంది. కాంగ్రెస్ ను గట్టిగా విమర్శించే ప్రదానిమోడీ(modi) కూడా.. మన్మోహనుడు దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. విశిష్టమైన రాజకీయ నాయకుడంటూ కొనియాడారు. దేశాన్ని ఆర్థిక సంస్కరణల వైపు నడిపించిన ధీశాలి అంటూ ప్రశంసించారు. అంతే మరి చేసినది చెప్పుకోకున్నా.. ప్రజల ముందు కనిపిస్తున్న వాస్తవాలివి. అంతటి అగ్రనేత, విజనరీ లీడర్ లేరన్న చేదువాస్తవం.. దేశాన్ని కలతపరుస్తోంది.