ప్రపంచ ప్రియనేస్తం మోడీ.. కువైట్ ఇచ్చేసింది అత్యున్నత పౌర పురస్కారం…

భారత ప్రధాని నరేంద్రమోడీ(Modi).. ఇప్పుడు ప్రపంచదేశాలకు ప్రియనేస్తంగా మారారు. ఎక్కడికెళ్లినా, ఆదేశం తన అత్యున్నత పౌరపురస్కారాన్ని అందజేస్తోంది. మోడీ మా మిత్రుడు.. ఇండియాతో మాబంధం సుదీర్ఘ అనుబంధమంటూ ప్రకటిస్తోంది. అంతగా దగ్గరైపోయారు మోడీ.. మిత్రదేశాలకు. లేటెస్టుగా కువైట్ ప్రభుత్వం సైతం…తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్’ను ప్రదానం చేసింది. కువైట్ రాజు (Kuwait King) షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా దీనిని అందజేశారు.
గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బ్రిటన్ రాజు ఛార్లెస్ తదితరులు దీన్ని అందుకున్నారు. లేటెస్టుగా మోడీ సైతం ఈ జాబితాలో చేరిపోయారు. అంటే ఆస్థాయి నేతగా మోడీకి గుర్తింపు లభించిందన్నమాట. ఎందుకంటే మోడీ అన్ని దేశాలతోనూ చక్కని సంబంధాలు నెరుపుతున్నారు. ఓవైపు అమెరికా అధ్యక్షుడు బైడన్, కాబోయే అథ్యక్షుడు ట్రంప్ (trump)తో ఆలింగనం చేసుకోగలరు. అదే సమయంలో వారికి బద్ధశత్రువైన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చాయ్ తాగుతూ ముచ్చటించగలరు కూడా. అంతేనా ఉక్రెయిన్-రష్యా మధ్య ఘోరయుద్ధం జరుగుతోంది. అన్ని దేశాలు ఏదో వైపు చేరిపోయాయి. ఒక్క భారత్ మాత్రమే మధ్యస్తంగా నిలిచింది. శాంతివైపు మేముంటామని తేల్చి చెప్పింది ఇండియా.
వివిధ దేశాల నుంచి మోడీకి ఇంతవరకు 20 అంతర్జాతీయ పురస్కారాలు(international awards) లభించాయి. కువైట్ ఇచ్చిన తాజా పురస్కారాన్ని భారత ప్రజలకు, ఇరు దేశాల మిత్రబంధానికి అంకితం చేస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. తొలుత కువైట్ రాజప్రాసాదం వద్ద అధికారిక స్వాగతంతో పాటు గౌరవ వందనాన్ని ఆయన అందుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడటానికి తీసుకోవాల్సిన చర్యలపై కువైట్ రాజుతో చర్చలు జరిపారు. యువరాజు షేక్ సబా అల్-ఖలీద్ అల్-సబాతోనూ సమావేశమయ్యారు. రక్షణ, ఔషధ రంగం, ఐటీ, ఫిన్‌టెక్ వంటి కీలక రంగాల్లో సహకారంపై చర్చించినట్లు మోడీ ట్వీట్ చేశారు.
భారత్ పర్యటనకు రావాల్సిందిగా కువైట్ రాజు షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా(sabah al ahmad) ను ఆహ్వానించారు మోడీ. ఇద్దరు నేతల సమక్షంలో ప్రతినిధి బృందాలు నాలుగు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో, సైబర్ భద్రతలో సహకరించుకోవాలని తీర్మానించుకున్నాయి. 40 ఏళ్లతర్వాత ఇండియా ప్రధాని.. కువైట్ లో పర్యటించారు.