Delhi: ప్రభుత్వం నిర్లక్ష్యం ఖరీదు పహల్గాం ఉగ్రదాడి.. కేంద్రంపై కాంగ్రెస్ ముప్పేట దాడి

దేశంలో ఉగ్రదాడి జరిగినప్పుడల్లా ప్రధాని మోడీ.. ఆ ఉగ్ర సంస్థల పీచమణిచామని బలంగా చెబుతూ వచ్చారని.. మరి అలాంటప్పుడు పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని కాంగ్రెస్ ఎంపీలు సభలో ప్రధాని మోడీని నిలదీశారు. నిలదీశారు అనడం కన్న కార్నర్ చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ విపక్షనేత ఖర్గే.. మోడీపై ప్రశ్నల వర్షం కురిపిస్తే.. లోక్ సభలో రాహుల్ విరుచుకుపడ్డారు. మోడీ.. సైనిక బలగాలు అత్యున్నత గౌరవాన్ని.. మోడీ తన ప్రతిష్టను పెంచుకునేందుకు వాడుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. ఇది చాలా ప్రమాదకరమన్నారు. దేశం పరువు, ప్రతిష్టలను గంగలో కలిపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో ఉగ్రమూలాలు దెబ్బతిస్తే.. మరి ఉగ్రవాదులు పహల్గాం వరకు వచ్చి ఎలా దాడి చేశారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ప్రశ్నించారు. పహల్గాంలో భద్రతాపరమైన లోపాలకు హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’పై చర్చ సందర్భంగా రాజ్యసభలో ఖర్గే ప్రసంగించారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో దేశ సాయుధ దళాల శౌర్యపరాక్రమాలను ‘ఇండియా’ కూటమి ప్రశంసించిందని, దేశ ప్రయోజనాల కోసం కేంద్రానికి మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు.
‘‘పాకిస్థాన్ (Pakistan)కు విపక్షాలు మద్దతు ఇస్తున్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అబద్ధాలతో ఎక్కువకాలం ప్రజలను మభ్యపెట్టలేరు. మేం ఎప్పుడూ ఆ దేశానికి మద్దతు ఎవ్వలేదు. ఇవ్వబోమూ. ఉగ్రవాదాన్ని పాక్ పోషిస్తోందని మొదటి నుంచి చెబుతున్నాం. బీజేపీ హయాంలో ఉగ్రవాద సమస్య మూడింతలు పెరిగింది. ఉగ్రదాడులను నిరోధించడంలో ప్రభుత్వం తన లోపాలు, వైఫల్యాలను అంగీకరించాలి. ఆపరేషన్ సిందూర్ సమయంలో దాయాది దాడుల నుంచి సరిహద్దు ప్రజలను రక్షించడంలోనూ కేంద్రం తగు చర్యలు తీసుకోలేదు. పహల్గాం దాడికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ ఉగ్రదాడిలో ప్రమేయమున్న మిగిలిన ఉగ్రవాదులనూ గుర్తించి, శిక్షించాలి. అదేవిధంగా.. సరైన విదేశాంగ విధానాన్ని రూపొందించాలి’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.
భారత్- పాకిస్థాన్ కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలపై ప్రధాని మోడీ (Narendra Modi) ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ ఖర్గే ప్రశ్నించారు. మూడో పక్షం జోక్యాన్ని భారత్ సహించదన్నారు. పహల్గాం ఉగ్రదాడిపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని గైర్హాజరు కావడాన్ని మరోసారి తప్పుపట్టారు. అటువంటి కష్టకాలంలో బిహార్‌లో ఎన్నికల ప్రచారం చేశారని విమర్శించారు. ప్రతిపక్షాల లేఖలకూ ప్రధాని మోడీ స్పందించడం లేదంటూ ఖర్గే ఆరోపించారు.