Delhi: మోడీ సర్కార్ కుంభకర్ణ నిద్ర వీడడం మంచిదే.. జీఎస్టీ సంస్కరణలపై కాంగ్రెస్ సెటైర్…

వస్తు, సేవల పన్ను (GST) సంస్కరణల విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జ్ఞానోదయం కలిగిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఇన్నాళ్లకు కేంద్ర ప్రభుత్వం ‘కుంభకర్ణ నిద్ర’ వీడి మేల్కొనడం మంచి విషయమేనంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల పన్ను స్లాబులలో కీలక మార్పులు చేసిన నేపథ్యంలో ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
గత దశాబ్ద కాలంగా జీఎస్టీని సరళీకరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉందని ఖర్గే గుర్తుచేశారు. “మోదీ ప్రభుత్వం ‘ఒకే దేశం, ఒకే పన్ను’ అనే నినాదాన్ని ‘ఒకే దేశం, 9 పన్నులు’గా మార్చేసింది. 0%, 5%, 12%, 18%, 28% స్లాబులతో పాటు 0.25%, 1.5%, 3%, 6% ప్రత్యేక రేట్లను ప్రవేశపెట్టి గందరగోళం సృష్టించింది” అని ఆయన విమర్శించారు. సరళమైన పన్నుల విధానంతో ‘జీఎస్టీ 2.0’ను తాము 2019, 2024 మేనిఫెస్టోలలోనే ప్రతిపాదించామని తెలిపారు.
ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీనే జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకించారని ఖర్గే గుర్తు చేశారు. “2011లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ అడ్డుపడింది. కానీ ఇవాళ అదే బీజేపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు జరిగాయని సంబరాలు చేసుకుంటోంది. సామాన్యుల నుంచి పన్నులు వసూలు చేయడం గొప్ప ఘనత అన్నట్లుగా వ్యవహరిస్తోంది” అని ఆయన దుయ్యబట్టారు.
ఈ ప్రభుత్వం పాలు, పెరుగు, పిండి, ధాన్యాలతో పాటు వ్యవసాయ రంగానికి చెందిన 36 వస్తువులపై జీఎస్టీ విధించిందని, అందుకే తాము దీనిని ‘గబ్బర్ సింగ్ ట్యాక్స్’ అని పిలుస్తున్నామని ఖర్గే అన్నారు. వసూలవుతున్న మొత్తం జీఎస్టీలో 64 శాతం పేద, మధ్యతరగతి ప్రజల నుంచే వస్తోందని, కానీ కేవలం 3 శాతం మాత్రమే కుబేరుల నుంచి వస్తోందని ఆయన ఆరోపించారు.
తాజాగా చేపట్టిన సంస్కరణల వల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పోయే అవకాశం ఉన్నందున, 2024-25ను ఆధార సంవత్సరంగా తీసుకుని ఐదేళ్లపాటు పూర్తి పరిహారం చెల్లించాలని ఖర్గే డిమాండ్ చేశారు. అలాగే, సంక్లిష్టమైన జీఎస్టీ నిబంధనలను తొలగిస్తేనే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) నిజమైన ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.