UPA Victories: మహర్షి.. నిగర్వి.. మన్మోహనుడు..

మన్మోహన్ సింగ్ (Manmohan Singh).. చూసేందుకు నెమ్మదిగా కనిపిస్తారు. కానీ ఆయన ఆలోచనా సరళి.. చాలా ముక్కుసూటిగా ఉంటుంది. తాను ఏం చేయాలనుకున్నది సైలెంట్ గా చేసేస్తారు. చేసేటప్పుడు ఆప్రణాళిక మహత్యం తెలియక విమర్శించిన వారే.. తర్వాతి కాలంలో మన్మోహన్ సింగ్ చేపట్టిన ప్రాజెక్టుల ఫలితాలివి అని ప్రశంసిస్తున్నారు కూడా.
మాజీ ప్రధాని మన్మోహన్ చేసిన ఘనకార్యాలు చెప్పుకోవాలంటే ఒకటి, రెండు కాదు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న,సన్నకారు రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వారికి ఊరట కలిగించిన వ్యక్తి మన్మోహన్ సింగ్.దేశంలో 3 కోట్లమంది చిన్న, సన్నకారు రైతులకు రూ.72 వేల కోట్ల రుణమాఫీ(LOAN WAIVER) చేసిన ఘనత మన్మోహన్ ప్రభుత్వానికి(manmohan government) దక్కుతుంది. రుణమాఫీపై ఆయన సర్కారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగానే 2009లో యూపీయే వరుసగా రెండోసారి అధికారంలోకి రాగలిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణమాఫీ హామీతో ఎన్నికలకు వెళ్లి గెలిచాయి. మన్మోహన్ హయాంలోనే విదర్భ, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు.
మన్మోహన్ సింగ్ పాలనా కాలంలోనే దేశంలో 3జీ, 4జీ సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం(mobile technology) ఊపందుకుంది. ఆధార్(Aadhar) కార్డుల జారీ మొదలైందీ ఆయన హయాంలోనే. మన్మోహన్ సర్కారు గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పనికి గ్యారెంటీ కల్పిస్తూ ఉపాధి హామీ(narega) పథకాన్ని తీసుకొచ్చింది. వివిధ పథకాల కింద నగదు సాయాన్ని ఆధార్ అనుసంధానమైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే (DBT) ప్రక్రియను ప్రారంభించింది. ప్రైవేటు పాఠశాలల్లోనూ కొందరు పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించింది. సామాన్యుడి చేతికి పాశుపతాస్త్రంలాంటి సమాచార హక్కును(right to act) అందించింది.
భూసేకరణ చట్టాన్ని ఆధునికీకరించి.. ప్రభుత్వ పథకాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే బాధితులకు అధిక పరిహారం, పునరావాసం అందించేలా మన్మోహన్ చర్యలు తీసుకున్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఆయన హయాంలోనే అవతరించింది. తన మైనార్టీ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకొని హెచ్చరికలు జారీ చేసినా వెరవకుండా అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్న ధైర్యశాలి మన్మోహన్. పార్టీ అధినాయకురాలిగా సోనియాగాంధీ(sonia) బలంగా ఉన్నప్పటికీ, నేతలంతా ఆమె కనుసన్నల్లోనే నడుచుకున్నప్పటికీ.. ఎక్కడా తన మాటకు విలువ తగ్గకుండా, దేశ గౌరవాన్ని తగ్గించకుండా చాకచక్యంగా ప్రధానమంత్రి పదవీ బాధ్యతలను నిర్వర్తించారు మన్మోహన్.
తన ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజార్టీ లేకున్నా రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు(mahila reservation) మన్మోహన్ ఆమోద ముద్ర వేయించారు. అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లునూ ఉభయసభల్లో గట్టెక్కించారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆయన హయాంలోనే రూపుదిద్దుకొంది. దిల్లీకి మరోవైపు జేవర్ ఎయిర్‌పోర్టుకూ భూసేకరణ చేపట్టి పునాదులు వేశారు. దేశ రాజధానితోపాటు చాలా నగరాల్లో మెట్రో రైలును(metro rail) విస్తరించారు. మన్మోహన్ హయాంలోనే ప్రతిభాపాటిల్ రాష్ట్రపతి పీఠమెక్కారు. తొలిసారి ఒక మహిళను దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘన కీర్తి ఆయన సర్కారుదే! మన్మోహన్ హయాంలోనే సేల్స్ ట్యాక్స్ స్థానంలో వ్యాట్(vat) ప్రవేశపెట్టారు. జీఎస్‌టీ(GST) విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చి.. రాష్ట్రాల మధ్య సమన్వయ సాధనకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించిన మౌలిక వసతులు పెంపొందించడానికి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్‌ను ప్రారంభించింది. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి జవహర్‌లాల్ నెహ్రూ అర్బన్ రెన్యూవల్ మిషన్‌ను ప్రారంభించి ఏడేళ్లలో 20 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
ప్రధానిగా మన్మోహన్ పదేళ్ల పదవీకాలంలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. ఆయన సర్కారుపై విమర్శలు, కుంభకోణాల ఆరోపణలు వెల్లువెత్తాయి. 2జీ, బొగ్గు, కామన్‌వెల్త్, ఆదర్శ్.. ఇలా చాలా కుంభకోణాలు ఆయన ప్రభుత్వాన్ని అతలాకుతలం చేశాయి. అయినప్పటికీ మన్మోహన్‌పై నేరుగా ఎవరూ వేలెత్తి చూపలేదు. 2008 నాటి ముంబయి ఉగ్రదాడి, 2012లో దిల్లీలో జరిగిన నిర్భయ ఘటన, అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశాన్ని ఊపేశాయి. అయినా ఎవరూ మన్మోహన్‌కు నిందల్ని ఆపాదించే సాహసం చేయలేదు.
తాను రాజకీయ సంక్లిష్టతల మధ్యే అత్యుత్తమ పరిపాలన అందించగలిగానని మన్మోహన్ ఓసారి విలేకర్ల సమావేశంలో చెప్పారు. ‘‘చుట్టూ ఉన్న పరిస్థితుల ఆధారంగా నేను పనిచేసుకుంటూ వెళ్లాను. అందువల్ల నేను చేసింది తప్పా, ఒప్పా అన్నది చరిత్ర చెబుతుంది’’ అని పేర్కొన్నారు. విలేకర్ల సమావేశాలు ఏర్పాటుచేసి జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలను దీటుగా ఎదుర్కొన్న ప్రధానమంత్రిగా మన్మోహన్‌కు పేరుంది. ఆయన అమెరికాతో సత్సంబంధాలు నెరిపారు. తన హయాంలో ఆ దేశాధ్యక్షులు జార్జ్ బుష్, ఒబామాలను భారత్‌కు రప్పించి ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలను ప్రపంచానికి చాటిచెప్పారు.